బీజేపీ, ఆరెస్సెస్ వద్ద రాహుల్ గాంధీ ట్రెయినింగ్‌

By KTV Telugu On 1 January, 2023
image

బీజేపీ, ఆరెస్సెస్‌లపై తరచుగా విమర్శలు గుప్పించే రాహుల్‌గాంధీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ ని తాను గురువులా భావిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని చూసే తాను ఎలా ఉండకూడదో ఎలాంటి పనులు చేయకూడదో నేర్చుకుంటున్నాను అంటూ సెటైర్లు వేశారు. బీజేపీ తనకు రోడ్‌మ్యాప్ ఇస్తోందని పేర్కొన్నారు.
భారత్ జోడో యాత్ర నుంచి విరామం తీసుకున్న రాహుల్ గాంధీ ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ తమపై ఎంత దూకుడుగా దాడి చేస్తే తమ పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకునేందుకు అంతగా సాయపడుతుందని రాహుల్ వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్రను తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఒక సాధారణ యాత్రగా ప్రారంభించానని అయితే అది క్రమంగా ప్రజల గొంతుకగా మారి వారి భావోద్వేగాలను ప్రతిబింబింస్తోందని రాహుల్ తెలిపారు.

ఈ సందర్భంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా అన్నారు. వాళ్లను నేను గురువులుగా భావిస్తున్నా. వాళ్లను చూసే నేను ఎలాంటి పనులు చేయకూడదో నేర్చుకుంటున్నా అని రాహుల్‌ గాంధీ అన్నారు.
భద్రతా కారణాలు చెప్పి తనపై కేసులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాహుల్ ఆరోపించారు. తనను బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనంలో వెళ్లాలని హోం శాఖ చెబుతోంది. కానీ పాదయాత్ర అంటే కాలినడకనే వెళ్లాలి అన్నారు రాహుల్‌. జోడో యాత్రలో తాను ధరించిన టీ-షర్టులపైనా బీజేపీ రాద్ధాంతం చేస్తోందని రాహుల్ మండిపడ్డారు. నాకు పెద్దగా చలి అనిపించలేదు అందుకే స్వెటర్‌ వేసుకోలేదు. ఒకవేళ చలి ఎక్కువైతే స్వెటర్‌ గురించి ఆలోచిస్తా అన్నారు.
భారత్ జోడో యాత్ర తనకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు రాహుల్. ఈ యాత్రలో తాను ఉత్సాహంగా ఉండటం వెనుక ఉన్న సీక్రెట్‌ గురించి త్వరలో ఓ వీడియో విడుదల చేస్తానని చెప్పారు.