కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి తన రాజకీయ భవిష్యత్తుపై కన్ఫ్యూజన్‌లో పడినట్టున్నారు. ప్రస్తుతం దేశమంతా కాంగ్రెస్ వీక్‌గా ఉన్న పరిస్థితుల్లో రేణుకాచౌదరికి ఆ పార్టీ నుంచి ఇప్పట్లో ఎలాంటి పదవులు వచ్చే ఛాన్స్ లేదు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆమె తెలంగాణ నుంచి పోటీ సంగతేమో గానీ ఏపీపై ఫోకస్ పెడుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో గతంలో హవా చూపిన రేణుకాచౌదరి కొన్నేళ్ల నుంచి క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. అయితే రాబోయే ఎన్నికల్లో ఆమె పోటీకి సంబంధించి రకరకాల స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఓ సారి ఖమ్మం నుంచి పోటీ చేస్తానంటున్నారు. మరోసారి గుడివాడ నుంచి బరిలోకి దిగుతానంటున్నారు. ప్రస్తుతం మళ్లీ మనసు మార్చుకొని తన చూపు విజయవాడ లోక్ సభ స్థానం వైపు మళ్లించారు.
అయితే ఎక్కడ పోటీచేసినా అది కాంగ్రెస్ టికెట్‌పైనే అని చెబుతున్నారు రేణుకాచౌదరి. ఏపీలో ఉనికిలో లేని కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఏమవుతుంది తెలుసు. అయినా సొంత సామాజికవర్గం అండగా నిలుస్తుందనే ధైర్యంతో ఆమె పోటీకి సై అంటోన్నారు. ఏపీకి రావాలని ప్రజలు తనను ఆహ్వానిస్తున్నారని పార్టీ అధిష్టానం ఆదేశాలమేరకు నిర్ణయం తీసుకుంటానని రేణుకా చౌదరి చెబుతున్న మాట. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిపై పోటీ చేస్తానంటూ ఇటీవల కాలంలో రేణుకాచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ లోక్ సభ స్థానం నుంచి అయినా పోటీ చేస్తానని అంటున్నారు. అందుకు తగ్గట్లే కొంతకాలంగా రేణుకాచౌదరి జగన్ సర్కార్‌పై విమర్శలు కూడా చేస్తున్నారు. ఏపీలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని రౌడీయిజం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని ఆమె మండిపడ్డారు. అమరావతి రైతులు మూడేళ్లుగా ఆందోళన చేస్తుంటే సీఎం పట్టించుకోకపోవటం దారుణమన్నారు. మొదటి నుంచి రేణుకాచౌదరి అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె పదే పదే ఏపీలో పోటీ చేస్తానని కామెంట్ చేయడం ఆసక్తి రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే తెలంగాణలో కాంగ్రెస్ వెయ్యిరెట్లు మెరుగ్గా ఉంది. అందునా రేణుకాచౌదరి ఉన్న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉంది. అయినా ఆమె తెలంగాణ గురించి ప్రస్తావించకుండా గుడివాడ విజయవాడ పేర్లు పలుకుతున్నారు. కేవలం వార్తల్లో నిలవడానికే ఆమె ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారా లేక ప్రత్యేకమైన వ్యూహం ఏమైనా దాగి ఉందా అన్నది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ రాజకీయాల్లో తాను రాణించే పరిస్థితులు లేవనే రేణుకా చౌదరి ఏపీ రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారేమో అనే చర్చ కూడా సాగుతోంది. ఇక ఏపీలో పూర్తిగా బలహీనంగా మారిపోయిన కాంగ్రెస్ కృష్ణా జిల్లాలో ఓ చోట రేణుకాచౌదరిని పోటీ చేయించడం ద్వారా ఆ సామాజికవర్గం ఓట్లను ఆకర్షించవచ్చనే ఎత్తుగడ కూడా కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. కారణం ఏదైనా ఏపీ రాజకీయాలపై రేణుకా చౌదరి చేస్తున్న కామెంట్స్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ డిస్కషన్ జరుగుతోంది. రేణుకాచౌదరి ఔట్‌డేటెడ్ పొలిటీషిషన్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.