తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎం.పి రేవంత్‌రెడ్డికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు మధ్య పార్లమెంట్‌లో వాగ్వివాదం జరిగింది. తెలంగాణ నుంచి వచ్చిన రేవంత్ హిందీ వీక్ అంటూ మంత్రి వ్యాఖ్యానించడంతో రేవంత్ తాను శూద్రుడిని అని నిర్మాలా బ్రహ్మణవాది కాబట్టి స్వచ్ఛమైన హిందీ మాట్లాడతారని కౌంటర్ ఇచ్చారు. దాంతో స్పీకర్ ఓం బిర్లా కలగుచేసుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే.
నేడు పార్లమెంట్ లో క్వశ్చన్ అవర్ సందర్బంగా రేవంత్ రెడ్డి రూపాయి విలువ పతనం గురించి కేంద్ర ప్రభుత్వాన్ని హిందీలో ప్రశ్నించారు. రోజురోజుకు రూపాయి విలువ పడిపోతుందని గతంలో మోదీ చెప్పిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని రూపాయి విలువ గురించి ప్రశ్నించారని ఇప్పుడు అదే ప్రశ్న నేను అడుగుతున్నానన్నారు. డాలర్ కు రూపాయి విలువ 60 నుంచి 70 మధ్యలో ఉన్నప్పుడే దేశ ఆర్ధిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఐసీయూలోకి తీసుకెళ్లిందని ఆనాడు గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ అన్నారని ప్రస్తుతం రూపాయి విలువ చూస్తుంటే మాత్రం ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఏకంగా మార్చురీకి తీసుకెళ్తుందా అని ప్రశ్నించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ తెలంగాణ నుంచి వచ్చిన గౌరవ సభ్యుడు తక్కువస్థాయి హిందీలో మాట్లాడుతున్నాడని అతడికి జవాబిచ్చేందుకు తాను కూడా తక్కువ స్థాయి హిందీలోనే మాట్లాడతానని అన్నారు. అప్పటి ఆర్ధిక వ్యవస్థ ఇప్పటి ఆర్ధిక వ్యవస్థ వేరు. కేవలం రూపాయి మారకపు విలువనే కాదు. ఇతర సూచీలను ప్రస్తావిస్తే బాగుంటుందని అన్నారు. అప్పటి ఆర్ధిక వ్యవస్థ మొత్తం ఐసీయూలోనే ఉందని కానీ తాము ఇప్పుడు ప్రగతిరథంలో నడిపిస్తున్నామని అన్నారు. కరోనా సమయంలో కఠిన సవాళ్లను ఎదుర్కొని వేగంగా అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ నేతలు సహించలేకపోతున్నారని అన్నారు. మంత్రి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి రియాక్టయ్యారు. తాను శూద్రుడ్ని అని తనకు స్వచ్ఛమైన హిందీ రాదని, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బ్రాహ్మణవాది అని ఆమెకు స్వచ్ఛమైన హిందీ వచ్చని పేర్కొన్నారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్పీకర్ తప్పు పట్టారు.
ఇక్కడ జాతి, మతం, ప్రాంతం వంటి ఆధారంగా కామెంట్లు చేయ రాదని సూచించారు. అలా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ మాట్లాడిన భాష చిచ్చుపెట్టేలా ఉందని ఆమె వైఖరి విచారకరం అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. బ్రిటీష్ వారి మాదిరిగానే బీజేపీ కూడా ఎల్లప్పుడూ విభజించి పాలించే రాజకీయాలను అనుసరిస్తుందని విమర్శించారు. వారు దేశ ప్రజలను భాష, ఆహారం, కులం, మతం ఆధారంగా విభజించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా మంత్రి తీరుపై భగ్గుమన్నారు. ఈ దేశంలో ఎవరైనా ఏ భాషనైనా మాట్లాడవచ్చని నిర్మలా సీతారామన్ హిందీయేతర భాషలు మాట్లాడే వారిపై బలవంతంగా హిందీని రుద్దడం ఆపాలని సూచించారు. మీరు అవమానించింది కేవలం రేవంత్ రెడ్డిని మాత్రమే కాదని తెలుగు మాట్లాడే వారితో పాటు దేశంలోని హిందీయేతర భాషలు మాట్లాడే ప్రజలను అవమానిస్తున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది.