ఒక్కో సారి ప్రతికూల పరిణామం కూడా సానుకూలంగా మారిపోతుంది. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బిజెపి వేసిన ఎత్తుగడ ఇపుడు కాంగ్రెస్ కు అనుకోని వరంగా మారుతోంది. ఇంతకాలం కాంగ్రెస్ ను దూరం పెట్టిన విపక్షాలు కూడా కాంగ్రెస్ పై సానుభూతి ప్రకటించేలా చేసింది. ఇది కాంగ్రెస్ కే మేలు చేస్తుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి పెట్టడానికి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ విసిరిన పాచిక ఇపుడు కాంగ్రెస్ కు అనుకోని అడ్వాంటేజ్ గా మారింది. చాలా కాలంగా కాంగ్రెస్ ను ఒంటరిగా మిగిల్చిన విపక్షాలు కూడా కాంగ్రెస్ కు మద్దతుగా గళం విప్పడమే కాకుండా బిజెపిని తూర్పార పడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఇలా ఖూనీ చేస్తారా అంటూ మండి పడుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో చేసిన ఓ వ్యాఖ్య బిజెపికి మంట పుట్టించింది. ఎన్నికల సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలో బ్యాంకులకు శఠగోపం పెట్టి అక్రమాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోదీ ఐపీఎల్ కుంభకోణంలో సూత్రధారి అయిన లలిత్ మోదీలను ఉద్దేశించి దేశంలో దొంగల ఇంటి పేర్లన్నీ మోదీ అనే ఉంటాయెందుకో అని సెటైర్ విసిరారు. ఇది నరేంద్ర మోదీ అనుచరులకు కోపం తెప్పించింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సూరత్ కోర్టులో బిజెపి నేతలు పరువు నష్టం దావా వేశారు. నాలుగేళ్ల తర్వాత సూరత్ కోర్టు తీర్పు చెబుతూ రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
ప్రజాప్రతినిథులు రెండేళ్ల పాటు జైల్లో ఉండే కేసుల్లో దోషులుగా తేలితే వారు చట్ట సభ సభ్యత్వానికి అనర్హులు అవుతారని ప్రజాప్రాతినిథ్య చట్టం చెబుతోంది. తీర్పు వచ్చిన రోజు నుండి ప్రజాప్రతినిధిగా కొనసాగే అర్హత కోల్పోతారు. దాంతో పాటే జైలు శిక్షాకాలంతో పాటు మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనే అర్హతనూ కోల్పోతారు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ పై కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతోంది. అయితే ఈ లోపే రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. దీనిపై ఇపుడు రాజకీయ దుమారం రేగుతోంది. లోక్ సభ సెక్రటేరియట్ నేరుగా ఒక ఎంపీపై అనర్హత వేటు వేయజాలదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్ ను సంప్రదించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని వారంటున్నారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ అగ్ర నేతలంతా అత్యవసరంగా భేటీ అయ్యారు. సోనియా గాంధీ చిదంబరం ప్రియాంక గాంధీ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమస్యను ఎలా అధిగమించాలా అన్న అంశంపై చర్చిచారు. దీనిపై ఎలా పోరాడాలా అన్న అంశంపైనా సమాలోచనలు చేశారు. దీనిపై న్యాయపోరాటం కొనసాగించాలని నిర్ణయించారు.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రకటన వెలువడగానే ముందుగా కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా రాహుల్ ను పట్టించుకోకుండా ఉన్న సీనియర్లు సైతం బిజెపి వ్యవహార శైలిని ఖండించి రాహుల్ కు సంఘీభావం వ్యక్తం చేశారు. ఇక విపక్షాలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కాంగ్రెస్ ను మొదట్నుంచీ వ్యతిరేకిస్తోన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయితే ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దురహంకారంతో నిరంకుశంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని కేజ్రీవాల్ అన్నారు. 130 కోట్ల మంది భారతీయులు ఏకం కావాలని కేజ్రీవాల్ పిలుపు నిచ్చారు. విపక్షాల కూటమిని రాహుల్ గాంధీ నడిపిస్తే ఎప్పటికీ బిజెపిని ఓడించలేం అంటూ ఈ మధ్యనే రాహుల్ పైనా కాంగ్రెస్ పార్టీపైనా విరుచుకు పడిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా రాహుల్ కు బాసటగా మాట్లాడారు. నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రత్యర్ధులను టార్గెట్ చేస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారని బెనర్జీ ఆరోపించారు. బిజెపిలోని నేరచరిత్ర ఉన్నవారిని మంత్రులను చేస్తూ తమని ప్రశ్నించే విపక్ష నేతలపై అనర్హత వేటు వేస్తున్నారని మమత విమర్శించారు.
ఇక ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణాలో పాలక పక్ష నేత ముఖ్యమంత్రి కేసీయార్ అయితే దీన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. ఇది భారత ప్రజాస్వామిక చరిత్రలోనే చీకటి రోజని ఆయన అభివర్ణించారు. మోదీ దురహంకారానికీ నియంతృత్వానికి ఇది నిదర్శనమని కేసీయార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికీ రాజ్యాంగ విలువలకూ కూడా చెడ్డకాలం దాపురించిందని కేసీయార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్య శక్తులన్నీ ఏకం కావాలని కేసీయార్ పిలుపు నిచ్చారు. రాహుల్ పై అనర్హత వేటు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. దేశాన్ని దోచుకుంటోన్న దొంగలను దొంగా అనడం కూడా తప్పేనా అని ఉద్ధవ్ నిలదీశారు. బిజెపి నిరంకుశ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని ఉద్ధవ్ అభిప్రాయ పడ్డారు. బిజెపియేతర పక్షాల నుండి రాహుల్ గాంధీకి మద్దతు పెరుగుతోంది. అదే సమయంలో రాహుల్ పట్ల సానుభూతి కూడా పెరుగుతోంది. భారత్ జోడో యాత్ర తరహాలో తన అనర్హత వేటు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాహుల్ గాంధీ యాత్ర చేపడితే అది సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయమని రాజకీయ పండితులు అంటున్నారు.
ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం జైలు శిక్ష పడి ప్రజాప్రతినిధిగా కొనసాగే అర్హత కోల్పోయిన నేతలు గతంలోనూ ఉన్నారు. దాణా కుంభకోణంలో దోషిగా తేలిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోవలసి వచ్చింది. 2013లో వచ్చిన తీర్పుతో పార్లమెంటుకు దూరమైన లాలూ బెయిల్ పై ఉన్నారు. తమిళనాడులోనూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో దోషిగా తేలడంతో నాలుగేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఫలితంగా ఆమెపై అనర్హత వేటు పడింది. ఇదే ఆమెను ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయేలా చేసింది. అపుడే ఆమె తనకు విధేయుడైన పన్నీరు సెల్వాన్ని తన సీట్లో కూర్చోబెట్టి రిమోట్ తో పాలన సాగించారు. ఇలా రాష్ట్రాల్లో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు అనర్హత వేటుకు గురై ప్రజాప్రతినిథులుగా కొనసాగలేకపోయారు. ఇపుడు రాహుల్ గాంధీ పై కోర్టులో సవాల్ చేసుకోడానికి 30 రోజుల గడువు నిచ్చింది సూరత్ కోర్టు. పై కోర్టులో కూడా ఇదే తీర్పు నిర్ధారణ అయితే వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశాన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమైంది. అదే సమయంలో దేశ వ్యాప్తంగా ఉద్యమానికి నడుం బిగిస్తోంది చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.