నాగాలాండ్ మేఘాలయ ఎన్నికలకు సర్వం సిద్ధం

By KTV Telugu On 28 February, 2023
image

ఈశాన్య రాష్ట్రాలు మేఘాలయ నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ నెల 27న పోలింగ్‌ నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈశాన్యంపై పట్టు బిగించాలని బీజేపీ ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్ పోరాడుతుండగా ఎప్పటిలాగే చిన్న పార్టీలు కీలకంగా మారాయి.

ఈశాన్య భారతంలో ఎన్నికలంటే చిన్న పార్టీలదే హవా. ప్రాంతీయ పార్టీల మద్దతుతో ప్రభుత్వాలను నడిపిస్తుంటాయి
జాతీయ పార్టీలు. అయితే తొలిసారిగా మేఘాలయలో అన్ని స్థానాల్లో పోటీకి దిగింది భారతీయ జనతా పార్టీ. గత ఎన్నికల్లో రెండే సీట్లు గెలిచిన కమలదళం ఈసారి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేయాలని తహతహలాడుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మేఘాలయలో హంగ్‌ ఏర్పడింది. ముకుల్ సంగ్మా సారథ్యంలో 21 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. 19 స్థానాలు గెలిచిన నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ NPPకి 2 సీట్లు గెలిచిన బీజేపీ మద్దతిచ్చింది. యూడీఎఫ్ పీడీపీ హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ స్వతంత్రులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కొంతకాలానికి బీజేపీ, NPP మధ్య విభేదాలు ముదిరాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మారక్‌ను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది.

మారక్‌కు ఈసారి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన బీజేపీ గారో హిల్స్‌లో ఉన్న 24 అసెంబ్లీ స్థానాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.
ముకుల్ సంగ్మా తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడంతో మేఘాలయ కాంగ్రెస్‌ కకావికలమైంది. ముఖ్యనేతలంతా తలోదారి చూసుకోవడంతో మెజార్టీ స్థానాల్లో కొత్త ముఖాలను పోటీకి నిలబెట్టింది. ఈశాన్య రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న టీఎంసీ ఈసారి బలమైన పక్షంగా మారుతుందనే అంచనాలున్నాయి. అటు నాగాలాండ్‌లో మొత్తం 12 పార్టీలు బరిలో ఉన్నాయి. అధికార కూటమి బీజేపీ-NDPP తాజా ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తున్నాయి. NDPP 40 సీట్లలో బీజేపీ 20 నియోజకవర్గాల్లో బరిలో నిలిచాయి. గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్‌ను పరిశీలిస్తామని హామీఇవ్వడంతో పాటు రాష్ట్ర జనాభాలో 88శాతంగా ఉన్న క్రిస్టియన్లను ఆకట్టుకోవడం ద్వారా అధిక సీట్లలో గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది కమలదళం. క్రిస్టియన్‌ ఓటు బ్యాంకుపై గంపెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్ 23 సీట్లలో మాత్రమే పోటీచేస్తోంది. గత ఎన్నికల్లో 26 సీట్లు గెలిచిన నాగా పీపుల్స్ ఫ్రంట్ ఈసారి కేవలం 22 సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టగలిగింది. మార్చి 2న నాగాలాండ్‌, మేఘాలయతోపాటు త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.