షిండే కోసం బేరసారాలు..మహారాష్ట్రలో కుంపట్లు…
రవిరాణా మంట పెట్టేశాడు..షిండే ఆర్పగలడా?
మహారాష్ట్రలో ఏం జరిగిందో దేశమంతా చూసింది. ఏక్‌నాథ్‌షిండే తిరుగుబాటు శివసేనను నిలువునా చీల్చింది. బాలాసాహెబ్ అడుగుజాడల్లో నడుస్తున్నామని, ఆయన వారసుడు పార్టీ సిద్ధాంతాలకు నీళ్లొదిలినందుకే ధిక్కరించామని తన తిరుగుబాటుని షిండే సమర్ధించుకున్నారు. కానీ బీజేపీతో పొత్తుపెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే తెరవెనుక ఏం జరిగిందో అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు దానికి సాక్ష్యాలు బయటికొస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కొనుగోళ్ల పర్వానికి తెరలేపారని రాజకీయ దుమారం రేగుతోంది. స్టింగ్ ఆపరేషన్లు, ఆడియో లీకులతో వాతావరణం వేడెక్కింది. ఇదే సమయంలో మహారాష్ట్రలో నాలుగునెలల క్రితం ఏక్నాథ్ షిండేని ముందుపెట్టి బీజేపీ సాగించిన బేరసారాలు బట్టబయలయ్యాయి. ఉద్దవ్ఠాక్రేని ధిక్కరించేందుకు శివసేన ఎమ్మెల్యేలకు బీజేపీ బంపరాఫర్లు ఇచ్చింది. ఉద్దవ్ తమను కాదని కాంగ్రెస్-ఎన్సీపీలతో జతకట్టటంతో ప్రభుత్వాన్ని కూలదోయడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ చివరికి తన పంతం నెగ్గించుకుంది.
ఏక్‌నాథ్‌షిండేతో పాటు అసోం వెళ్లేందుకు ప్రహార్ జనశక్తి పార్టీ ఎమ్మెల్యే బచ్చు కదు రూ.50 కోట్లు తీసుకొన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రవి రాణా చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ నుంచి తాను రూ.50 కోట్లు తీసుకుని ఉంటే తనతో పాటు రవిరాణా, ఇతర ఎమ్మెల్యేలు కూడా తీసుకున్నట్లేనని బచ్చు కదు బాంబుపేల్చారు. రాణాతో సారీ చెప్పించకపోతే ప్రభుత్వం నుంచి తప్పుకొంటానని బచ్చుకదు హెచ్చరించారు. నవంబర్1దాకా గడువు ఇచ్చారు.
రవిరాణాతో పాటు బచ్చుకదు కూడా అమరావతి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు. ఇద్దరూ ఉద్దవ్‌ని వ్యతిరేకించినవారే. ఈ లొల్లితో బేరసారాలు బజారున పడతాయేమోనని బీజేపీ భయపడుతోంది. రాణా తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే కోర్టులో కేసేసి షిండే, ఫడ్నవిస్‌లను ప్రతివాదులుగా చేరుస్తానంటున్నాడు బచ్చు కదు. మిగిలిన 50మంది కూడా డబ్బులు ఎవరినుంచి తీసుకున్నారో చెప్పాల్సి ఉంటుందని అందరినీ కెలికేస్తున్నాడు. ఉద్దవ్‌ని సీఎం సీటునుంచి దించినా షిండే పరిస్థితి దినదినగండంగానే ఉంది. చీలికవర్గంలో అసంతృప్తి పెరిగిపోతోంది. మంత్రి పదవులు రానివారు కారాలుమిరియాలు నూరుతున్నారు. ఇప్పుడు నవీనీత్కౌర్రాణా మొగుడు పెట్టిన మంట సీటుకు తగులుతోంది.