కనుమరుగైందనుకున్న కరోనా కొత్త వేరియంట్ రూపంలో ముంచుకొచ్చింది. చైనాని వణికిస్తున్న వైరస్ మిగిలిన దేశాలకు కూడా వ్యాపిస్తోంది. ఇదే సమయంలో మన దేశంలో రాజకీయపక్షాలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. జనంలో తిరుగుతున్నాయి. భారత్ జోడో అంటూ గమ్యం తెలియని బాటసారిలా మందీమార్బలంతో ముందుకు సాగుతున్నారు రాహుల్‌గాంధీ. కిలోమీటర్లకొద్దీ జనం, కార్యకర్తలు ప్రవాహంలా వెంట నడుస్తున్నారు. ఇదే సమయంలో బీఎఫ్-17 వేరియంట్‌పై కేంద్రం అప్రమత్తమైంది. కొన్ని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాహుల్‌కి కూడా సూచనలు చేసింది.
వీలైతే యాత్రని ఆపేయండి. లేదంటే అన్ని జాగ్రత్తలూ తీసుకోండి. మార్గదర్శకాలు పాటించమని చెప్పడం తప్పెలా అవుతుంది. మొన్న గుజరాత్‌లో మోడీ ర్యాలీల సంగతేంటి, మీ కార్యక్రమాల సంగతేంటంటూ కాంగ్రెస్ నుంచి కౌంటర్ మొదలైంది. రాహుల్ యాత్రతో కేంద్రం భయపడుతోందనే భావనతో ఉంది కాంగ్రెస్‌పార్టీ. అనూహ్యస్పందన వస్తున్న యాత్రను ఏదోలా అడ్డుకునేందుకే కోవిడ్ బూచిని సాకుగా చూపుతోందనేది కాంగ్రెస్ ఆరోపణ. ఎంతస్పందన వస్తోందనేది పక్కనపెడితే యాత్రని చూసి బీజేపీ ఉలిక్కిపడుతోందని కాంగ్రెస్ అనుకోవడం మాత్రం అతిగానే ఉంది.
కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించకపోయి ఉండొచ్చు. అన్నిచోట్లా మాస్క్‌ని తప్పనిసరి చేసి ఉండకపోవచ్చు. గతంలో కరోనా టైంలో నెలల తరబడి లాక్‌డౌన్‌లో మగ్గాల్సి వస్తుందని ఊహించమా? ఇప్పుడు తీవ్రత తక్కువే కావచ్చు. రేపు పరిస్థితి చేజారిపోద్దన్న గ్యారంటీ ఏముంటుంది? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో అన్ని పార్టీలు రోడ్‌షోలు, బహిరంగసభలు నిర్వహించాయి. కరోనా కొత్త వేరియంట్ ప్రభావం అప్పుడు అంతగా లేదు. ఇప్పుడు ముందుజాగ్రత్తగా కేంద్రం సూచనలుచేస్తే కుట్ర కుతంత్రం అనడం పిచ్చితనమే. యాత్రకు ముందు రాహుల్‌గాంధీని కాంగ్రెస్ నేతలే లైట్ తీసుకున్నారు. పార్టీ పగ్గాలు తీసుకోవడానికి ఇష్టపడని రాహుల్‌గాంధీని రాజకీయ వారసుడిగా కూడా వాళ్లు చూడలేకపోయారు. సీనియర్‌నేతలు బాహాటంగానే ధిక్కారస్వరం వినిపించారు. ఇప్పుడు యాత్ర మొదలుపెట్టిన మూడ్నెల్లలోనే ఏదో అద్భుతం జరిగిపోయిందని రాహుల్‌గాంధీనో, కాంగ్రెస్సో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. స్పందన లభిస్తుండొచ్చుగానీ అంతమాత్రాన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వణికిపోతుందనుకోవడం అతిశయోక్తే. యాత్రలో నిబంధనలు పాటించాలనిచెబితే టార్గెట్ చేస్తున్నారనడం అవివేకమే అవుతుంది. రేపు యాత్రలో వైరస్‌వ్యాప్తి చెందితే దానికి కాంగ్రెస్ బాధ్యత వహిస్తుందా. తప్పకుండా కేడర్‌కి, వచ్చే ప్రజలకు జాగ్రత్తలు చెబుతామని స్పందించి ఉంటే కాంగ్రెస్‌కి కాస్త గౌరవంగా ఉండేది.