అధికార పార్టీల్లోని వారు తీవ్రమైన నేరాలు చేసినా అసలు కేసులు పెట్టకపోవడం అనే ఓ దుర్మార్గమైన సంస్కృతి ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. ఇప్పటి వరకూ తప్పులు చేసి అధికార పార్టీల్లో చేరి రక్షణ పొందేవారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా తీవ్రమైన హత్యా నేరాలు ఎదుర్కొంటున్న నేతలపైనా ఇప్పుడు కేసులు నమోదు కావడం కష్టంగా మారింది. అదే విపక్ష పార్టీలకు చెందిన నేతలపై అయితే ఏమీ చేయకపోయినా ఏదో ఓ కేసు పెట్టి అరెస్టులు చేయడం కామన్ అయిపోయింది. రాజ్యాంగం చట్టాలు పూర్తిగా అమలు చేసే వారి చేతిలో టూల్స్ గా మారిపోయాయా ఇలా జరిగితే చట్టాల రక్షణ ప్రజలకు ఎలా లభిస్తుంది.
చట్టం అందరికీ ఒకటే అని చెబుతారు కానీ అది అబద్దం. ఓ చట్టం అధికారంలో ఉన్న వారికి చుట్టం. రాజ్యంలో కొంత మందిని శత్రువులుగా మరికొంత మంది మిత్రులుగా చూసి చట్టాన్ని శత్రువులకు మాత్రమే వర్తింప చేస్తే రాజ్యం అల్లకల్లోలం అవుతుంది. అధికారం అనుభవించామా లేదా అన్నట్లుగా పాలకుల మైండ్ సెట్ మారిపోయింది. ఇన్ కంట్యాక్ అధికారులు అనేక చోట్ల సోదాలు చేసి వందల కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. వాటిపై కేసులేమయ్యాయో ఎవరికీ తెలియదు. కానీ ప్రతిపక్షాలకు చెందిన వారిపై ఎప్పటి కేసులో వెలుగులోకి తెస్తున్నారు. వారిపైనే కేంద్ర సంస్థలు దృష్టి కేంద్రీకరించడం అధికార పార్టీ వారిని కాని వాటి మిత్రపక్షాల జోలికి కానీ వెళ్లడం లేదు. రాజకీయ అవినీతి పరుల్ని అవసరాల కోసం ఉపేక్షించడం వల్ల అవినీతి పరులు న్యాయస్థానాలను లక్ష్యంగా చేసుకున్నారు. న్యాయవ్యవస్థపై భీకరంగా దాడి చేస్తున్నారు. విశ్వసనీయతను తగ్గించేందుకు శక్తివంచన లేకుండా చేస్తున్నారు.
కేసులు ఎదుర్కొని బీజేపీలో చేరిన వాళ్లు కానీ బీజేపీతో సన్నిహితంగా ఉంటున్న వారు కానీ ఎప్పుడైనా విచారణకు హాజరవడం చూశారా. వారు ఇతర పార్టీల్లో ఉన్నప్పుడు సమన్లు మీద సమన్లు వెళ్లాయి. కానీ బీజేపీలో చేరిన తర్వాత ఎందుకు పట్టించుకోలేదు. అది ఆర్థిక పరమైన అవినీతి మాత్రమే కాదు. హత్యలు అత్యాచారాలు లాంటి దారుణమైన ఘటనలకు పాల్పడే వారికి కూడా బీజేపీ ఓ షెల్టర్‌గా మారిపోయింది. వారిపై ఈగ వాలడం లేదు. బీజేపీలో చేరే వారే కాదు వారి రాజకీయ అవసరాలు తీర్చే వారిలో అవినీతి పరులు ఉన్నా రక్షిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొన్ని వేల కోట్ల ప్రజాధనం బొక్కేసి నిర్భయంగా రాజకీయాలు చేస్తున్నవారు విచారణలు ఆలస్యం చేసుకుంటూ ఇంకా ఇంకా దోపిడికి పాల్పడుతున్న వారు కళ్ల ముందే ఉన్నారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా వారిని రాజకీయ అవసరాల కోసం కాపాడుతూనే ఉన్నారు.
వ్యవస్థలన్నీ బలంగా ఉన్న దేశాల్లో మాత్రమే ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. రాజకీయాలు అధికారుల మధ్య వ్యవస్థలు చిక్కుకుపోయిన దేశాలు అల్లకల్లోలంగా మారాయి. ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోక ముందే మేల్కొనాల్సి ఉంది. పక్షపాతం చూపించకుండా చట్టాలన్నీ అందరికీ వర్తింప చేయాలి. మన పార్టీ వాడు మన వాడు అని కాకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కర్ని శిక్షించాలి. ఆలస్యం కాకుండా న్యాయం అందించాలి. లేకపోతే మొదట చెప్పుకున్నట్లుగా దేశం కొంత మందిదే అవుతుంది. అప్పుడు మిగిలిన వారిలో అలజడి ప్రారంభమవుతుంది. ఇప్పుడిప్పుడే ఆ సూచనలు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా వెల్లువెత్తుతున్న నిరసనలే కనిపిస్తున్నాయి. రైలు బోగిలు దహనమవుతున్నాయి. ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి. రెండు వైపులా విధ్వంసం జరుగుతోంది. చివరికి ఈ పరిస్థితి ఎక్కడికి చేరుతుందో అంచనా వేయడం కష్టం. పరిస్థితిని ప్రమాదాన్ని పాలకులు ఇప్పుడైనా గుర్తించాల్సి ఉంది.
రాను రాను దేశం కాస్త క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్తోందన్నది నిజం. వ్యవస్థలు బలహీనం అవుతున్నాయి. పార్టీలు ప్రజల్ని విడగొడుతున్నారు. మెజార్టీతో పరిపాలించాలనుకుంటున్నారు. ఈ ధోరణితో మెజార్టీ ప్రజలు తమ వాళ్లు తప్పు చేసినా ఉపేక్షిస్తున్నారు. ఇది అంతిమంగా దేశానికి ప్రజలకు నష్టం చేస్తుంది.