ఏఐసిసి మాజీ అధ్యక్షుడు నెహ్రూ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ నిర్వహిస్తోన్న జోడో యాత్ర సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. ఏ రాష్ట్రంలో అడుగు పెట్టినా రాహుల్ గాంధీకి జనం నీరాజనం పలుకుతున్నారు. యాత్ర ఇంతగా హిట్ అవుతుందని బహుశా గాంధీ కుటుంబీకులు కూడా ముందుగా ఊహించి ఉండరు. వెరీ గుడ్. మరి ఈ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజకీయ లబ్ధి చేకూరుతుందా? వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘన విజయాలు సాధించి అధికారంలోకి వచ్చేస్తుందా? అంటే మాత్రం సమాధానం చెప్పలేని స్థితిలో ఆ పార్టీ ఉంది. యాత్ర హిట్ కావడంతో ఓ విషయం అర్ధమవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాహుల్ గాంధీని చూడ్డానికి జనం ఎగబడుతున్నారు. ఇందిరమ్మ మనవడితో కలిసి అడుగులు వేయడానికి వివిధ రంగాల్లో ప్రముఖులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. తమిళనాట రాహుల్ గాంధీ యాత్ర జరుగుతున్న సమయంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ కూడా కాంగ్రెస్ అగ్రనేత తో కలిసి యాత్రలో పాల్గొనడానికి ఉత్సాహం చూపించారు.
యాత్ర పొడవునా చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వర్గాల ప్రజలూ రాహుల్ తో మమేకం అవుతున్నారు. మరి ఈ జనం అంతా రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉంటారా? రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు అండగా ఉంటారా? అంటే చెప్పలేం అంటున్నారు రాజకీయ పండితులు. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లు రాహుల్ యాత్ర సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఘోర పరాజయాలతో అంతర్గతం కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతోంది. నాణేనికి ఒక వైపు మెరుపులు మరో వైపు చీకట్లు అన్నట్లు ఉంది కాంగ్రెస్ పరిస్థితి. జోడో యాత్రకు స్పందన బాగా ఉందని అనుకుంటే గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. ఇక్కడే ఓ డౌట్ కూడా వస్తోంది. ఇంత ప్రతిష్ఠాత్మకమైన జోడో యాత్రను రాహుల్ గాంధీ ఎన్నికలు జరుగుతోన్న గుజరాత్ లో ఎందుకు నిర్వహించలేదు. ఈ యాత్రకు ప్లాన్ చేసింది ఎవరు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలతో పాటు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనూ యాత్ర కొనసాగేలా ప్రణాళికలు రూపొందించాల్సింది పోయి కీలకమైన గుజరాత్ లో అసలు యాత్రే లేకపోవడం ఏంటి అని పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
గుజరాత్ లో జోడో యాత్ర లేకపోవడమే కాదు రాహుల్ గాంధీ ప్రచారం కూడా అంతంత మాత్రంగానే ఉండింది. అంటే గుజరాత్ ను ముందస్తుగానే వదిలేసుకున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇక 2023లో ఎన్నికలు జరగాల్సి ఉన్న తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దయనీయంగా ఉంది. పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీలోని సీనియర్లంతా నిప్పులు చెరుగుతున్నారు. రేవంత్ రెడ్డితోనే పార్టీ సంక్షోభంలో కూరుకుపోయిందని మెజారిటీ నేతలు విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి పంపి తెలంగాణలో కాంగ్రెస్ ను బలహీనపర్చి బిజెపికి మేలు చేకూర్చేందుకు చంద్రబాబు ఆడుతోన్న నాటకమే కాంగ్రెస్ సంక్షోభానికి కారణమంటున్నారు రాజకీయ పండితులు. ఎనిమిదేళ్ల క్రితం నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీయే ప్రభుత్వం ఏపీ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చింది. ఏపీని రెండుగా విభజించింది. ఏపీలో నష్టపోయినా తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అయితే విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఫట్ మంది. టి.ఆర్.ఎస్. అధికారంలోకి వచ్చింది.2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు కలిసి రాలేదు.
ఇక ముచ్చటగా మూడోసారి జరగనున్న ఎన్నికల్లోనైనా అధికారాన్ని చేజిక్కించుకోలేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అన్నదే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పార్టీలోని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి విషమ పరిస్థితుల్లోనూ తెలంగాణా కాంగ్రెస్ లో గొడవలు ఆగకపోగా తారాస్థాయికి చేరుతున్నాయి. దీని వెనుక ఏదన్నా కుట్ర ఉందన్న అనుమానాలు ఉన్నాయి. జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ తెలంగాణా కాంగ్రెస్ ను కూడా గాలికి వదిలేసి ప్రశాంతంగా యాత్ర చేసుకుంటూ గెడ్డం పెంచుకుని ముందుకు సాగిపోతున్నారు. జోడో యాత్ర ద్వారా దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీకి మంచి మైలేజే వస్తోంది కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దశ దిశ లేకుండా గాలివాటున పయనిస్తోంది. వందేళ్లు పైబడిన కాంగ్రెస్ పార్టీకి ఇపుడు మరమ్మతు చేసేది ఎవరు. ఈప్రశ్నే పార్టీ పాతతరం నేతల మెదళ్లను తొలిచేస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2024 సాధారణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటే అవకాశాలు ఉండవంటున్నారు రాజకీయ పండితులు. కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేస్తే నరేంద్ర మోదీ సారథ్యంలో బిజెపి కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమంటున్నారు పరిశీలకులు.