బీజేపీ ప్లాన్ రివర్స్ కొట్టిందే

By KTV Telugu On 31 March, 2023
image

రాహుల్ పై అనర్హత వేటు వేసి తప్పు చేశామా అని బిజెపి అగ్రనేతల్లో చర్చ మొదలైందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో అనర్హత వేటును కలిసొచ్చిన అదృష్టంగా కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఈ విషయంలో సారీ చెబితే వేటు ఎత్తేస్తామని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినా అనర్హత వేటును ఎంజాయ్ చేస్తేనే బెటరని కాంగ్రెస్ అనుకుంటోందట.
వేటు అయితే వేసేసింది కానీ ఆ తర్వాతనే ఎందుకు వేశామా అని బిజెపి వ్యూహకర్తలు తలలు పట్టుకుంటున్నారట. ఎందుకంటే అనర్హత వేటుతో రాహుల్ గాంధీకి ఒక్కసారిగా విపక్షాల నుండి మద్దతు లభించింది. అది రోజు రోజు కీ పెరుగుతోంది. బయట మేథావులుల్లోనూ రాహుల్ గాంధీ పట్ట సానుభూతి వ్యక్తం అవుతోంది. బిజెపి వైఖరిని అందరూ తప్పు బడుతున్నారు. బిజెపిలోని మితవాదులు కూడా అనర్హత వేటు వేయడం తెలివైన నిర్ణయం కాదని అంటున్నారు. సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ పై కోర్టులో అప్పీలు చేసుకోడానికి నెల రోజుల గడువు ఉంది. ప్రస్తుతం వేటు ద్వారా వచ్చిన అనుకూల వాతావరణంతో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా హ్యాపీగానే ఉన్నారు.

వేటు వేయడమే కాదు రాహుల్ గాంధీ ఉంటోన్న అధికారిక క్వార్టర్స్ ను కూడా వెంటనే ఖాళీ చేయాలంటూ రాహుల్ కు నోటీసులు పంపింది పార్లమెంటు. ఇది కూడా రాహుల్ పట్ల సింపతీ పెరగడానికి దోహద పడింది. దీంతో బిజెపి నేతలు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. తాను చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ సారీ చెబితే వేటు ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తామంటూ బిజెపి సంకేతాలు పంపింది. అయితే రాహుల్ మాత్రం దీన్ని ఓ అస్త్రంగా వాడుకోవాలని డిసైడ్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సారీ చెప్పే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. క్షమాపణలు చెప్పడానికి నేనేమీ సావర్కర్ ని కానని.. గాంధీని అని రాహుల్ అన్నారు. అయితే దీనిపై మరాఠా గడ్డకు చెందిన ఎన్సీపీ , శివసేన మాజీ సిఎం ఉద్ధవ్ థాకరేల నుండి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. పోరాడాల్సింది నిరంకుశ వైఖరిపైనే కానీ సావర్కర్ పై కాదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా రాహుల్ కు చిన్న హింట్ ఇచ్చారు. ఈ వేటును ఎలా ఎత్తివేయాలా అన్నదే ఇపుడు బిజెపి నేతలకు అర్ధం కావడం లేదు. వేటు ఉపసంహరించుకుంటే అంతా ఈ అంశాన్ని మర్చిపోతారు. అపుడు కాంగ్రెస్ పార్టీని కూడా జనం మర్చిపోతారు. చాలా కాలంగా జనం మర్చిపోయిన కాంగ్రెస్ ని అనవసరంగా అనర్హత వేటు ద్వారా మనమే గుర్తు చేసినట్లు ఉన్నామని బిజెపి వ్యూహకర్తలు నాలిక్కర్చుకుంటున్నారట. అనర్హత వేటు గురించి దేశమంతా తిరిగి ప్రజలకు వివరిస్తూనే నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని రాహుల్ నిర్ణయించుకున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర కు మంచి స్పందన లభించిన నేపథ్యంలో ఇపుడు అనర్హత వేటు విషయంలో ప్రజలకు చెప్పడానికి మరో యాత్ర చేపట్టాలని రాహుల్ భావిస్తున్నారు. ఈ యాత్ర ఈ ఏడాది వివిధ రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికలతో పాటు 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మైలేజీ తెచ్చిపెడుతుందని కాంగ్రెస్ లోని బుద్ధి జీవులు నమ్ముతున్నారు.

యాత్ర అంటూ మొదలు పెడితే ముందుగా అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన కర్నాటకలో కీలక నియోజక వర్గాలు కవర్ అయ్యేలా యాత్ర షెడ్యూల్ రూపొందించుకోవాలని చర్చ జరుగుతోంది. ఆ తర్వా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికలు ఆ వెంటనే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిజెపి అనాలోచిత నిర్ణయం కారణంగా కాంగ్రెస్ పార్టీకి అనుకోని వరంగా అనర్హత వేటు పరిణమించిందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఆ పార్టీకి చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పటికే రెండు వరుస ఎన్నికల్లో ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ డీలా పడిపోయి ఉంది. పార్టీ శ్రేణులు నిరాశలో మునిగిపోయి ఉన్నాయి. ఈ క్రమంలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరాజయాలు ఆ పార్టీ నాయకత్వాన్ని కృంగదీస్తున్నాయి. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లోనే గాంధీ కుటుంబం పార్టీ అధ్యక్ష పదవికి దూరంగా జరిగి ఆ ముళ్ల కిరీటాన్ని ఎనిమిది పదులు దాటిన మల్లికార్జున ఖర్గే తలపై పెట్టారు. ముళ్లు గుచ్చుకుంటోన్నా ఆ స్పృహకూడా లేని వయసు పాపం ఖర్గేది. ఎన్నికల్లో పార్టీ గెలిస్తే అపుడు నెమ్మదిగా రాహుల్ ను ప్రధానిని చేసుకోవాలని సోనియా భావిస్తున్నారు. అయితే అంత వరకు రాహుల్ ను అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టడానికి సోనియా సుముఖంగానే ఉన్నా రాహులే భయపడిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఇక కాంగ్రెస్ పార్టీ మనుగడే ప్రశ్నార్దకం అవుతుందంటున్నారు రాజకీయ పండితులు. అనర్హత వేటు అస్త్రాన్ని ఒక చేత ధరించి మరో చేత పదేళ్ల మోదీ పాలనలోని వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగాలని రాహుల్ గాంధీ డిసైడ్ అయ్యారు. అయితే కాంగ్రెస్ లో జోష్ నెమ్మదిగానైనా సరే పెరుగుతోందని గ్రహించిన బిజెపి అప్పుడే అప్రమత్తం అయిపోతోంది.

దేశం మొత్తం మీద 50 శాతం ప్రజలు బిజెపికి ఓటు వేశారని ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్యనే గుర్తు చేశారు. దీని వెనుక ఆంతర్యం లేకపోలేదు. కాంగ్రెస్ నేతలు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా ఎన్ని ఎత్తుగడలు వేసినా ఏం ప్రచారం చేసినా వచ్చే ఎన్నికల్లో బిజెపిని ఓడించడం సాధ్యం కాదని చాటి చెప్పడానికే మోదీ ఈ ఓట్లశాతం లెక్కని వాడుకున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల రాహుల్ గాంధీ పట్ల ప్రజల్లో సానుభూతి పెరిగిపోకుండా అడ్డుకట్ట వేయాలన్న ఆలోచనలో కమలనాధులు ఉన్నారు. అయితే ఏం చేయాలన్న దానిపైనే క్లారిటీ రాలేదంటున్నారు. ఈ టైమ్ లో నేషనల్ హెరాల్డ్ కేసును మరోసారి తిరగదోడితే ఎలా ఉంటుందన్న చర్చ కూడా బిజెపిలో జరిగిందంటున్నారు. అయితే అలా చేస్తే కాంగ్రెస్ పార్టీకి మరింత మేలు చేసినట్లు అవుతుందని ప్రజల్లో మనం కాంగ్రెస్ పై కక్ష సాధిస్తున్నామన్న భావన కలిగే ప్రమాదం ఉందని మరి కొందరు నేతలు హెచ్చరించారట. బిజెపి ఇలా ఉంటే కాంగ్రెస్ లో మాత్రం హుషారు పెరిగింది. చాలా మంది సీనియర్ నేతల్లో ఉత్సాహం కనపడుతోంది. ఈ ఉత్సాహాన్ని ఇదే దూకుడుతో పార్టీ శ్రేణుల్లో నింపేస్తే బిజెపికి చుక్కలు చూపించ వచ్చునని కాంగ్రెస్ వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందన్నట్లు కాంగ్రెస్ ను డిఫెన్స్ లో పడేయాలని అనర్హత వేటు వేస్తే అది బిజెపికే ప్రాణ సంకటంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.