కడుపులు మాడ్చుకుని సంపన్నులను పోషిస్తున్నాం

By KTV Telugu On 16 January, 2023
image

 

పేదలు నిరుపేదలవుతున్నారు. మధ్యతరగతివర్గం పేదరికంలోకి జారుకుంటోంది. కానీ ధనవంతులు మాత్రం కుబేరులవుతున్నారు. దేశంలోని ఆర్థిక అసమానతలను కళ్లకుగట్టే గణాంకాలివి. దేశంలోని ఆర్థిక అసమానతలపై ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఆక్స్‌ఫామ్‌ నివేదికలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. భారత్‌లోని మొత్తం సంపదలో 40 శాతం కేవలం ఒకశాతం ధనవంతుల దగ్గరే పోగుపడింది. సగం జనాభా దగ్గర దేశ సంపదలో కేవలం 3 శాతం మాత్రమే ఉందంటోంది ఆక్స్‌ఫామ్‌ నివేదిక. దేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద రూ. 54.12 లక్షల కోట్ల పైమాటే.

పేదల ఆశలపై ఆకాశహర్మ్యాలు నిర్మించుకుంటున్న సంపన్నుల సంపదను విశ్లేషిస్తే కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటికొస్తున్నాయి. తొలి 100 మంది భారతీయ బిలియనీర్లపై 2.5 శాతం లేదా మొదటి 10 మంది బిలియనీర్లపై 5 శాతం పన్ను విధిస్తే ఎంత రాబడి వస్తుందో తెలుసా. దేశవ్యాప్తంగా బడి మానేసిన పిల్లలను మళ్లీ పాఠశాలలకు చేర్చేందుకు సరిపడా సొమ్ము సమకూరుతుంది. 2017- 2021 మధ్య అమాంతం పెరిగిన బిలియనీర్‌ గౌతమ్‌ అదానీ సంపదపై ఒకసారి విధించే పన్నుతో రూ.1.79 లక్షల కోట్ల నిధులను సమీకరించవచ్చు. దేశంలోని ప్రాథమిక పాఠశాలల్లో 50 లక్షల మంది ఉపాధ్యాయులకు ఏడాదిపాటు జీతాలివ్వడానికి ఈ మొత్తం సరిపోతుంది.

కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి 2022 నవంబరు దాకా దేశంలో బిలియనీర్ల సంపద 121 శాతం పెరిగింది. రోజుకు రూ. 3,608 కోట్ల సంపద వారి ఆస్తులకు అదనంగా తోడైంది. దేశంలో 2020లో 102మంది బిలియనీర్లు ఉంటే 2022 నాటికి ఆ సంఖ్య 166కు పెరిగింది. దేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద 660 బిలియన్ల డాలర్ల (రూ. 54.12 లక్షల కోట్లు)కు చేరుకుంది. దీంతో కేంద్ర బడ్జెట్‌కు ఏడాదిన్నరకు సరిపడా నిధులు సమకూర్చొచ్చు. దేశంలోని సంపన్నులపై ఒకసారి రెండు శాతం పన్ను విధిస్తే వచ్చే రూ.40,423 కోట్ల ఆదాయంతో దేశంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలందరికీ మూడేళ్ల పాటు పోషకాహారం అందుతుంది. దేశంలోని 10 మంది సంపన్న బిలియనీర్లపై ఒకేసారి 5 శాతం పన్ను విధిస్తే వచ్చే రూ.1.37 లక్షల కోట్లు వస్తాయి.

ఆర్థిక అసమానతలే కాదు దేశంలో లింగ అసమానతలు కూడా పెరుగుతున్నాయి. ఒక పురుష కార్మికుడు సంపాదించే ప్రతి రూపాయికి మహిళా కార్మికులకు కేవలం 63 పైసలు మాత్రమే శ్రమఫలం దక్కుతోంది. ఇక అగ్ర సామాజిక వర్గాలు సంపాదిస్తున్న దాంతో పోలిస్తే షెడ్యూల్డ్‌ కులాలు 55 శాతం మాత్రమే పొందుతున్నాయి. పట్టణ కార్మికులతో పోలిస్తే గ్రామీణ ప్రాంత కార్మికుల సంపాదన సగమే ఉంటోంది. 2021-22లో జీఎస్టీ ద్వారా వచ్చిన మొత్తం రూ.14.83 లక్షల కోట్లలో దాదాపు 64 శాతం ఆదాయం సంపదలో అట్టడుగున ఉన్న 50 శాతం జనాభా నుంచి వచ్చింది. జీఎస్‌టీ ఆదాయంలో కేవలం 3 శాతం మాత్రమే తొలి పది మంది బిలియనీర్ల నుంచి వస్తోంది. ధనవంతులు, కార్పొరేషన్‌లకు దశాబ్దాలుగా ఇస్తున్న పన్ను తగ్గింపులే అసమానతలకు ఆజ్యం పోశాయంటోంది ఆక్స్‌ఫామ్‌.