మోదీకి చెక్ చెప్పేందుకు కాంగ్రెస్ వ్యూహం

By KTV Telugu On 14 April, 2023
image

బిజెపిని నిలువరించడానికి విపక్షాలు కొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బిజెపికి చెక్ చెప్పాలనుకుంటోన్న కాంగ్రెస్ పార్టీ విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు వినూత్న వ్యూహం రచించారు. అందులో భాగంగా విపక్షాలకు ఆమోద యోగ్యుడైన బిహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ను యూపీయే కన్వీనర్ గా చేయాలని నిర్ణయించారు. నితిష్ అయితే మోదీకి దీటుగా పోటీ ఇవ్వగలరని విపక్షాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ సారధ్యాన్ని వ్యతిరేకించే వారు కూడా నితిష్ అంటే ఓకే అంటారు అందుకే ఈ ప్లాన్. చాలా కాలానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఓ మంచి ఆలోచన చేసింది. నిజంగానే అది ఓ తెలివైన ఆలోచన. ఇంత వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పావులు కదపగలదని ఈ మధ్య కాలంలో ఎవరికీ అనిపించలేదంటే అతిశయోక్తి కూడా కాదు. అంత స్మార్ట్ మూవ్ తో అదరగొట్టింది కాంగ్రెస్ హై కమాండ్.

బిహార్ ముఖ్యమంత్రి జనతాదళ్ యునైటెడ్ పార్టీ అధినేత నితిష్ కుమార్ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నేత తేజస్వి యాదవ్ లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక భేటీలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ తో పాటు ఆర్జేడీ జేడీయూ సీనియర్ నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారధ్యంలోని బిజెపి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలన్నది విపక్షాల కామన్ అజెండా దీనిపైనే నేతలు చర్చించారు. దేశంలో బిజెపిని వ్యతిరేకించే పార్టీలతో పాటు కాంగ్రెస్ బిజెపిలకు సమాన దూరంలో ఉండే పార్టీలను కూడా ఒక్కతాటిపైకి తీసుకు రావాలన్నది కాంగ్రెస్ ఆలోచన. అందులో భాగంగా దేశంలోని వివిధ పార్టీలకు ఆమోద యోగ్యుడైన సీనియర్ రాజకీయ నాయకుని ముందు పెట్టుకుని పావులు కదపాలని భావించారు. హిందీ బెల్ట్ లో కీలకమైన బిహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నితిష్ కుమార్ కు అపార రాజకీయ అనుభవం ఉంది. పైగా బీసీ వర్గానికి చెందిన కుర్మి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు నితిష్ కుమార్. బిహార్ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా వివిధ హోదాల్లో ఎంతో సమర్ధ వంతంగా పాలన చేసిన అనుభవం నితిష్ సొంతం. ప్రత్యేకించి బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోదీకి దీటుగా నిలబడగల మరో అభ్యర్ధి విపక్షాల వద్ద లేరు. అందుకే మోదీని ఢీకొట్టగల సత్తా ఉన్న నితిష్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ చర్చలకు పిలిచింది.

నిజానికి మొన్న పార్లమెంటు సమావేశాలకు ముందే విపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తేవాలని కాంగ్రెస్ భావించింది. అయితే కాంగ్రెస్ సారధ్యంలో విపక్షాలు ముందుకు సాగితే బిజెపిని ఓడించడం ఎప్పటికీ సాధ్యం కాదంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోకాలడ్డారు. యూపీ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ సైతం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో తమకి పొత్తు ఉండదని అప్పుడే స్పష్టం చేశారు. దాంతో కాంగ్రెస్ ఆలోచనలో పడింది. ఎన్నికల అనంతరం పార్టీకి వచ్చిన సీట్ల ఆధారంగా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వేరే నిర్ణయం తీసుకోవచ్చు కానీ ఈలోగా విపక్షాల మధ్య ఐక్యత సాధించాలంటే ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలని కాంగ్రెస్ అర్ధం చేసుకుంది. విపక్షాల్లో చాలా మటుకు పార్టీలకు వాటి వాటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ నే ప్రధాన ప్రత్యర్ధి. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు కాంగ్రెస్ బిజెపిలే ప్రత్యర్ధులు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కు కూడా కాంగ్రెస్ బిజెపిలే ప్రత్యర్ధులు. తెలంగాణాలో బి.ఆర్.ఎస్.కు ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్సే ఉత్తర ప్రదేశ్ లోనూ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే నష్టపోతామని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారు.

సో ఇటువంటి పార్టీలన్నీ కూడా విపక్షాల కూటమికి కాంగ్రెస్ సారధ్యాన్ని ఒప్పుకోవడం లేదు. కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేస్తే తమ తమ రాష్ట్రాల్లో రాజకీయంగా నష్టపోతామని అవి భయపడుతున్నాయి. వీటితో పాటు విపక్షాలు కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేస్తే అపుడు మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ గా ప్రచారం జరుగుతుంది. ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ రాజకీయంగా అద్భుతంగా పరిణతి చెందినప్పుటికీ పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీకి సరియైన ప్రత్యర్ధిగా గా జనం చూసే పరిస్థితి ఉండదు. అదే నితిష్ కుమార్ అయితే రాజకీయంగానూ పాలనా పరంగానూ నరేంద్ర మోదీతో సరితూగగల నాయకుడిగా పేరుంది. అన్ని విపక్షాలే కాదు దేశ ప్రజలు కూడా నితిష్ కుమార్ ను ప్రధాని అభ్యర్ధిగా ఆమోదించే వీలు ఉంటుంది. ఇక రాహుల్ గాంధీ నాయకత్వంపై అనుమానాలు వ్యక్తం చేసిన మమతా బెనర్జీ సైతం నితిష్ కుమార్ నాయకత్వాన్ని వ్యతిరేకించకపోవచ్చు. అఖిలేష్ యాదవ్ కేజ్రీవాల్ వంటి నేతలకూ నితీష్ ఆమోదయోగ్యుడే అవుతారు. మరాఠా యోధుడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సైతం ఈ సమీకరణకు సై అనే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ రూట్ మార్చింది. ప్రస్తుతానికి అందరికీ ఆమోద యోగ్యుడైన నితీష్ కుమార్ ను తెరపైకి తేవాలని డిసైడ్ అయ్యింది.

ఇక భావసారూప్యత కలిగిన పార్టీలన్నింటినీ తమతో కలుపుకు పోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే కొద్ది రోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మహారాష్ట్రలో శివసేన మాజీ సిఎం ఉద్ధవ్ థాకరే లతకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే స్వయంగా ఫోన్ చేసి విపక్షాల ఐక్యతకు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఖర్గే పిలుపుకు ఆ రెండు పార్టీలు కూడా సానుకూలంగా స్పందించాయి. ఇక ఈ కూటమిలో ఎవరెవరు కలుస్తారో ప్రయత్నాలు చేసుకుపోవడమే మిగిలి ఉంది. గతంలో నేషనల్ ఫ్రంట్ కు ఏపీకి చెందిన తెలుగుదేశం అధినేత నాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కన్వీనర్ గా ఉన్నారు. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కన్వీనర్ గా వ్యవహరించారు. యూపీయే కూటమికి సోనియా గాంధీ ఛైర్ పెర్సన్ గా వ్యవహరించారు. అయితే ఈ ముగ్గురూ కూడా ప్రధాని పదవిని అలంకరించలేదు. కేవలం విపక్ష కూటమికి సారధ్యం వహించారంతే. ఇపుడు నితిష్ పరిస్థితి కూడా అంతేనా అంటే అంతే అని చెప్పలేం. 2024 ఎన్నికల్లో పార్టీలకు వచ్చిన బలా బలాలను బట్టి సమీకరణలు మారిపోతాయి. ఉదాహరణకు వచ్చే ఎన్నికల్లో జేడీయూ ఆర్జేడీ కూటమి బిహార్ లో 30కి పైగా ఎంపీ స్థానాలు సొంతం చేసుకుని భాగస్వామ్య పక్షాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎంపీ స్థానాలు సాధిస్తే నితిష్ కుమార్ ప్రధాని అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.

అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరిస్తే మాత్రం ఈ విపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు నివ్వాల్సి ఉంటుంది. అపుడు కాంగ్రెస్ పార్టీ తరపున ఒకరు ప్రధాని అవుతారు. మిగతా పక్షాలు ప్రభుత్వంలో భాగస్వాములు అవుతాయి. కాంగ్రెస్ కు అంత బలం రాకుండా బిజెపికీ ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం లేకపోతే మాత్రం విపక్షాల ఉమ్మడి ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాల్సి ఉండచ్చు. రాహుల్ గాంధీ లెక్క ఒక్కటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెండు వందల స్థానాలు దక్కితే అపుడు ఎలాగూ పగ్గాలు కాంగ్రెస్ చేతుల్లోనే ఉంటాయి. అపుడు విపక్షాలన్నీ కూడ బేషరతుగా యూపీయే త్రీకి మద్దతునిస్తాయి. ఒక వేళ కాంగ్రెస్ కు 2014, 2019 ఎన్నికల్లో వచ్చినట్లే యాభై లోపు స్థానాలే వస్తే అపుడు విపక్షాలు ఎలా చెబితే అలా వినక తప్పదు. అప్పుడైనా నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి కేంద్రంలో అధికారంలోకి రాకుండా ఉంటే అంతే చాలునని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సోనియా కూడా అదే ఆకాంక్షిస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఈ కొత్త సమీకరణకు అండగా ఉండచ్చని అంటున్నారు. అయితే దేశ ప్రజలు 2024లో ఏం చేస్తారన్నది చూడాలిక.