రెండేళ్ల జైలుశిక్షతో ప్రమాదంలో రాహుల్‌ పదవి

By KTV Telugu On 24 March, 2023
image

విదేశీగడ్డపై మన దేశాన్ని నిందించారన్న ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉన్న రాహుల్‌గాంధీకి మరో రూపంలో గట్టి దెబ్బే తగిలింది. మోడీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని దాఖలైన పరువునష్టం కేసులో ఆయనకు రెండేళ్ల జైలుశిక్షపడటంతో కాంగ్రెస్‌ ఉలిక్కిపడింది. మోడీ ఇంటిపేరున్న వారంతా దొంగలంటూ చేసిన వ్యాఖ్యలపై సూరత్‌ కోర్టు ఈ శిక్ష విధించింది. ఈ తీర్పుపై అప్పీల్‌ చేసుకునేందుకు నెలరోజుల గడువిచ్చిన కోర్టు రాహుల్‌కి బెయిల్ మంజూరుచేసింది. ఈ తీర్పు వెనుక కూడా కాంగ్రెస్ కుట్రకోణాన్ని చూస్తోంది.

పరువు నష్టం కేసులో రాహుల్‌గాంధీ నేర నిరూపణతో ఆయనపై వేటు పడుతుందా అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే నేరం నిరూపితమైతే ఎంపీలు తమ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎంపీలు ఏదైనా కేసులో దోషిగా తేలి కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హతకు గురవుతారు. సూరత్‌ కోర్టు తీర్పుతో రాహుల్‌ గాంధీని అనర్హుడిగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. బ్రిటన్‌ యూనివర్సిటీలో రాహుల్‌ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని చర్యలు తీసుకుందామనుకుంటున్న బీజేపీకి పరువు నష్టం కేసు కలిసొచ్చింది.

అయితే సూరత్‌ కోర్టు అప్పీలుకు సమయం ఇవ్వటంతో 30రోజుల్లోపు ఆయన సభ్యత్వంపై ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చు. లక్షద్వీప్‌ ఎన్‌సీపీ ఎంపీ మొహమ్మద్‌ ఫైజల్‌ని ఓ హత్యాయత్నం కేసులో అక్కడి కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఆయన్ని అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రెటేరియట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అనంతరం సెషన్స్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆ ఎంపీ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం తీర్పు అమలును నిలిపివేయటంతో ఆయన ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కేంద్ర న్యాయశాఖ సిఫార్సు చేసింది. దీంతో రాహుల్‌ విషయంలోనూ తొందరపడొద్దన్న ఆలోచనతో బీజేపీ ఉంది.