హైదరాబాద్ నిజానికి దక్షిణాదికే తలమానికమైన నగరం. సర్వ సంస్కృతుల సమ్మేళనం. ఎపరినైనా తనలో చేర్చుకునే దైన్యం ఆ నగరానికి ఉందని చెప్పేందుకు వెనుకాడకూడదు. అందమైన హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా మార్చాలన్న డిమాండ్ మళ్లీ వినిపిస్తోంది. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ కన్న కలలను నిజం చేయాలని ఆయన మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రెండో రాజధాని కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోణంలో హైదరాబాద్ రెండో రాజధానిగా ఉండాలని అంబేడ్కర్ బలంగా కోరేవారన్నారు. దేశ రాజధాని ఢిల్లీ పాకిస్థాన్ సరిహద్దు నుంచి కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉందని ప్రస్తావించారు. శత్రు దేశాలు రాజధానికి ఇంత దగ్గరగా ఉండటం దేశ రక్షణకు శ్రేయస్కరం కాదని చెప్పారు. ఢిల్లీ రాజధానిగా ఉన్నంతవరకు దేశ రక్షణ సంపూర్ణంగా ఉండదని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆవిష్కరించారు. ఆ సందర్భంగా ఆయన సెకెండ్ కేపిటల్ ప్రస్తావన చేశారు.
నిజానికి దక్షిణాదిన రెండో రాజధాని ఉండాలన్న ప్రస్తావన చాలా రోజులుగా వస్తున్నదే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ స్వాతంత్రోద్యమ కాలంలోనే అంబేడ్కర్ ఈ మాట చెప్పారు. హైదరాబాద్ ను సెకెండ్ కేపిటల్ చేయాలంటూ థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే పుస్తకం 11వ అధ్యాయంలో అంబేడ్కర్ రాశారు. ఈ పుస్తకం 1955లో ప్రచురితమైనప్పుడు జనం అంబేడ్కర్ వాదనతో ఏకీభవించారు అయితే అది కార్యరూపానికి నోచుకోలేదు. తరచూ జనం ప్రస్తావించే సెకెండ్ కేపిటల్ వ్యవహారం ఇప్పుడు ఊపందుకునే అవకాశం ఉంది. దేశానికి రెండో రాజధాని అవసరం ఉందని కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉత్తర దక్షిణ తారతమ్యాలను పోగొట్టేందుకు సెకెండ్ కేపిటల్ ఒకటి కావాలన్న అభిప్రాయం చాలా రోజులుగా ఉంది. బ్యాకప్ గా కూడా రెండో రాజధాని అవసరం ఎందుకంటే ప్రకాశ్ అంబేడ్కర్ చెప్పినట్లుగా ఢిల్లీ మన దేశ సరిహద్దుకు కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాకిస్తాన్ దండయాత్రకు చాలా దగ్గరగా ఉంటుందని రక్షణ రంగ నిపుణులే అంటున్నారు. ఈ మధ్యకాలంలో దేశంలో ఉగ్రవాద దాడులు కూడా పెరిగిపోయాయి. హస్తినాపురి నగరం రోజురోజుకు కాలుష్య కాసారంగా మారిపోతోంది. చలికాలం వచ్చిందంటే చాలు పొల్యుషన్ తో జనం రోగాల బారిన పడుతున్నారు. కాలుష్యం ప్రజలినప్పుడల్లా కేపిటల్ మార్పుపై చర్చ జరుగుతోంది. ఛేంజ్ కేపిటల్ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా మారుమోగిపోతోంది. ఢిల్లీ వాసులు కూడా కొన్ని రోజులు ఆ మహానగరానికి దూరంగా ఉంటే బావుండునని అనుకుంటారు.
సౌతిండియాలో ఒక కేపిటల్ ఏర్పాటు చేయాలన ప్రస్తావన వచ్చినప్పుడు రెండు మూడు నగరాల పేర్లు తెరపైకి వచ్చాయి. హైదరాబాద్ తో పాటు బెంగళూరు చెన్నై మహానగరాల పేర్లు కూడా వినిపించాయి. అయితే వాతావరణ సమతౌల్యత విషయంలో అందరూ హైదరాబాద్ కే ఓటేశారు. బెంగళురు వాతావరణం బాగున్నా మితిమీరిన వాహన కాలుష్యం ఉంది అక్కడ నేరాలు ఎక్కువ. చెన్నై నగరంలో సంవత్సరం పొడువునా ఉష్ణమే ఉంటుంది. పైగా సముద్ర తీర ప్రాంతం కావడంతో శత్రువుల దాడి జరిగే ప్రమాదముంది. ల్యాండ్ లాక్డ్ ప్రదేశమైన హైదరాబాద్ కు సెక్యూరిటీ రిస్క్ లేదు. ఏ నగరంతో పోల్చుకున్నా భద్రతలో హైదరాబాద్ నెంబర్ వన్ అనే చెప్పాలి. హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాత నగరం అన్నీ అందుబాటులో ఉండే నగరం లివింగ్ కాస్ట్ తక్కువ ఎలాంటి వారైనా ఇక్కడకు వచ్చి బతకొచ్చు. కాలుష్యానికి ఆమడ దూరంగా ఉండే నగరం హైదరాబాద్ అని చెప్పాలి. తమిళుల తరహాలో జనానికి ఆధిపత్య ధోరణి లేని నగరం హైదరాబాద్. ఎవరొచ్చినా హైదరాబాదీలు ఆహ్వానిస్తారు అక్కున చేర్చుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్లో కులాలు మతాల గొడవలు లేవు. చెన్నై బెంగళురు తరహాలో వరదలు వస్తాయన్న భయం లేదు. భూకంపాల జోన్లో హైదరాబాద్ లేదని భూభౌతిక శాస్త్రవేత్తలు ఎప్పుడో తేల్చారు. అందుకే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టిన పెట్టుబడి పదింతలు కావడమే కానీ తగ్గడం అంటూ ఉండదు. పారిశ్రామికంగా కూడా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది. సాఫ్ట్ వేర్ రంగానికి కేంద్రబిందువైంది.
ఢిల్లీ నిండా సమస్యలే ఉన్నాయి. మధ్యయుగంలోనూ ఆధునిక యుగంలోనూ ఢిల్లీ కేపిటల్ ను మార్చి మళ్లీ అక్కడనే ఏర్పాటు చేశారు. ఔరంగజేబు హయాంలో దక్షిణాదిపై దండయాత్ర చేసిన తర్వాత దేశం మొత్తానికి ఢిల్లీ కేంద్ర బిందువైంది. ఆంగ్లేయుల కాలంలో రాజధానిని కోల్ కతాకు మార్చిన 1911లో మళ్లీ ఢిల్లీకి వచ్చేసింది. అప్పటి నుంచి ప్రతీ ఏటా ఢిల్లీపై వత్తిడి పెరుగుతూనే ఉంది. అందుకే సెకెండ్ కేపిటల్ కావాలంటున్నారు. హైదరాబాదే సరైన రెండో రాజధాని అనడానికి మరో కారణం కూడా ఉంది. భాగ్యనగరంలో విస్తరణకు అవకాశం ఉంది. చుట్టుపక్కల చాలా ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ ఉంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా సెకెండ్ కేపిటల్ ప్రస్తావన చేసింది. ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అప్పట్లో ఆ ప్రస్తావన చేశారు. అసలు సుప్రీం కోర్టు రెండో రాజధానిలో ఉంటే బావుంటుందని కూడా వాదించారు. కాకపోతే రాంచీ అమరావతిలో రెండో రాజధాని ఉండాలని కాంగ్రెస్ భావించింది. అయితే కేంద్రంలో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలు మాత్రం హైదరాబాద్ సెకెండ్ కేపిటల్ గా ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా అనధికారికంగా మాత్రం హైదరాబాద్ పట్ల సముఖంగా ఉంటున్నారు.
హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చి సెకెండ్ కేపిటల్ గా ప్రకటించాలన్న ప్రతిపాదన చాలా రోజులుగా ఉన్నదే. బీజేపీ ఆ దిశగా ఆలోచిస్తే బావుంటుందన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. మోదీ అమిత్ షా అనుకుంటే ఆ పని చేయగలరన్న విశ్వాసమూ అందరికీ ఉంది. ఎందుకంటే ట్రిపుల్ తలాఖ్ జమ్మూ కశ్మీర్ అంశాల్లో వాళ్లు గట్టిగా నిలబడ్డారు. కాకపోతే తెలంగాణ అధికార పార్టీ అందుకు ఒప్పుకోకపోవచ్చు. హైదరాబాద్ పోతే తెలంగాణకు మిగిలేదేమి ఉండదని బీఆర్ఎస్ కు తెలుసు. హైదరాబాద్ ను సెకెండ్ కేపిటల్ గా ప్రకటించేందుకు బీఆర్ఎస్ వ్యతిరేకించకపోయినా కేంద్రపాలిత ప్రాంత ప్రతిపాదనకు మాత్రం ససేమిరా అనడం ఖాయం. ఈ విషయంలో వారిని కన్విన్స్ చేయడం కూడా కష్టమే. మరి కేంద్రం మదిలో అలాంటి ప్రతిపాదన పాతుకుపోతే ఎలా ముందుకు వెళతారో చూడాలి. ఎందుకంటే కేంద్ర పాలితప్రాంత ప్రతిపాదనను బీఆర్ఎస్ చాలా సార్లు బహిరంగంగానే వ్యతిరేకించింది.