కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత దేశం పరువు తీసేశారా. లండన్ లో రాహుల్ చేసిన వ్యాఖ్యలు నిజంగానే భారత్ ను అవమానించేలా ఉన్నాయా. బిజెపి నేతల ఆరోపణలకు రాహుల్ గాంధీ దీటుగా రిప్లై ఇచ్చారు. గతంలో మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన రాహుల్ అపుడు మోదీ కూడా భారత దేశాన్ని అవమానించినట్లు కాదా అని నిలదీస్తున్నారు. దీనికి బిజెపి నేతల వద్ద సమాధానం ఉందా అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ అగ్రనేత నెహ్రూ కుటుంబ వారసుడు పార్టీ యువరాజు రాహుల్ గాంధీ మొన్న లండన్ లో చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ విరుచుకు పడిపోయింది. రాహుల్ గాంధీకి కొంచెమైనా దేశభక్తి ఉందా అని నిలదీసింది. దేశాన్ని ఇంతలా అవమానిస్తారా అని మండి పడింది. రాహుల్ గాంధీ ఏ అవకాశం వచ్చినా భారత దేశ ప్రతిష్ఠను మంటగలపడానికి ఏ మాత్రం వెనకాడరని కూడా కమల నాథులు విమర్శించారు. బిజెపి నేతలు ఒక్కసారిగా రాహుల్ పై నిప్పులు చెరగడంతో కాంగ్రెస్ నేతలు కూడా మౌనంగా ఉండిపోయారు. ఇంతకీ రాహుల్ గాంధీ లండన్ లో ఏమన్నారు.
అక్కడ రాహుల్ మాట్లాడుతూ భారత దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని ఆరోపించారు. ప్రతిపక్షాలు ప్రశ్నించడాన్ని అధికారంలో ఉన్న వారు సహించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మా పార్లమెంటులో నేను ఇలాంటి వ్యాఖ్యలు చేసే పరిస్థితి కూడా లేదన్నారు. అంతే ఈ వ్యాఖ్యలు ఇక్కడ మంటలు రాజేశాయి. చూశారా ఈ రాహుల్ గాంధీకి ఏమన్నా మర్యాద ఉందా కొంచెమైనా ఇంగితం ఉందా దేశంపై ఏ కోశాన అయినా ప్రేమ ఉందా దేశ భక్తి అనేది ఎక్కడైనా ఉందా ఇలా మనది కాని దేశానికి పోయి మన దేశం పరువు తీసేలా మాట్లాడొచ్చా అంటూ బిజెపి నేతలు బుగ్గలు నొక్కేసుకున్నారు. ఇదేనా రాహుల్ గాంధీకి ఉన్న సంస్కారం అని నిలదీశారు. రాహుల్ గాంధీ భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు.
బిజెపి నేతల అభ్యంతరాలను గమనించిన రాహుల్ గాంధీ తాజాగా దీనికి దీటుగానే కౌంటర్ ఇచ్చారు.
నేను ఎన్నడూ భారత దేశానికి వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడను మాదేశ ప్రతిష్ఠను కించపర్చేలా వ్యాఖ్యానాలు చేయనే చేయను. నేను చేసింది ప్రస్తుత పాలకులు అనుసరిస్తోన్న విధానాల గురించే అని రాహుల్ గాంధీ బదులిచ్చారు. ఇపడు దేశం పరువు పోయిందని గగ్గోలు పెడుతోన్న బిజెపి నేతలు గతంలో నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడరేం అని రాహుల్ గాంధీ నిలదీశారు. గతంలో విదేశీ పర్యటనల్లో నరేంద్ర మోదీ మాట్లాడుతూ తాను అధికారంలోకి రాకముందు 70 ఏళ్ల పాటు భారత దేశంలో ఎలాంటి అభివృద్ధీ జరగలేదు. గత పాలకులు చేసిందంటూ ఏమీ లేదు అని వ్యాఖ్యానించారు. ఇపుడు రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలనే గుర్తు చేస్తున్నారు. అపుడు మోదీ చేసిన ఈ వ్యాఖ్యల అర్ధం ఏంటి సార్ అని బిజెపి నేతలను నిలదీస్తున్నారు రాహుల్ గాంధీ. 70ఏళ్లలో భారత్ లో ఏమాత్రం అభివృద్ధి జరగలేదంటే అది భారత్ కు అవమానం కాదా అని రాహుల్ ప్రశ్నించారు.
రాహుల్ చేసిన వ్యాఖ్యల్లో అర్ధం ఉందంటున్నారు మేథావులు. నిజంగానే 70 ఏళ్లలో భారత్ లో ఏమీ జరగలదేనడం దుస్సాహసమే అంటున్నారు రాజకీయ పండితులు. నిజానికి భారత మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ హయాలో దేశంలో ఎంతో అభివృద్ధి జరిగిందనేది వాస్తవం. భారత్ లో చెప్పుకోదగ్గ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు కానీ పరిశోధనా సంస్థలు కానీ నెహ్రూ హయాంలోనే అవతరించాయి. ఎన్నో సాగు నీటి ప్రాజెక్టులు కూడా నెహ్రూ హయాంలోనే పురుడు పోసుకున్నాయి. నీటి పారుదల ప్రాజెక్టులను నెహ్రూ ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించేవారు. ఆయన తర్వాత ఆయన తనయ ఇందిరా గాంధీ హయాంలోనూ దేశం చాలా రంగాల్లో అభివృద్ది సాధించింది. అసలు ఏమీ జరగలేదనడం దుర్మార్గమే అంటున్నారు విద్యావేత్తలు.
2014లో నరేంద్ర మోదీ వచ్చాక దేశం ప్రగతి పథంలో మరింత ముందుకు పోతూ ఉండచ్చు. దాన్ని ఎవరూ కాదనరు. కానీ తనకు ముందు పాలించిన వారు ఎలాంటి అభివృద్ధి చేయలేదనడం దురహంకారం కాక ఇంకేమిటి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీనికి బిజెపి నేతలు ఇంత వరకు స్పందించలేదు. రాహుల్ గాంధీకి మాట్లాడ్డం రాదు. పప్పు అంటూ వేళాకోళాలు చేసేవారు కూడా రాహుల్ లేవనెత్తిన ఈ ప్రశ్నను చూసి ఫిదా అవుతున్నారు. నిజంగానే వీటికి బిజెపి నేతలు సమాధానం చెప్పాలంటున్నారు వారు. ఏదిఏమైనా మోదీ అయినా రాహుల్ గాంధీ అయినా దేశంలోని పరిస్థితుల గురించి పొరుగు దేశాల్లో మాట్లాడ్డం మాత్రం సరియైనది కాదంటున్నారు మేథావులు. ఇతర దేశాల అధినేతలు మన దేశం వచ్చి వారి దేశాల గురించి అవమానకరంగా మాట్లాడనే మట్లాడరు. మరి మన నేతలు మాత్రమే అలా ఎందుకు చేయాలని వారు నిలదీస్తున్నారు.