దేశంలో శాంతి, సామరస్యం కోసమే యాత్ర…రాహుల్

By KTV Telugu On 2 November, 2022
image

రాహుల్ పాదయాత్ర ఎలా సాగుతోంది. జనంతో ఆయన కనెక్ట్ అవుతున్నారా. జనం బాధలు అర్థమవుతున్నాయా…. తమకు సాయపడే నాయకుడొచ్చారని జనం విశ్వసిస్తున్నారా.. వారికి భవిష్యత్తుపై బెంగ తగ్గిందా..

ముమ్మాటికి పొలిటికల్ యాత్రేనంటున్న రాహుల్
ప్రతీ ఒక్కరితో మాట్లాడేందుకే వచ్చానంటున్న కాంగ్రెస్ నేత
వ్యవస్థలను బీజేపీ కబందహస్తాల నుంచి కాపాడాలి

భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ఎంటరైన తర్వాత ఆయన స్వయంగా చెప్పుకున్న అంశం ఒకటి ఉంది. తనది ముమ్మాటికీ పొలిటికల్ యాత్రేనని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రతీ ఒక్కరితో మాట్లాడేందుకు జనం కష్ట సుఖాలు తెలుసుకునేందుకే రోడెక్కానని రాహుల్ రోజూ చెబుతున్నారు. యాత్ర ముగిసిన వెంటనే రాజకీయ లబ్ధి కలుగకపోయినా… ప్రజల అవసరాలు అర్థమవుతాయని ఆయన వాదన. దేశంలో శాంతి, సామరస్యం కోసం తను యాత్ర చేపట్టానని రాహుల్ వెల్లడించారు. వ్యవస్థలను బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడే ప్రయత్నమే తన యాత్ర అని ఆయన చెప్పుకున్నారు..

ప్రతీ ఒక్కరినీ పలుకరించే ప్రయత్నం
ఫిజికల్ టచ్ తో పాటు… మాట కలుపుతున్న రాహుల్
ఒక్క నిమిషమైనా రాహుల్ తో నడిచేందుకు జనం తహతహ
వేర్వేరు వర్గాలతో నడిచే అవకాశం

నిజానికి రాహుల్ ఒక్కరే నడవడం లేదు. ఆయనతో పాటు పార్టీ కేడర్ ఉంది. దారిలో చాలా మంది వచ్చి కాసేపు నడుస్తున్నారు. వచ్చిన వారితో చేతులు కలుపుతూ, భుజాల మీద చేతులు వేస్తూ.. వారి బాగోగులు తెలుసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. జనం సైతం ఢిల్లీ నుంచి గలీకి వచ్చిన రాహుల్ ను చూసేందుకు ఎగబడుతున్నారు. ఒక్క నిమిషమైన రాహుల్ తో నడిస్తే చాలంటూ అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతున్నారు… సమాజంలో వేర్వేరు వర్గాల వారు వచ్చి రాహుల్ తో కొన్ని క్షణాలు నడిచే అవకాశం కూడా వస్తోంది. స్థూలంగా వాళ్లెవరూ .. ఎక్కడ నుంచి వచ్చారనే అంశాలను పక్కనున్న కాంగ్రెస్ నేతలు ఆయనకు వివరిస్తున్న మాట మాత్రం నిజం…

స్థానిక సమస్యలను తెలుసుకుంటున్న రాహుల్
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తాం
చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తాం..
ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని పక్కాగా అమలు చేస్తాం..

యాత్రలో రాహుల్ కు స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకునే అవకాశం కొంతమేర లభిస్తోందనే చెప్పాలి. రాహుల్ ను కలుస్తున్న ప్రజా సంఘాలు .. దీర్ఘకాలిక సమస్యలను ప్రస్తావిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యాత్ర సందర్భంగా ఆయన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని …. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 60 వేల చేనేత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తున్నందున పేదలు నష్టపోతున్నారని రాహుల్ అక్కడక్కడా ప్రస్తావిస్తున్నారు. అందుకే ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయడంతో పాటు ఫీజు రీయింబర్స్ మెంట్ ను పక్కాగా అమలు చేస్తామంటున్నారు…

వినతిపత్రాలు స్వీకరిస్తున్న రాహుల్
సుక్ష్మంగా సమస్యలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు
మొక్కుబడి యాత్ర అంటూ విమర్శలు

రాహుల్ యాత్రను చూసేందుకు జనం రావడం, వినతిపత్రాలు అందించడం లాంటి చర్యలే ఆయన ప్రజలతో కనెక్ట్ అవుతున్నట్లు నిరూపిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే సమస్యలను సూక్ష్మస్తాయిలో పరిశీలించడం లేదని, జాతీయ స్థాయి నాయకుడు జనంలోకి వస్తే ఇదో సమస్య అని కొందరి వాదన. మొక్కుబడిగా యాత్ర నిర్వహించి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని మరో వర్గం వాదన. ఏదైనా సరే… బీజేపీ, టీఆర్ఎస్ లకు పోటీగా రాజకీయ ప్రత్యామ్నాయం వెదుక్కునే వాళ్లు రాహుల్ యాత్రతో కనెక్ట్ అవుతున్నారని చెప్పేందుకు మాత్రం వెనుకాడకూడదు…