ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు చాలా కాలంగా రాజకీయ విశ్లేషకులు. మూడో సారి గెలిస్తే రాజ్యాంగంలో ఇందు కోసం మార్పులు తెచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరించి ప్రభుత్వాలను కూలగొట్టింది. బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోందన్న అంచనాలు ఉన్నాయి. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది.
బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు రామ మందిరం నిర్మాణం మొదలు అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్యమయ్యాయి. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే ఉంది. నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహపాలనపై చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడం కాదు రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్ పటేల్ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్ అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.
కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో, అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. అప్పట్నుంచి మోదీ అధ్యక్ష తరహాపాలన చేస్తున్నారని అనుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. అందుకు వచ్చే ఎన్నికల్లో విజయం తర్వాత అంతకుమించిన మంచి సమయం ఉండదని భావిస్తున్నట్లుగా భావిస్తున్నారు.
భారత రాజ్యాంగాన్ని ఇప్పటి వరకూ 105 సార్లు సవరించారు. రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించటానికి పార్లమెంటుకు హక్కు ఉంది. ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉన్నదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. మరో సందర్భంలో 1967లో గోలక్‌నాథ్ కు పంజాబ్ ప్రభుత్వానికి మధ్య జరిగిన ఓ వివాదంలో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. తర్వాత కేశవానంద భారతి కేసులో ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుందని అయితే రాజ్యాంగపు మౌలిక సూత్రాలను సవరించే అధికారం ఉండదని వివరణనిచ్చింది. 13 మంది న్యాయమూర్తులు ఇచ్చిన ఈ తీర్పు భారత రాజ్యాంగ సవరణ చరిత్రలో కీలకమైన తీర్పు. రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఏమిటన్న విషయంలో ఇదమిద్దంగా స్పష్టమైన జాబితా ఏమీ లేకపోయినప్పటికీ తర్వాత వచ్చిన అనేక తీర్పుల ద్వారా సుప్రీం కోర్టు ఈ జాబితాను రూపొందించింది. రాజ్యాంగపు అత్యున్నత స్థానం, శానసబద్ద పాలన, అధికారాల విభజన, న్యాయ సమీక్ష, సమాఖ్యతత్వం, లౌకికతత్వం, ప్రాధమిక హక్కులు, పార్లమెంటంరీ వ్యవస్థ, స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగే ఎన్నికలు, స్వయంప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, న్యాయం పొందేందుకు సమాన అవకాశాలు కల్పించటం వంటివి రాజ్యాంగ మౌలిక సూత్రాలుగా స్థిరపడిపోయాయి. అందువల్ల ఈ మౌలిక సూత్రాలను తిరగదోడటం మొదలు పెడితే ప్రజాస్వామిక భారతం ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన ఉంది. కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పార్లమెంట్ కానీ, పాలక పక్షం కానీ మన ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్థానంలో అధ్యక్ష తరహా పాలనను ప్రతిష్టింపచేయలేవని నిపుణులు చెబుతున్నారు. లౌకిక ప్రజాతంత్ర దేశాన్ని ధార్మిక రాజ్యంగా మార్చటానికి పార్లమెంట్‌కు అధికారం లేదని ఈ తీర్పు స్పష్టం చేస్తుందంటున్నారు.
భారత ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఎప్పుడైతే శక్తివంతమైన నాయకుడు అధికారానికొస్తాడో ఆయా సందర్భాల్లో పార్లమెంట్ బలహీనపడుతూ రావటం దురదృష్టకరమైన సందర్భం. శక్తివంతమైన నాయకుడికి ఎక్కడలేని ప్రాధాన్యత ఇవ్వటం అలవాటుగా మారిపోయింది. అధినేతల ముందు సాష్టాంగ ప్రమాణం చేసే వేదికగా చట్టసభలు మారిపోయాయి. 1975లో అమల్లోకి వచ్చిన అత్యవసర పరిస్థితి మన రాజకీయ వ్యవస్థ పని తీరును అర్థం చేసుకోవడానికి ఓ పెద్ద కొలమానంగా ఉపయోగపడుతుంది. రాజ్యంలో ఇమిడి ఉన్న నిరంకుశత్వ లక్షణాలను అత్యవసర పరిస్థతి తొలిసారిగా ప్రజలకు ప్రజాస్వామ్యానికి పరిచయం చేసింది. అప్పట్లో ఇందిరా గాంధీ ఇప్పుడు మోదీ వల్ల అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బీజేపీ మూడో సారి గెలిస్తే సవరించబడిన రాజ్యాంగం అధ్యక్ష తరహా పాలనకు ఆమోద ముద్ర వేయవచ్చు. సవరించబడిన రాజ్యాంగం ఆమోదిస్తే ప్రజలే నేరుగా దేశాధ్యక్షుడిని ఎన్నుకోవచ్చు. అంటే దేశాన్ని నిరంకుశత్వం వైపు నడిపించటానికి రాజ్యాంగబద్ధంగానే రంగం సిద్ధం చేయవచ్చు. అదే జరిగితే దేశంలో ఎలాంటి మార్పులు వస్తాయో అంచనా వేయడం కష్టం.