జోడో యాత్ర సూపర్ హిట్ ముందుంది అసలు పండగ

By KTV Telugu On 31 January, 2023
image

కేంద్రంలో భారతీయ జనతాపార్టీ మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకుని తీరతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిజ్ఞ చేశారు. బిజెపిని నిలువరించేందుకు భావసారూప్య పార్టీలన్నింటినీ కలుపుకుని ముందుకు పోతామన్న రాహుల్ గాంధీ విపక్షాల మధ్య ఐక్యత లేదంటూ సాగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టి పారేశారు. రాహుల్ గాంధీ నిర్వహిస్తోన్న భారత్ జోడో యాత్ర కశ్మీరు లో ముగిసిన సందర్భంగా రాహుల్ గాంధీ ఉత్సాహంగా ప్రసంగించారు. అయిదు నెలల క్రితం సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారిలో భారత్ జోడో యాత్రలో తొలి అడుగు వేశారు రాహుల్ గాంధీ. పార్టీ శ్రేణులు నిద్రాణమై ఉన్న వేళ పార్టీలో నైరాశ్యం అలుముకున్న వేళ పార్టీలోని సీనియర్లు తిరుగుబాటు బావుటా ఎగరేసి వలసలవైపు చూస్తోన్న వేళ పార్టీని బతికించుకోవడంతో పాటు శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సిద్ధమయ్యారు.

12రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా దాదాపు నాలుగువేల కిలోమీటర్ల దూరం పాటు యాత్ర సాగింది. యాత్రలో అడుగడుగునా రాహుల్ గాంధీకి జనం నీరాజనాలు పలికారు. యాత్రకు వచ్చిన అనూహ్య స్పందనతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. రాహుల్ గాంధీ సైతం ప్రజలతో మమేకం అయిపోయి వారితో జోకులేస్తూ ఆటలాడుతూ ఆప్యాయంగా పలకరిస్తూ చిరునవ్వు చెదరకుండా ముందుకు సాగారు. ప్రజలకు రాహుల్ గాంధీకీ మధ్య దూరం బాగా తగ్గిందని రాజకీయ పండితులు అంటున్నారు. యాత్రకు ప్రతీ చోటా ప్రజలు బ్రహ్మరథం పట్టడమే కాదు వివిధ రంగాల్లో ప్రముఖులు సైతం రాహుల్ తో కలిసి యాత్రలో పాల్గొని తమ సంఘీభావం వ్యక్తం చేశారు. రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ రాజన్. తమిళ సినీ సూపర్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ నటీమని ఊర్మిళ తో సహా పలువురు సీనియర్ పాత్రికేయులు కూడా రాహుల్ యాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు. యాత్ర ద్వారా బిజెపి పాలన పట్ల విసిగి వేసారి అభద్రతా భావంతో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పాలన్నది రాహుల్ లక్ష్యం. దాంతో పాటే మిమ్మల్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని భరోసా ఇవ్వడం అసలు ఉద్దేశం. ఈ రెండు లక్ష్యాలను రాహుల్ గాంధీ సక్రమంగానే చేధించారు.

ప్రజల్లో ఆసక్తి రేపేలానే యాత్రను హుషారుగా చేపట్టారు. యాత్ర సూపర్ హిట్ అయ్యింది సరే కానీ దాని వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ప్రయోజనం చేకూరుతుందా అన్నది ప్రశ్న. నిస్సందేహంగా కాంగ్రెస్ పార్టీకి యాత్ర ద్వారా కొత్త ఊపు వచ్చిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాకపోతే యాత్రకు షెడ్యూల్ రూపకల్పన చేయడంలోనే లోపాలున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు రాహుల్ యాత్ర మొదలైన తర్వాత గుజరాత్, హిమాచల ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. రాహుల్ తన యాత్ర తాను చేసుకుంటూ పోయారు కానీ ఎన్నికలు జరుగుతోన్న గుజరాత్, హిమాచల ప్రదేశ్ లో యాత్ర ఉండేలా ప్లాన్ చేసుకోలేదు. కనీసం ఎన్నికల నగారా మోగిన తర్వాత అయినా కొద్ది రోజులు ఆ రెండు రాష్ట్రాల్లో యాత్ర చేసి ఎన్నికల ప్రచారానికి ఊపు ఇచ్చి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గా ఉండేదంటున్నారు. గుజరాత్ లో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ మొత్తానికే గాలికి వదిలేయడం వల్లనే అక్కడ కాంగ్రెస్ అవమానకర ఫలితాలకు పరిమితమైంది. గత ఎన్నికల్లో బిజెపికి చుక్కలు చూపిన కాంగ్రెస్ ఈ సారి కాస్త కష్టపడి ఉంటే అధికారంలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కాడి వదిలేయడం రాహుల్ కూడా తన యాత్ర ఏదో తనది అన్నట్లు నడుచుకుంటూ వెళ్లిపోవడం తో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని రాజకీయ పండితులు అంటున్నారు.

ఇటు తెలంగాణాలోనూ రాహుల్ యాత్ర చేసే సమయంలో మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుని ఉంది. రాహుల్ యాత్రను మునుగోడు నియోజకవర్గం మీదుగా షెడ్యూల్ చేసి ఉంటే కాంగ్రెస్ కు ఎంతో కొంత లాభించేంది. కానీ అటువంటి ఆలోచన కూడా చేయలేదు సరికదా రాహుల్ ఎక్కడో శంషాబాద్ లో యాత్ర చేస్తోంటే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లంతా మునుగోడు ప్రచారాన్ని వదిలి పెట్టి రాహుల్ జోడోయాత్రలో అటెండెన్స్ వేయించుకోడానికి ఆసక్తి చూపారు. ఆ విధంగా యాత్ర మునుగోడులో కాంగ్రెస్ కు నష్టాన్నీ తెచ్చిపెట్టిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక ఈ యాత్రతో కాంగ్రెస్ పార్టీలో జోష్ అయితే పెరిగింది కానీ దాన్ని ఎన్నికల వరకు పదిలంగా కాపాడుకోవాలంటే సరికొత్త కార్యక్రమాలతో పార్టీ నాయకత్వం దూసుకుపోవాలి. 2024లో సాధారణ ఎన్నికలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లోనూ దారుణ ఫలితాలనే చేజిక్కించుకుని డీలా పడిపోయింది. వరుసగా రెండో సారి ప్రతిపక్షంలో కూర్చుంది. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోతే కాంగ్రెస్ పార్టీ మనుగడే ప్రశ్నార్ధకమయ్యే ప్రమాదం ఉంది. దీన్ని గుర్తెరిగే రాహుల్ గాంధీ జోడో యాత్రకు వెళ్లి వచ్చారు. అయితే ఈ యాత్ర తోనే కాంగ్రెస్ లో అద్భుతాలు జరిగిపోవంటున్నారు రాజకీయ పండితులు.

ఈ ఏడాది దేశంలో 9 రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తా చాటాలంటే ఇప్పటినుంచే ప్రతీ రాష్ట్రానికీ వ్యూహకర్తలను నియమించాలి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి అభ్యర్ధులను ఎన్నుకోవాలి. పార్టీ నుండి ఇతర పార్టీలకు వలసలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పార్టీ ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ఉంటే పార్టీలోకే వలసలు వచ్చే పరిస్థితి ఉంటుంది. దాన్ని క్యాష్ చేసుకోవాలి. అయితే ఇవన్నీ కూడా అంత వీజీ కాదంటున్నారు మేథావులు. అయితే రాహుల్ గాంధీ జోడో యాత్రతో రాజకీయ పరిణతి ప్రదర్శించారని ప్రజల్లోనూ రాహుల్ పట్ల సానుకూలత పెరిగిందని వారంటున్నారు. అసలు పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడమే అతి పెద్ద తప్పంటున్నారు విశ్లేషకులు. పార్టీ శ్రేణులంతా రాహుల్ గాంధీనే అధ్యక్షుడిగా కోరుకుంటున్న వేళ రాహుల్ గాంధీ యుద్ధానికి భయపడి వెనకడుగు వేయడం పొరపాటని వారంటున్నారు. తాను కూర్చోవలసిన కుర్చీలో ఎనిమిది పదులు దాటిన ఖర్గేని కూర్చోబెట్టడం ద్వారా పార్టీ భవిష్యత్ ను రాహుల్ గాంధీయే నాశనం చేసుకుంటున్నారని వారంటున్నారు. ఇప్పటికైనా పార్టీ పగ్గాలు చేతుల్లోకి తీసుకుని యుద్ధానికి కదం తొక్కాలని వారు సూచిస్తున్నారు.