రాహుల్‌యాత్ర కాంగ్రెస్ రాత మారుస్తుందా ?

By KTV Telugu On 30 January, 2023
image

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. దాదాపు 5నెలల పాటు 3,500కి.మీ.కు పైగా సాగిన యాత్ర హస్తం శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. క్రమంగా కాంగ్రెస్ పార్టీ అస్థిత్వం కోల్పోతున్న దశలో యాత్ర చేపట్టిన రాహుల్ పార్టీకి జీవం పోశారని అంతా విశ్లేషిస్తున్నారు. ఇటీవల గుజరాత్‌లో కాంగ్రెస్ పల్టీ కొట్టినా హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు ఊరట కలిగించాయి. అది రాహుల్ యాత్ర చలువేనని కాంగ్రెస్ శ్రేణులు సంబరపడిపోయాయి. కానీ అసలు కథంతా ముందుంది. దేశంలో ఒక్కో రాష్ట్రంలో అధికారం పోగొట్టుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాహుల్ ఏమేరకు జీవం పోశారనేది ఈ ఏడాది జరగనున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోనుంది. కాంగ్రెస్ రెండుసార్లు అధికారానికి దూరం కావడం నేతలంతా వలస వెళ్లిపోతుండడం ప్రతీ ఎన్నికల్లో ఎదురవుతున్న ఓటములు పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని, పప్పు అని రాహుల్‌పై ప్రత్యర్థుల విమర్శలు మరోవైపు కేంద్రదర్యాప్తు సంస్థల దాడులతో గాంధీ కుటుంబం నలిగిపోయింది. వాటన్నంటినీ ఓ సవాల్‌గా తీసుకొని వచ్చే ఎన్నికల కోసం జనంలోకి వెళ్లారు రాహుల్. 134 రోజుల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ తన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ రాహుల్ యాత్ర పార్టీకి హెల్ప్ అవుతుందా. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురాగలరా అంటే మిలియన్ డాలర్ల ప్రశ్న. తల్లిచాటు బిడ్డగా ఉన్న రాహుల్ ఇప్పుడిప్పుడే నడకదారిలో రాటుదేలుతున్నాడు.

ఈ శతాధిక వయస్సున్న పార్టీకి ఇప్పుడు అంతా రాహులే. కాంగ్రెస్‌ను రాహుల్ నడిపించలేరని సొంత పార్టీ నేతలే విమర్శించారు. ఆజాద్, కపిల్ సిబల్ లాంటి నేతలు రాహుల్‌ తీరుతో విసిగిపోయి పక్కకు వెళ్లిపోయారు. అయితే కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు ముందుకు రాని రాహుల్ గాంధీ. ఇప్పుడు భారత్ జోడో యాత్రతో తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ జోడో యాత్రను రాజకీయ యాత్రగా చూడొద్దని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టే కూడా యాత్ర జరిగింది. ఎందుకంటే ఎన్నికలు జరిగిన చోట యాత్ర చేయకుండా ఎక్కడో తిరగడమేంటనే విమర్శలను రాహుల్ ఎదుర్కొన్నారు. కానీ ఆయన గురి అంతా 202 ఎన్నికలపైనే అని తెలుస్తోంది. దేశంలో బీజేపీకి యాంటీగా పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను ఏకం చేసేవిధంగా రాహుల్ యాత్ర సాగించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఎన్నో విపక్ష పార్టీల నేతలు, సీఎంలు, మాజీ సీఎంలు, ఎంపీలు, సామాజిక కార్యకర్తలు ఇలా చాలా మంది మద్దతు తెలిపారు. ప్రజల్లోకి వెళ్లడం ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటున్నారు రాహుల్. వ్యక్తిగత అలవాట్ల దగ్గరి నుంచి దేశ భవిష్యత్తు వరకూ రాహుల్ ఈ యాత్రలో అన్నీ ఆవిష్కరించేందుకు ప్రయత్నించారు. దీంతో రఘురామ్ రాజన్ వంటి ఆర్ధిక మేథావి తమిళనాడులో యాత్ర సాగినంత సేపు కలవని కమల్ హాసన్ వంటి వారు కూడా రాహుల్ కు సంఘీభావం ప్రకటించారు.

ఇండియా టుడే తాజాగా వెలువరించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో రాహుల్ ఇమేజ్‌తో పాటు కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని తేలింది. ప్రస్తుతం పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కు ఉన్న బలం 44 ఎంపీలు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ 191 సీట్లు సాధిస్తుందని మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో అంచనావేసింది. పార్ట్-2 మొదలైతే అది మరింతగా పెరిగే అవకాశముందన్న లెక్కలు వేసుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. త్వరలోనే రాహుల్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకూ పార్ట్ 2 చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఇతర అంశాలపై కాంగ్రెస్ ముఖ్యనేతలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల లోపు దీన్ని కూడా పూర్తి చేసి సగర్వంగా ఎన్నికలకు వెళ్లాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు సమాచారం. జోడో యాత్ర ద్వారా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీపై ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేయడంలో రాహుల్ ఏమైరకు సఫలీకృతమవుతారనేది 2024లో తేలిపోనుంది.