రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో డిఫెన్స్ లో కాంగ్రెస్

By KTV Telugu On 5 March, 2023
image

కొందరికి వేరే శత్రువులు అవసరం లేదు. వారి నోరే వారికి కావల్సినంత డ్యామేజ్ చేసి పెట్టేస్తుంది. వారితో పాటు వారు ఉన్న వ్యవస్థలనీ చావు దెబ్బ తీసేస్తారు. ఎక్కడ ఏది మాట్లాడకూడదో ఎక్కడ ఏది మాట్లాడాలో రెండూ కూడా తెలీకపోవడం వారి ప్రత్యేకత. ఇంతటి స్పెషల్ లీడర్ ఎవరా అనేగా జస్ట్ వాచ్ దిస్ స్టోరీ.

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని చూసి జాలి పడాలో కోప్పడాలో అర్ధం కావడం లేదని సీనియర్ కాంగ్రెస్ నేతలు తమలో తామే గిల గిల కొట్టుకుంటున్నారు. భారత్ జోడో యాత్రతో ఈ మధ్యనే కాస్త గాడిలో పడ్డారు ఇపుడిపుడే మాట్లాడ్డం నేర్చుకుంటున్నారు అని కాంగ్రెస్ నేతలు ఈ మధ్య సంబరాలు చేసుకున్నారు. మొన్నటి కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలోనూ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సైతం పుత్రరత్నం జోడో యాత్ర సక్సెస్ ను తలచుకుని మురిసిపోయారు. రాహుల్ గాంధీ యాత్ర సక్సెస్ కావడంతోనే తన రాజకీయ ప్రస్థానం ముగింపుకు వచ్చేసిందని ఆమె చెప్పుకొచ్చారు. ఇక నేను లేకపోయినా మా అబ్బాయి పార్టీని చక్కగా ముందుకు నడిపిస్తాడని ఓ అమ్మగా పాపం సోనియా గాంధీ నమ్మకం పెట్టుకున్నారు. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ రాహుల్ గాంధీ ఆణిముత్యాల్లాంటి మాటలు వదిలేసి ప్రశాంతంగా నవ్వేశారు. అవి కాస్తా అణుబాంబులా పేలి కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేశాయి.

జమ్ము కశ్మీరు గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత్ జోడో యాత్రలో తాను కశ్మీరు కెళ్లిన తరుణాన్ని నెమరు వేసుకున్నారు. నేను అక్కడ చూస్తిని కదా ఎక్కడికెళ్లినా భారత జాతీయ పతాకాలు రెప రెప లాడాయి అన్నారు. ఉగ్రవాదులకు అడ్డాగా ఉండే కశ్మీరు లో ఎన్నడూ లేని విధంగా ప్రతీ ఒక్కరి ఇంటిపైనా చేతుల్లోనూ భారత జెండాలు ఉన్నాయన్నారు. అసలీ వ్యాఖ్యలు ఆయన ఎందుకోసం చేశారో అక్కడ కవిగారి ఉద్దేశం ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు. కాకపోతే బాంబు వత్తి అంటుకున్నట్లు దీన్ని గమనించిన బిజెపి నేతలు అమాంతం కాంగ్రెస్ పై బాంబుల వర్షం కురపించేశారు. రాహుల్ గాంధీ బిజెపిని బద్నాం చేద్దామనుకుని తానే అడ్డంగా దొరికిపోయారని బిజెపి నేతలు వ్యాఖ్యానించారు. ఇంత కాలానికైనా బిజెపి సాధించిన అద్భుత విజయాన్ని రాహుల్ గాంధీ ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు కూడా చెప్పారు కమలనాథులు.

బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపిందన్న బిజెపి నేతలు ఆర్టికల్ 370 రద్దు తోనే కశ్మీరు లో ప్రశాంతత నెలకొల్పామని బిజెపి చెప్పుకుంటూ వచ్చింది. ఆర్టికల్ 370 పై కాంగ్రెస్ పార్టీ రచ్చ రచ్చ చేసింది. ఇపుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో బిజెపి తీసుకున్న నిర్ణయాల వల్లనే జమ్ము కశ్మీరు లో భారత జెండాలు రెపరెప లాడాయని రాహులే ఒప్పుకున్నట్లు అయ్యింది. బిజెపి దీన్ని వెంటనే అడ్వాంటేజ్ గా తీసుకోగా కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడాలో అర్ధం కాక నోట్లో బెల్లం ముక్క పెట్టుకుని మౌనంగా ఉండిపోయారు. సరే ఇక్కడ చేసిన రచ్చ తో ఆగితే బానే ఉండేది కానీ రాహుల్ గాంధీ ఆగదలచుకోలేదు. పది రోజుల పర్యటన కోసం రాహుల్ గాంధీ యూకే వెళ్లారు. అక్కడికి వెళ్లిన వెంటనే ఓ సభలో మాట్లాడుతూ పుసుక్కున ఓ మాట అనేశారు. ఇపుడు దానిపైనా దేశంలో కావల్సినంత చర్చ జరుగుతోంది. రాహుల్ ఏమన్నారంటే భారత దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరుగులా చూస్తున్నారంటూ బిజెపి ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. ఇపుడీ వ్యాఖ్యలపై బిజెపి నిప్పులు చెరుగుతోంది.

ఇంత వరకు మన శత్రుదేశం అయిన పాకిస్థాన్ కూడా ఇతర దేశాల వేదికలపై ఇంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయలేదని బిజెపి నేతలు దుయ్యబట్టారు. భారత దేశం పరువు తీసేలా రాహుల్ గాంధీ వ్యవహరించడం క్షమించరాని నేరమని వారు విమర్శించారు. లౌకిక వ్యవస్థను నిర్వహిస్తోన్న భారత్ లో మైనారిటీలపై వివక్ష సాగుతోందనడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఏమన్నా ఉంటే అది భారత్ లో పార్లమెంటు వేదికపై అంటే అది వేరు. పొరుగు దేశాలకు పోయి మన దేశం ప్రతిష్ఠను మంటగలిపేలా వ్యాఖ్యానించడం ఏంటని రాహుల్ పై మండి పడుతున్నారు మేథావులు. ఏ మాట ఎక్కడ మాట్లాడాలి ఎప్పుడు ఏం మాట్లాడాలి అన్నది కూడా తెలీకపోతే ఎలాగ అని వారు నిలదీస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై సొంత దేశాన్ని ఇబ్బంది పెట్టేలా పరువు తీసేలా రాజకీయాలు చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. రాహుల్ పై బిజెపి మండిపడుతోంటే కాంగ్రెస్ నేతల్లో ఒక్కరు కూడా రాహుల్ కు మద్దతుగా ఒక్క వ్యాఖ్య కూడా చేయలేకపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

పేరుకి మల్లి కార్జున ఖర్గేని పార్టీ అధ్యక్ష పీఠం పై కూర్చోబెట్టింది కాంగ్రెస్ నాయకత్వం. 2024 ఎన్నికల్లో ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీని ఒక్క సారైనా పిఎం సీటుపై కూర్చుండగా చూసి మురిసిపోదామని సోనియా గాంధీ తల్లి మనసు తల్లడిల్లిపోతోంది. రాహుల్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ఇంకా చిన్న పిల్లాడిలా తప్పులపై తప్పులు చేసుకుంటూ పార్టీకి గుదిబండగా వ్యవహరిస్తున్నారని పాత తరం కాంగీయులు అంటున్నారు.
గతంలోనూ అంతే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండగా రాహుల్ గాంధీ ఓ అల్లరి పని చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఓ జీవోను బహిరంగంగా చింపి పారేశారు. అది ప్రధాని మన్మోహన్ సింగ్ నీ ఆయనతో పాటు యూపీయే ఛెయిర్ పెర్సన్ గా ఉన్న తల్లి సోనియా గాంధీనీ కూడా అవమానించినట్లే అవుతుందన్న సింపుల్ లాజిక్ కూడా రాహుల్ కి అర్ధం కాలేదు. బొత్తిగా చదువు అబ్బని పిల్లల్ని చూసి బాధపడే తల్లుల్లా సోనియా గాంధీ కూడా రాహుల్ ఎప్పటికి మారతాడో ఎప్పటికి బాధ్యతలు అర్ధం చేసుకుంటాడో ఎప్పుడెప్పుడు పిఎం సీటులో కూర్చుని తనకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పిస్తాడో అని ఆశగా ఎదురు చూస్తున్నారు సోనియా. ఆమెకు ఏటా ఒక ఏడాది వయసు మీద పడిపోతోంది కానీ రాహుల్ గాంధీకే ఒక్క కొత్త విషయం కూడా అర్ధం కావడం లేదని గాంధీ కుటుంబ విధేయులు బెంగపెట్టేసుకుంటున్నారు.