కమలంపై విపక్షాల దండయాత్ర

By KTV Telugu On 9 April, 2023
image

2024 ఎన్నికల్లో మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్ కు వివిధ విపక్షాల నుండి మద్దతు రావడంతో హుషారుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇదే వేడిని కొనసాగించాలని కాంగ్రెస్ నాయకత్వం కసిగా ఉంది. నిరాటంకంగా ఏదో ఒక కార్యక్రమంతో విపక్షాలతో కలిసి మెలసి ముందుకు సాగాలని కాంగ్రెస్ కృత నిశ్చయంతో ఉంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ బిజీ అయిపోయింది ఊరికే రెస్ట్ తీసుకుని కూర్చుంటే పనులు కావనుకున్న హస్తం పార్టీ నేతలు విపక్షాలను కాంగ్రెస్ వైపు ఆకర్షించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ప్రతిఘటించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపైనా రూపొందించుకోవలసిన ప్రణాళికలపైనా చర్చించేందుకు భావసారూప్యత కలిగిన విపక్షాలతో సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

కాంగ్రెస్ నిర్వహించాలని భావిస్తున్న సమావేశానికి రావల్సిందిగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లతో పాటు ఇటీవలం తమకు మద్దతుగా ఉన్న 14 విపక్షాలకు ఆహ్వానాలు పంపాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశానికి మమతా బెనర్జీ వస్తారా రారా అన్నది అనుమానమే అంటున్నారు. ఎందుకంటే ఇటీవల కొద్ది నెలలుగా విపక్షాలు నిర్వహించిన ఏ సమావేశానికీ మమతా బెనర్జీ రాలేదు. రాకపోగా రాహుల్ గాంధీ సారధ్యంలో విపక్షాలునడిస్తే బిజెపిని ఎప్పటికీ ఓడించలేం అంటూ ఓ స్టేట్ మెంట్ కూడా చేశారు దీదీ. ఆమె తో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా వచ్చే ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని చాటి చెప్పారు. అయితే ఈ ప్రకటనల తర్వాతనే రాహుల్ గాంధీ కి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2019 ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ దొంగల ఇంటిపేర్లన్నీ మోదీ అనే ఎందుకు ఉంటాయో అని వ్యాఖ్యానించారు. దీనిపై సూరత్ కు చెందిని బిజెపి నేత ఒకరు పిటిషన్ దాఖలు చేశారు. ఓబీసీ వర్గానికి చెందిన మోదీ ఇంటి పేరును అవమానించారంటూ ఫిర్యాదు చేశారు. నాలుగేళ్లుగా దీనిపై విచారణ జరిపిన కోర్టు మొన్న మొన్ననే రాహుల్ ని దోషిగా ప్రకటించింది. ఆ వెంటనే లోక్ సభ సెక్రటేరియట్ రాహుల్ సభ్యత్వంపై అనర్హత వేటు వేసేసింది. ఇది రాహుల్ కి అనుకోని వరంగా పరిణమించింది. చాలా కాలంగా రాహుల్ కు దూరంగా ఉన్న విపక్ష నేతలు సైతం రాహుల్ పై అనర్హత వేటును ఖండించడమే కాకుండా రాహుల్ కు అండగా నిలిచారు. ఇలా మద్దతు పలికిన వారిలో మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ లు కూడా ఉండడంతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీలోనూ కొత్త ఉత్సాహం నింపింది.

ఈ ఊపులోనే విపక్షాలన్నింటినీ తన దారికి తెచ్చుకుని తీరాలని కాంగ్రెస్ నాయకత్వం పట్టుదలగా ఉంది. వీలైనన్ని ఎక్కువ విపక్షాలను సమావేశానికి ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారట. దానికి స్టాలిన్ కూడా తప్పకుండా వస్తానని సుముఖత వ్యక్తం చేశారని అంటున్నారు. అలాగే మమతా బెనర్జీని కూడా పిలిచారు కానీ ఆమె వచ్చేదీ రానిదీ ఇంత వరకు తేల్చలేదు. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య ధోరణి ప్రదర్శించకుండా చిన్నా పెద్ద విపక్షాల ఈగోలు దెబ్బతీయకుండా మర్యాదగా స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తేనే అన్ని పార్టీలూ కాంగ్రెస్ ను నమ్ముతాయని రాజకీయ పండితులు అంటున్నారు. విపక్షాల అండ లేకుండా కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు. ఒక వేళ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 200 స్థానాలు గెలుచుకున్నా కూడా విపక్షాల మద్దతుతో యూపీయే త్రీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఆ రెండు వందల స్థానాలు గెలవాలన్నా కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు అవసరం. అందుకే కాంగ్రెస్ నాయకత్వం భేషజాలు పక్కన పెట్టి అన్ని పార్టీలనూ సమానంగా గౌరవిస్తూ ముందుకు పోవాలన్న వ్యూహంతో ఉందంటున్నారు. విపక్షాల భేటీని ఎప్పుడు నిర్వహించాలి ఎక్కడ నిర్వహించాలి అన్నవి ఇంకా నిర్ణయించలేదు. అయితే వీలైనంత త్వరలోనే ఈ భేటీ ఉంటుందని అంటున్నారు. ఇప్పటి నుండి 2004 ఎన్నికల వరకు దేశ వ్యాప్తంగా ఉన్న విపక్షాలను ప్రత్యేకించి బిజెపిని వ్యతిరేకించే పార్టీలను కలుపుకుపోవడంపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారిస్తోంది. ఇది మంచి పరిణామమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.