లోక్ సభ కు రెడీ

By KTV Telugu On 30 December, 2023
image

KTV TELUGU :-

తెలంగాణాలో  రెండు జాతీయ పార్టీలతో పాటు  ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మర్చిపోయి లోక్ సభ ఎన్నికలకోసం టాప్ గేర్ వేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి గురించి అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదనుకుంటోన్న బి.ఆర్.ఎస్. నాయకత్వం వరుసగా రెండు సార్లు  అధికారంలోకి వచ్చిన  కారణంగానే మూడో ఎన్నికల్లో  కొద్ది పాటి ప్రజావ్యతిరేకత  తమని ఓడించిందని అంచనాకు వచ్చింది. అయితే మరీ ఘోరమైన పరాజయం కాదు కాబట్టి బాధ పడాల్సిన అవసరం లేదని గులాబీ నేతలు  భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటి  తిరిగి  పై చేయి సాధించాలని వారు భావిస్తున్నారు. ఇక మొన్నటి ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లోనూ మంచి విజయాలు సాధించి కేంద్రంలో అధికారం సంపాదించాలని చూస్తోంది. గత ఎన్నికల కన్నా  ట్యాలీ పెంచుకోవాలని బిజెపి పట్టుదలగా ఉంది.

2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్, బిజెపి, బి.ఆర్.ఎస్. లు  సన్నాహాలు మొదలు పెట్టేశాయి. తెలంగాణాలో  నిన్నటి వరకు అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్.  ఈ ఎన్నికల్లో ఓటమి చెందింది. అయితే  మరీ దారుణంగా ఏమీ ఓడిపోలేదు. 39 స్థానాలు గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగానే అవతరించింది బి.ఆర్.ఎస్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇంచుమించు క్లీన్ స్వీప్ చేసింది బి.ఆర్.ఎస్.  గ్రామీణ ప్రాంతంలోనే  కాంగ్రెస్ పై చేయి సాధించగలిగింది. ఆ ఓటమి నుండి ఇపుడిపుడే బయట పడుతోన్న బి.ఆర్.ఎస్. నాయకత్వం  లోక్ సభ ఎన్నికలకు రెడీ అయిపోతోంది. వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా చక్రం తిప్పచ్చని కేసీయార్ భావిస్తున్నారు.

తెలంగాణాలో మొత్తం 17 లోక్ సభ నియోజక వర్గాలున్నాయి.  మజ్లిస్ పార్టీకి కంచుకోట అయిన హైదరాబాద్ ను మినహాయిస్తే 16 స్థానాలు ఉంటాయి. వీటిలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన వారిలో  జనాదరణ ఉన్న వారిని లోక్ సభ ఎన్నికల బరిలో  దింపాలని భావిస్తోంది. కొన్ని చోట్ల కొత్త నేతలను తెరపైకి తీసుకురావాలని అనుకుంటోంది. చేవెళ్ల లో రంజిత్ రెడ్డికి  టికెట్ ఇస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు   తెలుస్తోంది. రంజిత్ రెడ్డే ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణాపై ప్రత్యేక  దృష్టి సారిస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంచుమించు వారానికి ఓసారి ఢిల్లీ వెళ్తోన్న  రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలతో  పార్టీ అధిష్ఠానం  ప్రత్యేక చర్చలు జరుపుతూనే ఉంది. ఉత్తరాదిలో మూడు రాష్ట్రాల్లో  ఓడిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకునేలా అభ్యర్ధులను ఎంపిక చేయాలని  టెన్ జన్ పథ్ భావిస్తోంది. కాంగ్రెస్  పార్టీలోనూ  అసెంబ్లీ ఎన్నికల్లో  ఓడిపోయిన సీనియర్లు లోక్ సభ స్థానాల కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.  మధు యాష్కీ , జీవన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హనుమంతరావు,మల్లు రవి ,రేణుకా చౌదరి వంటి నేతలు లోక్ సభ టికెట్ల కోసం ఇప్పట్నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకుని సత్తా చాటిన  బిజెపి   ఒక విషయంలో మాత్రం బాధగానే ఉంది. ఆ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన ముగ్గురు ఎంపీలు  పరాజయం పాలు కావడం కమలనాథులకు షాకే. బండి సంజయ్, సోయం  బాపూరావు, ధర్మపురి అరవింద్ కూడా గెలిచి ఉంటే  బిజెపి స్కోర్ 11 అయ్యేది.  ఆ ఎన్నికల్లో పరాజయం పాలైన ఈ ముగ్గురు ఎంపీలు లోక్ సభ ఎన్నికల్లో గత ఎన్నికల్లో తాము పోటీ చేసిన స్థానాలనుంచే టికెట్లు ఆశిస్తున్నారు. ఇక తెలంగాణా లో  ఎన్నికల వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యతను అమిత్ షా భుజాలపై పెట్టింది పార్టీ నాయకత్వం.

అసెంబ్లీ ఎన్నికల  ఫలితాలను మించి లోక్ సభలో  విజయాలు సాధిస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే   గ్రేటర్ పరిధిలోని 24 నియోజక వర్గాల్లో ఒక్క చోట కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ పార్టీ  ఈ పరిధిలోని లోక్ సభ స్థానాల్లో ఎలా గెలుస్తుందని  రాజకీయ పండితులు  ప్రశ్నిస్తున్నారు. సికింద్రాబాద్, మల్కాజగిరి లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో కాంగ్రెస్ కు చేదు అనుభవాలు మిగిలాయి. ఈ స్థానాల్లో బి.ఆర్.ఎస్. క్లీన్ స్వీప్ చేసి జోష్ మీద ఉంది. అంచేత లోక్ సభ ఎన్నికల్లోనూ సికింద్రాబాబ్, మల్కాజగిరి స్థానాలు తమవేనని బి.ఆర్.ఎస్. అంటోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకన్నా లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణా ప్రజలు బిజెపి వైపు మొగ్గు చూపుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. మొత్తానికి తెలంగాణాలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలూ   దూకుడు పెంచేశాయి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి