మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు కన్నడ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. వివాదం మరింత ముదరడంతో జేడీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.కర్ణాటకను కుదిపేస్తున్న అశ్లీల వీడియోల వ్యవహారంపై తొలిసారి స్పందించారు హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ. సత్యమే జయిస్తుంది అంటూ ట్వీట్ చేశారు. సిట్ దర్యాప్తునకు హాజరయ్యేందుకు తాను బెంగళూరులో లేనని.. అడ్వకేట్ ద్వారా అధికారులకు సమాచారం ఇచ్చారు ప్రజ్వల్ రేవణ్ణ. విచారణకు హాజరయ్యేందుకు 7రోజులు గడువు కావాలని కోరారు.
అభ్యంతరకర వీడియోల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వేటు పడింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది జేడీఎస్ కోర్ కమిటీ. నోటీసులు జారీ చేసింది. సిట్ నివేదిక వచ్చేవరకు ప్రజ్వల్‌పై సస్పెన్షన్ కొనసాగనుంది. సిట్టింగ్ స్థానం హసన్ నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా లోక్‌సభ బరిలో నిలిచారు ప్రజ్వల్ రేవణ్ణ. ఏప్రిల్ 26న ఇక్కడ పోలింగ్ పూర్తికాగా.. సరిగ్గా ఒక రోజు ముందు అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో బీజేపీ-జేడీఎస్ కూటమిని కాంగ్రెస్ టార్గెట్ చేసింది.
ఈ నేపథ్యంలోనే ప్రజ్వల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. సిట్ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామన్న మాజీ సీఎం కుమారస్వామి.. ఈ వివాదం వెనక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హస్తం ఉందని ఆరోపించారు. వీడియో క్లిప్పులు ఉన్న పెన్‌డ్రైవ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపిణీ చేశారనే విషయాలపైనా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.ప్రజ్వల్ రేవణ్ణ విషయంలో ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీకి దీటుగా బదులిచ్చింది కమలదళం.
మాతృశక్తికి మోదీ సర్కార్ అండగా నిలుస్తుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. లైంగిక వేధింపులకు పాల్పడినవారిని క్షమించేది లేదని స్పష్టం చేశారు. వీడియోల గురించి ముందే తెలిసినా.. ఎందుకు చర్యలు చేపట్టలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు అమిత్ షా. అశ్లీల వీడియోలు బయటకు వచ్చిన వెంటనే కర్ణాటక ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించగా.. ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయారు.
మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. మూడు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని కర్ణాటక పోలీసులను ఆదేశించింది. ప్రజ్వల్‌ను ముందే ఎందుకు అరెస్ట్ చేయలేదని సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించింది నేషనల్ విమెన్ కమిషన్. లోక్ సభ ఎన్నికల వేళ ప్రజ్వల్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది ఆయన పార్టీ నేతలకు. నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందని..తానే తప్పూ చేయలేదని ప్రజ్వల్ అంటున్నాడు.
అసభ్యకర వీడియోల వ్యవహారం బయటకు రాగానే జర్మనీ పరారయ్యారు ప్రజ్వల్ రేవణ్ణ. ఈ విషయంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్ట్ రద్దుచేయాలని కోరారు. అతడిని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు సిద్ధరామయ్య. ప్రజ్వల్ సెక్స్ కుంభకోణం కర్నాటకకు పరిమితం కాలేదు. యావద్దేశం దీనిపైనే చర్చిస్తోంది. మహిళా సంఘాలు మండి పడుతున్నాయి. రాజకీయ పార్టీలు నేరస్థులను కాపాడుకు వస్తున్నాయని మహిళా నేతలు నిప్పులు చెరుగుతున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…