పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు ఉభయసభలు సమావేశం కానున్నాయి. NDA-2 ప్రభుత్వానికి చివరి మాన్సూన్ సెషన్ కావడంతో.. కీలక బిల్లులు పార్లమెంట్ ముందుకు తెచ్చేందుకు కసరత్తులు చేస్తోంది మోదీ సర్కార్. యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అయిదే దాన్ని తిప్పికొట్టాలని విపక్షాలు కూడా అంతే పంతంగా ఉన్నాయి. ఇతర బిల్లుల విషయంలోనూ బుల్ డోజింగ్ చేసే యత్నాలను ప్రతిఘటించే విషయంలో విపక్షాలన్నీ ఒక్కతాటిపై ఉండే అవకాశాలున్నాయి.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20 నుంచి ఆగస్టు 11 వరకు మాన్సూన్ సెషన్ జరగనుంది.
17 సిట్టింగ్‌ల్లో 27 రోజులపాటు ఉభయసభలు సమావేశం కానున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయాన్ని వెల్లడించారు. శాసన వ్యవహారాలు, ఇతర అంశాలపై ఫలప్రదమైన చర్చలకు సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తిచేశారు. వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్రం కసరత్తులు చేస్తోంది.
ఉమ్మడి పౌరస్మృతి బిల్లు కూడా ఈ లిస్ట్‌లో ఉందని సమాచారం. 2019 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ఇచ్చిన హామీల్లో యూనిఫాం సివిల్ కోడ్ ఒకటి. రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు హామీలు నెరవేర్చిన మోదీ సర్కార్.. యూసీసీ విషయంలోనూ ముందడుగు వేయాలని భావిస్తోంది. ఇప్పటికే చర్చలు, సంప్రదింపులు మొదలుపెట్టింది. మాన్సూన్ సెషన్లోనే ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టి.. స్టాండింగ్ కమిటీకి పంపాలన్నది కేంద్రం యోచనగా తెలుస్తోంది. అలాగే ఢిల్లీ పాలనాధికారాలపై తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లు కూడా.. ఈ సమావేశాల్లోనే సభ ముందుకు రానుంది. కేంద్రం ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది కేజ్రీవాల్ సర్కార్.
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇవే చివరి వర్షాకాల సమావేశాలు. కాబట్టి అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. మణిపూర్ అల్లర్లు, కోవిన్ డేటా లీక్, అమెరికాతో ప్రిడేటర్ డ్రోన్ డీల్ తదితర అంశాల్లో.. మోదీ సర్కార్‌ను నిలదీసేందుకు విపక్షాలు రెడీ అవుతున్నాయి.