బిజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత బిహార్ సీఎం నితీశ్ కుమార్ తెగ యాక్టివ్ అయిపోయారు. బీజేపీతో స్నేహానికి వైరానికి మధ్య దోబూచులాటను వదిలేసి ఇప్పుడు పర్మినెంట్ శత్రువుగా మారే ప్రయత్నంలో ఉన్నారు. కమలనాథులను గద్దే దించాలంటే మిగతా వారంతా కలిసి పనిచేయాలని నితీశ్ కోరుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్ధిగా నితీశ్ కుమార్ ఉంటారని పట్నాలో పోస్టర్లు వెలిశాయి. పార్టీ ఆఫీసు పరిసర ప్రాంతాలతో పాటు నగరంలోని మరికొన్ని చోట్ల ప్రధానమంత్రి అభ్యర్ధిగా నితీష్ అని పెద్ద పోస్టర్లు దర్శనమిచ్చాయి. దాంతో బిహార్లో ఒక్కసారిగా సంచలనం మొదలైపోయింది. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయేని ఓడించటమే ధ్యేయంగా చాలామంది ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగా లేటెస్టుగా నితీష్ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. పోస్టర్లు ఒక తంతు మాత్రమే. కొందరు ఔత్సాహికులు చేసిన పని మాత్రమే. నితీశ్ అండ్ కో అసలు వ్యూహం మాత్రం వేరే ఉందని చెప్పాలి.
కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేసేందుకు నితీశ్ ఇష్టపడుతున్నారు. అప్పుడు మాత్రమే మోదీని ఓడించడం సాధ్యమని ఆయన భావిస్తున్నారు.అందుకే బీజేపీయేతర పార్టీలను కలుపుకుపోయే పనిలో పడిపోయారు. బీజేపీయేతర విపక్షాలకు దేశంలో 240 ఎంపీ స్థానాల వరకు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో మరో 70 నుంచి 100 స్థానాల వరకు సాధించగలిగితే అది పటిష్టమైన కేంద్ర ప్రభుత్వం అవుతుందని నితీశ్ అంచనా వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ వారిని అనుసరించాలని హస్తం పార్టీకి బలమున్న చోట ఆ పార్టీ లీడ్ తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నారు. యూపీ బిహార్ జార్ఖండ్ రాష్ట్రాల్లో సమాజ్ వాదీ ఆర్జేడీ జేడీయూ జేఎంఎంలు నాయకత్వం బాధ్యత తీసుకుంటూ మధ్యప్రదేశా్ రాజస్థాన్ ఛత్తీస్ గఢ్లో కాంగ్రెస్ కు నాయకత్వం వదిలెయ్యాలన్నది నితీష్ ఫార్ములాగా చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో వారి వారి బలాబాలలను బట్టి ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నారు. దక్షిణాదిన కాంగ్రెస్ కు సొంత మిత్రపక్షాలుండగా కొన్ని రాష్ట్రాల్లో సొంత బలం మీద గెలిచే ప్రయత్నంలో ఉంది.
కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేసేందుకు నితీష్ సముఖంగా ఉన్నప్పటికీ రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు ఆయన ఒప్పుకోవడం లేదు. రాహుల్ గాంధీ వ్యవహార శైలి వారికి నచ్చడం లేదు. భారత్ జోడో యాత్ర సక్సెస్ అయిందని అంగీకరిస్తూనే రాహుల్ ను నాయకుడిగా అంగీకరిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. అసలు విపక్షాల పీఎం అభ్యర్థి ప్రకటన ఇప్పుడే వద్దని యూపీ బిహార్లోని ప్రాంతీయ పార్టీల వాదన. దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల ఆధారంగా ఎన్నికల బరిలోకి వెళ్లాలని నితీశ్ సహా పలువురు నేతలు అంటున్నారు. ధరల పెరుగుదల నిరుద్యోగం పెట్టుబడుల ఉపసంహరణ దళితులపై అత్యాచారాలు దౌర్జన్యాలు లాంటి ఆంశాలను జనంలోకి తీసుకెళ్లి ఎన్నికల అంశాలను చేయాలని నితీశ్ ప్రతిపాదిస్తున్నారు.
నిజానికి ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో నితీశ్ పలువురు నేతలను కలుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అయి విధివిధానాలను చర్చించారు. ఉత్తరాదిలో పార్టీలు కలిసొచ్చేందుకు సిద్దంగా ఉన్నాయని ఆయన ఖర్గే దృష్టికి కూడా తీసుకెళ్లారు. కాకపోతే అఖిలేశ్ మాయావతి మమతను కాంగ్రెస్ స్నేహితులుగా మార్చడమెలాగన్నదే పెద్ద ప్రశ్న అవుతుందని ఇద్దరు నేతలు అంగీకరిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఆధిపత్యాన్ని స్వీకరించేందుకు వాళ్లు ఒప్పుకోరని తెలుసు. పైగా అవకాశం వస్తే ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు తాము సిద్దమని కూడా వాళ్లు ప్రకటిస్తారు. క్రమంగా ప్రాబల్యం కోల్పోతున్న కాంగ్రెస్ ను నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించే వాళ్లూ ఉన్నారు. అందుకే నితీశ్ ప్రధానమంత్రి అభ్యర్థి అంటూ తెలివిగా పోస్టర్లు వేశారనుకోవాలి. అప్పుడు కాంగ్రెస్ కూడా సమాన హక్కులున్న పార్టీ మాత్రమేనని ఎవరూ ఎక్కువ సమానులు కాదని చెప్పినట్లవుతుందని నితీశ్ అనుచరులు లెక్క గడుతున్నారు.
కొత్తపోత్తుల ప్రస్తావనలో తెలుగు రాష్ట్రాల పార్టీలను కలుపుకుపోయే ప్రయత్నం కనిపించడం లేదు. బీఆర్ఎస్ పేరుతో జాతీయ స్థాయిలో హడావుడి చేయాలనుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానించేందుకు ప్రయత్నంచడం లేదు. కేసీఆర్ జగన్ కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. వాళ్లిద్దరూ బీజేపీ పక్షమేనన్న అనుమానాలు ఉత్తరాది నాయకుల్లో ఉంది. కేసుల భయంతో జగన్ బీజేపీ వెంటే ఉంటారని వారి అనుమానం. సొంత గేమ్ ప్లాన్ అమలు చేసే కేసీఆర్ ను కలుపుకుపోవడం కష్టమని కూడా వారు గుర్తుంచారు. చంద్రబాబు నాయుడు అధికారంలో లేకపోవడం ఆయన పార్టీకి ఎన్ని లోక్ సభా స్థానాలు వస్తాయో తెలియకపోవడంతో టీడీపీ అధినేతతో చేతులు కలిపే ఛాన్స్ ఇప్పట్లో కనిపించడం లేదు. ఏదేమైనా నితీశ్ ప్రయత్నాల్లో కొంత సొంత ప్రయోజనమైతే కనిపిస్తోంది.