ఇవాళ ఢిల్లీ – రేపు ఇతర రాష్ట్రాలు ! ఆ ఆర్డినెన్స్ డెమెక్రసీకి ఇంత డేంజరా

By KTV Telugu On 30 May, 2023
image

మనది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేసిన రాజ్యాంగం ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే పవర్ ఫుల్. అయితే అలాంటి ప్రభుత్వానికి కూడా అధికారాలు తగ్గించి పాలన బాధ్యత మీది కాదు మాది అని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ఢిల్లీలో జరుగుతున్న వివాదానికి మూలం ఇదే. ఇవాళ ఢిల్లీకి వర్తింప చేసిన ఆర్డినెన్స్ రేపు ఇతర రాష్ట్రాలకూ వర్తింప చేస్తారు. అందు కోసం చట్టంలో ఒక మార్పు చేస్తే చాలు. అప్పుడేమవుతుంది. దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురయినట్లు అవుతుంది. రాజకీయ పార్టీలు ఆ ఆర్డీనెన్స్ ను రాజకీయ కోణంలోనే చూస్తున్నాయి. అందుకే కొంత మంది మౌనంగా కొంత మంది మద్దతుగా కొంత మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ ఆ ఆర్డినెన్స్ ప్రభావం దేశంపై ఎంత తీవ్రంగా పడుతుందో మాత్రం విశ్లేషించడం లేదు.

రాష్ట్రాల పునర్విభజన సంఘం (ఎస్ఆర్సీ) సిఫార్సుల మేరకు 1956లో ఢిల్లీ రాష్ట్ర హోదాను రద్దు చేశారు. 1956 నవంబర్ 1న అమల్లోకి రాష్ట్రాల పునర్వభజన చట్టం అమల్లోకి రాగా పార్ట్-సి లో ఢిల్లీకి స్థానం కల్పించలేదు. దీంతో ఆరోజు నుంచే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. రాష్ట్రాల పునర్విభజన సంఘం (ఎస్ఆర్సీ) సిఫార్సుల మేరకు 1956లో ఢిల్లీ రాష్ట్ర హోదాను రద్దు చేశారు. 1956 నవంబర్ 1న అమల్లోకి రాష్ట్రాల పునర్వభజన చట్టం అమల్లోకి రాగా పార్ట్-సి లో ఢిల్లీకి స్థానం కల్పించలేదు. దీంతో ఆరోజు నుంచే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. 1993లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగ్గా బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ సీఎం మదన్ లాల్ ఖురానా, లెఫ్టినెంట్ గవర్నర్ పీకే దేవ్ మధ్య విబేధాలు రావంతో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ జోక్యం చేసుకుంది. 1998లో ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేశారు. దీని ప్రకారం ఢిల్లీ ప్రభుత్వం ప్రతి విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను సంప్రదించాలి. ఢిల్లీ అసెంబ్లీలో బిల్లును ఓటింగ్‌కు తేవాలన్నా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తప్పనిసరి. అప్పట్లో కాంగ్రెస్ దెబ్బకు బీజేపీ బాధితురాలు. ఇప్పుడు బీజేపీ దెబ్బకు ఆమ్ ఆద్మీ పార్టీ బాధితురాలు.

ఢిల్లీలో శాంతి భద్రతలు, పోలీసు, భూమి సంబంధ వ్యవహారాలను కేంద్రం చేతిలోనే కొనసాగనిస్తూ ఇతర పాలనా ‘సర్వీసు’లపై ప్రజలెన్నుకొన్న ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తిరుగులేని అధికారాన్ని ఇటీవల వెలువడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇటీవలే తీర్పు ఇచ్చింది. 2019లో కింది కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని వ్యవహారాలపై అధికారాలు ఉండవని తేల్చి చెప్పింది. ఈ కోర్టు తీర్పుని సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. Article 239AA ప్రకారం ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉంటాయని తెలిపింది. అయితే ఈ ఆర్టికల్‌ పోలీస్, లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం వర్తించదని వివరించింది. నిజానికి దేశ రాజధానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను ఇన్‌చార్జ్‌గా గుర్తిస్తూ చేసిన నూతన చట్టాన్ని కేంద్రం 2021లో నోటిఫై చేసింది. జీఎన్‌సీటీడీ– 2021గా పిలిచే నూతన చట్టాన్ని పార్లమెంట్‌ ఆమోదించారు. అప్పటి వరకు ఢిల్లీలో పబ్లిక్‌ ఆర్డర్, పోలీస్, భూ సంబంధిత అంశాలు కేంద్రం ఆధీనంలో ఉండగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, అడవులు, రవాణా తదితరాలు రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. జీఎన్‌సీటీడీ బిల్లును కేంద్రం నోటిఫై చేయడంతో ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం నామమాత్రం అయింది. ఆ చట్టంతో ఎల్‌జీ దాదాపు 80కి పైగా ప్రభుత్వ శాఖలను నియంత్రించడంతో పాటు, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను సైతం నిలిపివేయగల అధికారాలు పొందారు. కానీ సుప్రీంకోర్టు తీర్పుతో అంతా రివర్స్ అయింది. దీంతో కొత్త ఆర్డినెన్స్ తసుకు వచ్చేసింది.

కేంద్రం తెచ్చిన నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) ఆర్డినెన్స్ జాతీయ రాజధాని సివిల్ సర్వీసుల సంస్థను నెలకొల్పుతుంది. దీనికి ఢిల్లీ ప్రజలెన్నుకొన్న ముఖ్యమంత్రి అధ్యక్షుడుగా వుంటారని చెప్పి ఆయనతో పాటు కేంద్ర హోం శాఖ చీఫ్ సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా అందులో వుంటారని ఆర్డినెన్స్ చెప్పింది. ఢిల్లీ పరిపాలనా వ్యవహారాల విభాగాల అధిపతులైన ఐఎఎస్ అధికారులు ఇతర సిబ్బంది నియామకాలు, బదిలీలపై ఈ ముగ్గురూ మెజారిటీ ఓటింగ్ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవాలి. వాటిని లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదానికి పంపించాలి. ఎల్‌జి ఆ నిర్ణయాలతో విభేదిస్తే పునఃపరిశీలనకు తిరిగి పంపించవచ్చు. జాతీయ రాజధాని సివిల్ సర్వీసుల సంస్థకు ఎల్‌జికి మధ్య ఏకీభావం కుదరనప్పుడు ఎల్‌జిదే అంతిమ నిర్ణయం అవుతుంది. అంటే ప్రభుత్వానిదేమీ ఉండదన్నమాట. ఢిల్లీ జాతీయ రాజధాని కాబట్టి రాజ్యాంగంలో దానికి ప్రత్యేక పరిస్థితులను కల్పించారు. అందుకే శాంతిభద్రతలు, భూ వ్యవహారాలను కేంద్రానికి అప్పగించారు. అదే సమయంలో ఎన్నికైన ప్రభుత్వంతో కూడిన రాష్ట్రంగా జాతీయ రాజధాని ప్రాంతాన్ని మార్చినప్పుడు అక్కడ ఎన్నికైనది నూటికి నూరుపాళ్ళు ప్రాతినిధ్య ప్రభుత్వమే అవుతుంది. ప్రజాస్వామిక అధికారాలన్నీ దానికి సంక్రమిస్తాయి. ఈ విషయాన్ని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

ప్రజాస్వామ్యంపై, సమాఖ్య వ్యవస్థపై, రాజ్యాంగ మౌలిక స్వరూపంపై ఇది ఊహించని దాడి అనే అభిప్రాయం ఉంది. ఇవాళ ఢిల్లీలో తమ ప్రభుత్వం లేదు కాబట్టి అక్కడి పాలనను లాక్కోవడం కోసం కేంద్రం ఈ ప్రయత్నం చేస్తోంది. రేపు బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల కూడా ఇదే పద్దతి అవలంభించదని గ్యారంటీ ఏమీ లేదు. ఇప్పటికే గవర్నర్ల పేరుతో చేస్తున్న రాజకీయం అనేక రాష్ట్రాల్లో రాజకీయ అస్థిరతను సృష్టిస్తోంది. ఢిల్లీ ప్రయోగం విఫలమయితే కేంద్ర పాలిత ప్రాంతాలకే కాకుండా ఇతర గవర్నర్లకూ అలాంటి అధికారాలు ఆపాదిస్తూ చట్టం చేస్తే దేశ ప్రజాస్వామ్య మౌలిక రూపం మారిపోతుంది. అప్పుడు రాజకీయ పార్టీలన్నీ నిర్వీర్యం అయిపోతాయి. ప్రజాస్వామ్యం బలంగా ఉంటేనే రాజకీయ పార్టీలకు బలం. లేకపోతే రాజకీయ పార్టీలకు అధికారంలోకి వచ్చి కూడా చేసేదేమీ ఉండదు. కానీ ప్రస్తుతం అత్యధిక రాజకీయ పార్టీలు తమకు దక్కిన అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి రాజ్యాంగాన్ని ధిక్కరించి మరీ అధికారాన్ని పెంచుకోవడానికి అనుచిత పద్దతులు పాటిస్తున్నాయి. అదే సమయంలో కేంద్రంలో ఉన్న పార్టీ పట్ల భయభక్తులు చూపించాల్సి వస్తుంది. లేకపోతే కేసుల పాలై జైలుకెళ్లాల్సి వస్తుందని ఆందోళనతో ఉన్నారు. ఈ కారణంగా ఈ ఆర్డినెన్స్ చాలా ప్రమాదకరం అని తెసినప్పటికీ చాలా పార్టీలు సైలెంట్ గా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు ఈ ఆర్డినెన్స్ ను వంద శాతం వ్యతిరేకిస్తే ఆర్డినెన్స్ చట్టం కాదు. 238 మంది ఎన్నికైన సభ్యులున్న రాజ్యసభలో బిజెపి కూటమి ఎన్‌డిఎకి 110 మంది సభ్యుల బలముండగా ఐక్యప్రతిపక్షానికి 128 మంది వున్నారు. అంటే కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలు కలిస్తే ఆర్డినెన్స్ వీగిపోతుంది ప్రజాస్వామ్యం నిలబడుతుంది కానీ అలాంటి ఐక్యత లేకపోవడమే దేశ రాజకీయాల్లో అసలైన విషాదం.