కర్ణాటకలో విజయం.. రాజస్థాన్ లో సంక్షోభం

By KTV Telugu On 18 May, 2023
image

కర్నాటకలో అద్భుత విజయంతో ఉప్పొంగిపోతోన్న కాంగ్రెస్ నాయకత్వానికి రాజస్థాన్ లో అగ్రనేతల కుమ్ములాటలు తలనొప్పిని తెస్తున్నాయి. ఒక పక్క మోదం మరో పక్క ఖేదం అన్నట్లు ఉంది టెన్ జన్ పథ్ పరిస్థితి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ యువనేత సచిన్ పైలట్ ల మధ్య వార్ ఎన్నికల ఏడాదిలో కాంగ్రెస్ పుట్టి ముంచేదిశగా నడుస్తోంది. ఇది కాంగ్రెస్ హైకమాండ్ ను వణికిస్తోంది. కర్నాటక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి పండగ చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ.
అయితే ఆ పండగ సంబరాల్లోనే పార్టీ నాయకత్వానికి శాంతి అన్నది లేకుండా చేస్తోంది రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ.
కర్నాటక ఎన్నికల విజయోత్సాహంతో ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్థాన్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని కాంగ్రెస్ ధీమాతో ఉంది. అయితే అదే రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరు కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు మరో కీలక నేత సచిన్ పైలట్ కూ మధ్య నాలుగేళ్లుగా వార్ నడుస్తోంది. ప్రస్తుతం పైలట్ రాష్ట్రంలో ఒక ర్యాలీ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని అవినీతికి వ్యతిరేకంగానే ర్యాలీ నిర్వహిస్తున్నాను తప్ప ఎవరికీ వ్యతిరేకంగా కాదని సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. అయితే పైలట్ చేసే ర్యాలీ అశోక్ గెహ్లాట్ కు వ్యతిరేకంగానే అన్నది బహిరంగ రహస్యం.

ఈ ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి పార్టీ నాయకత్వం ఎంతగా ప్రయత్నించినా లాభం ఉండడం లేదు.
ఎన్నికల ఏడాదిలో పార్టీలో ఇదే తరహాలో గొడవలు కొనసాగితే అది ఎన్నికల్లో పార్టీకి నష్టం చేకూరుస్తుందని హైకమాండ్ కంగారు పడుతోంది. సచిన్ పైలట్ ఇప్పుడే కాదు రెండేళ్లుగా అశోక్ గెహ్లాట్ తో పోరాడుతూనే ఉన్నారు. అటు గెహ్లాట్ కూడా పైలట్ పై బహిరంగంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే అప్పుడు హై కమాండ్ పట్టించుకోకపోవడం వల్లనే ఇద్దరి మధ్య గొడవ ముదిరిందని రాజకీయ పండితులు అంటున్నారు. గత ఎన్నికల్లో రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటే అది సచిన్ పైలట్ కృషి వల్లనే. ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించింది కూడా పైలట్టే. యువ నేత కావడం జనంలో మంచి పేరు ఉండడం ఉత్సాహంగా ఉరకలు వేసే నేత కావడం రాహుల్ గాంధీ కోటరీలో కీలక నాయకుడు కావడం వల్ల సచిన్ పైలట్ ప్రచారానికి మంచి స్పందన లభించింది. అది ఓట్లుగా తర్జుమా అయ్యింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఫలితాలు వెలువడిన తర్వాత అందరూ కూడా సచిన్ పైలట్ నే ముఖ్యమంత్రిని చేస్తారని అనుకున్నారు. అయితే చిత్రంగా కాంగ్రెస్ హై కమాండ్ ఎన్నికల వరకు సచిన్ పైలట్ చేత చాకిరీ చేయించుకుని ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీనియారిటీ కార్డు పైకి తీసి సచిన్ పైలట్ కు మొండి చేయి చూపించింది. అటక మీంచి అశోక్ గెహ్లాట్ ను దించి ముఖ్యమంత్రిని చేసింది. అలిగిన పైలట్ ను పిలిచి మీకు ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చింది హై కమాండ్. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత అశోక్ గెహ్లాట్ వ్యూహాత్మకంగా సచిన్ పైలట్ వర్గాన్ని పక్కన పెట్టేశారు.

దీనిపై అలిగిన సచిన్ పైలట్ మధ్య ప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా తరహాలో పైలట్ కూడా తన వర్గ ఎమ్మెల్యేలతో కలిసి బిజెపిలో చేరిపోడానికి రెడీ అయ్యారు. మధ్యప్రదేశ్ మాదిరిగానే రాజస్థాన్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి బిజెపి ప్రభుత్వం వస్తుందనుకున్నారు. అయితే చివరి నిముషంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కలిసి పైలట్ ను బుజ్జగించి గోడదాటకుండా ఆపారు. వాళ్ల భరోసాతో పైలట్ బిజెపిలోకి మారే ప్రయత్నాన్ని విరమించుకుని కాంగ్రెస్ లో కొనసాగారు. కొద్ది నెలల క్రితం ఏఐసీసీ అధ్యక్ష పదవికి కొత్త నేతను ఎన్నుకోవలసిన తరుణంలో సోనియా గాంధీ అశోక్ గెహ్లాట్ ను పార్టీ అధ్యక్ష పదవికి ప్రతిపాదించారు. గెహ్లాట్ ఏఐసీసీ అధ్యక్షుడు అయితే సచిన్ పైలట్ ను ముఖ్యమంత్రిని చేస్తారని  అనుకున్నారు. అయితే అశోక్ గెహ్లాట్ మళ్లీ మోకాలడ్డారు. సచిన్ పైలట్ ను సిఎంని చేయడానికి వీల్లేదని గెహ్లాట్ పట్టుబట్టారు. తాను సూచించిన నేతనే సిఎంని చేయాలన్నారు. ఇక అప్పటి నుంచీ గెహ్లాట్ పైలట్ మధ్య దూరం మరింత పెరిగింది. బాహాటంగా విమర్శించుకుంటూనే ఉన్నారు. ఇద్దరినీ కూర్చోబెట్టి పరిస్థితి చక్కదిద్దేందుకు నాయకత్వం చేసిందంటూ ఏదీ లేదు. ఇపుడు ఎన్నికల ఏడాది కావడంతో కంగారు పడుతున్నారు. కర్నాటక ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ కు ఇటువంటి సమస్యే ఉండింది. పిసిసి అధ్యక్షుడు డి.కె.శివకుమార్ మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల మద్య ఏళ్ల తరబడి వైరం ఉంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే ఎన్నికల సమయంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడంలో పార్టీ నాయకత్వం విజయవంతమైంది. ఆ కారణంగానే డికే, సిద్ధరామయ్యలు ఇద్దరూ కూడా కలిసి కట్టుగా పార్టీ విజయం కోసం పనిచేశారు. ఎన్నికలు అయ్యే వరకు తమ మధ్య ఉన్న  శత్రుత్వాన్ని మనసుల్లోనే దాచుకున్నారు. ఇపుడు రాజస్థాన్ లో కూడా ఇదే పని చేయాల్సి ఉంటుంది.

అయితే రాజస్థాన్ లో పార్టీ నాయకత్వం విజయవంతం అవుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల తర్వాత సచిన్ పైలట్ కు దక్కాల్సిన సిఎం పోస్టును  గెహ్లాట్ కు కట్టబెట్టిన హైకమాండ్ పైలట్ వర్గానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఆ మాటను నిలబెట్టుకోలేదు. రెండోసారి పైలట్ బిజెపిలోకి జంప్ చేద్దామనుకున్నప్పుడు వారించిన రాహుల్, ప్రియాంకలు అయ్యిందేదో అయిపోయింది ఇకపై నీకు అన్యాయం జరక్కుండా చూస్తామన్నారు. వారి మాటపై నమ్మకంతో పైలట్ కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. ఆ తర్వాత కూడా పైలట్ కు అన్యాయం కొనసాగుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో రేప ఎన్నికల ముందు ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడినా నాయకత్వం మాటలపై పైలట్ కు నమ్మకం కుదురుతుందా అన్నది ప్రశ్న. గాంధీలనూ నమ్మే పరిస్థితి లేదు, అశోక్ గెహ్లాట్ నూ నమ్మే వాతావరణం లేదు. ఇద్దరి మధ్య వార్ ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బిజెపి రాజస్తాన్ లో పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదే ఇపుడు పార్టీ నాయకత్వాన్ని కంగారు పెడుతోంది. గెహ్లాట్, పైలట్ ల మద్య దూరం తగ్గించడానికి సీనియర్ నేతకు బాధ్యతలు అప్పగించాలని హైకమాండ్ నిర్ణయించింది. ఎన్నికలు అయ్యే వరకు అయినా ఇద్దరూ కలిసి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డికే, సిద్ధరామయ్యలను స్ఫూర్తిగా తీసుకోవాలని అంటున్నారు. అంతా బానే ఉంది కానీ  తన వినాశనాన్ని కోరుకునే గెహ్లాట్ తో సయోధ్యకు పైలట్ ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నారు పైలట్ వర్గీయులు. పరిస్థితి మరింతగా దిగజారితే ఈ సారి ఎన్నికలకు ముందే సచిన్ పైలట్ బిజెపిలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

రాజస్ధాన్ ఎన్నికలతో పాటు మధ్యప్రదేశ్ లోనూ ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా ప్రచారం కారణంగానే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలో రాగలిగింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సింధియాను పక్కన పెట్టి సీనియార్టీ ముసుగులో కమలనాథ్ ను ముఖ్యమంత్రిని చేసింది పార్టీ నాయకత్వం. సిఎం అయిన కమలనాథ్ అదే పనిగా సింధియా వర్గాన్ని వేధించడం మొదలు పెట్టారు. చిర్రెత్తుకొచ్చిన సింధియా బిజెపితో డీల్ కుదుర్చుకున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బిజెపిలో చేరిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపారు. సాధించిన అధికారాన్ని చేజేతులారా చేజార్చుకున్న కాంగ్రెస్ అధికారాన్ని బిజెపికి బంగారు పళ్లెంలో పెట్టి సమర్పించుకున్నట్లు అయ్యింది.  వచ్చే ఎన్నికల్లో ఎంపీలో కాంగ్రెస్ గెలవాలంటే చాలా కష్టపడాలి. నిజానికి అక్కడ ఉన్న బిజెపి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది. అయితే సింధియా వంటి జనాకర్షక నేత మాత్రం కాంగ్రెస్ కు లేరు. అదే పెద్ద లోటు. దీన్ని ఎలా అధిగమిస్తారనేది చూడాలంటున్నారు రాజకీయ పండితులు. ఇక ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న మరో రాష్ట్రం తెలంగాణా. తెలంగాణా కాంగ్రెస్ లోనూ సీనియర్ల మధ్య విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. పిసిసి అధ్యక్షుణ్ని చాలా మంది సీనియర్లు ఖాతరు చేయరు. ఎన్నికలు అయ్యే వరకు అయినా పార్టీలోని అన్ని గ్రూపులూ కలిసి ఐక్యంగా ఉంటేకానీ విజయం సాధించడం సాధ్యం కాదు. అధికారంలోకి వచ్చేంత వరకు డికే సిద్ధరామయ్య జోడీ లా అందరూ ఒక్కతాటిపై ఉండాలని పార్టీ నేతలకు హై కమాండ్ సంకేతాలు పంపింది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ పార్టీ గెలవాలంటే పార్టీలో ఐక్యత సాధించాల్సి ఉంటుంది.