రాహుల్ పప్పు కాదు: ఆర్బీఐ మాజీ గవర్నర్

By KTV Telugu On 20 January, 2023
image

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేత రాహుల్‌గాంధీ మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి పప్పు అనే ఇమేజ్ రావడం దురదృష్టకరమని ఆయన నిజంగా తెలివైన వ్యక్తి అని ప్రశంసలు కురిపించారు. వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో భాగంగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రఘురామ్ రాజన్ ఈ విధంగా స్పందించారు. దాదాపు 10 ఏళ్ల పాటు వారితో సన్నిహితంగా ఉన్నానని రాహుల్ పప్పు కాదని ఆయనొక తెలివైన వ్యక్తి, యువ రక్తం కలవాడు, ఆసక్తి కల్గిన వ్యక్తి అంటూ ప్రశంసించారు. సవాళ్లను అర్థం చేసుకోవడంతో పాటు వాటి నష్టాలను కూడా అంచనా వేయగల సామర్థ్యం కలిగి ఉండడం చాలా ముఖ్యమని రాహుల్ ఆ విషయంలో సమర్థుడని చెప్పారు.

మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించానని రఘురామ్ రాజన్ అన్నారు. భారత్ జోడో యాత్ర విలువల కోసం కట్టుబడి ఉండడంతోనే ఆ యాత్రలో తాను పాల్గొన్నట్లు చెప్పారు. గత నెలలో రాజస్థాన్ లో జరిగిన జోడోయాత్రలో రఘురామ్ రాజన్ రాహుల్ తో కలిసి నడిచారు. ఇపుడు మోడీ సర్కారు అవలంభిస్తున్న విధానాలు దేశ ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని విమర్శించారు రఘురామ్‌ రాజన్‌. తాను రాజకీయాల్లోకి రానున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. భారత్ జోడో యాత్ర విలువల కోసమే తాను రాహుల్‌తో కలిసి నడిచానని కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి కాదని స్పష్టం చేశారు.