విపక్షాలకు కోలుకోలేని షాకిచ్చిన మరాఠా యోధుడు

By KTV Telugu On 10 April, 2023
image

విపక్షాలకు కోలుకోలేని షాక్ ఇచ్చారు మరాఠా రాజకీయ యోధుడు శరద్ పవార్. ఊరికే ఆదానీ పై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ తో సహా విపక్షాలకు శరద్ పవార్  క్లాస్ తీసుకున్నారు. శరద్ పవార్ హఠాత్తుగా ఇలా టోన్ మార్చేసరికి   విపక్షాలు బిక్క మొగం వేశాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సైతం ఏం చేయాలో తోచక బుర్ర గోక్కుంటున్నారు.
దేశంలో అంబానీ తర్వాత అంతటి కార్పొరేట్ దిగ్గజం ఆదానీ పై కొంత కాలంగా దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసింది. అమెరికాకి చెందిన హిండెన్ బర్గ్ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఆదానీ వ్యాపారాలన్నీ తప్పుల తడకలే అని ఆరోపించింది. దీంతో ఒక్క సారిగా ఆదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనం మొదలైంది. మదుపర్లను ఆదుకోడానికి ఆదానీ కూడా కొన్ని చర్యలు చేపట్టాల్సి వచ్చింది. ఆదానీ అక్రమాలకు అండగా ఉన్నది ప్రధాని నరేంద్ర మోదీయేనని విపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి. ఆదానీ అత్యంత వేగంగా కోట్లకు పడగలెత్తడానికి మోదీయే కారణమని కాంగ్రెస్ ధ్వజమెత్తుతూ వచ్చింది. మొత్తానికి ఆదానీ వ్యవహారంలో విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి.
తానేమీ తప్పు చేయలేదని ఆదానీ అంటున్నారు. ఆదానీ తప్పు చేయలేదని ప్రభుత్వం అంటోంది. బిజెపి దాని అనుబంధ సంస్థలయితే భారత దేశానికి చెందిన ఆదానీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే విదేశానికి చెందిన హిండెన్ బర్గ్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. హిండెన్ బర్గ్ కుట్రకు  మన విపక్షాలు అండగా నిలవడం దేశ ద్రోహమే అని బిజెపి నేతలు దుయ్యబడుతున్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే ఆదానీకి చెందిన డొల్ల కంపెనీల్లో 20 వేల కోట్ల పెట్టుబడులు ఎవరివో చెప్పాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని సవాల్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఉద్దేశంతో పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడే అవకాశం కోరారు. స్పీకర్ ఇవ్వలేదు. ఇటీవలం లండన్ లో రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ నేను ఒక ఎంపీని. కానీ మా దేశం పార్లమెంటులో నాకు మాట్లాడే అవకాశం దక్కదు. మా దేశంలో ప్రజాస్వామ్యం పరిస్థితి అలా ఉందని అన్నారు. దానిపై బిజెపి రాద్ధాంతం చేసింది. కానీ లండన్ నుంచి వచ్చిన రాహుల్ పార్లమెంటులో ఆదానీ వ్యవహారం గురించి మాట్లాడాలనుకుంటే అవకాశం దక్కలేదు. రాహుల్ గాంధీ  లేవనెత్తిన ఆదానీ వ్యవహారంపై విపక్షాలు  పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రచ్చ రచ్చ చేశాయి. దీనికి సమాధానం చెప్పలేక ప్రభుత్వం కూడా మౌనంగా ఉండిపోయింద. ఈ లోపునే సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాల అనంతరం విపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఆదానీ వ్యవహారంపై మోదీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని రాహుల్ గాంధీ భావించారు. దాంతో పాటే 2024 ఎన్నికలకీ సమాయత్తం కావాలనుకున్నారు. భావసారూప్యత కలిగిన పార్టీలకు సమావేశం గురించి సమాచారం అందించారు కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే. సమావేశం ఎప్పుడు నిర్వహించాలి ఎక్కడ నిర్వహించాలి అన్నది త్వరలోనే చెబుతామని అన్నారు.

విపక్షాలు ఆదానీ వ్యవహారంపై కత్తులు నూరుకుంటోన్న సమయంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ బాంబు పేల్చారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి ఊరికే ఆదానీ అంబానీల వెంటపడ్డం మంచిది కాదని పవార్ సలహా ఇచ్చారట. అంతే కాదు రాజకీయాల ప్రయోజనాల కోసం కార్పొరేట్ దిగ్గజాలపై మాటల దాడితో ఇబ్బంది పెట్టాలనుకోవడం న్యాయం కాదని క్లాసు తీసుకున్నట్లు అన్నారట. రాహుల్ గాంధీతో పాటు ఇతర విపక్షాలకూ ఇదే విషయం చెప్పారట పవార్. పవార్ వ్యాఖ్యలతో విపక్షాలు ఒక్కసారిగా షాక్ తిన్నాయి. ఇదేంటి పవార్ సార్ ఇలా స్వరం మార్చేశారు అని విపక్ష నేతలు తలలు పట్టుకున్నారు. పవార్ కు మిత్ర పక్షంగా ఉన్న శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ అయితే  తమ మద్దతు విపక్షాలకే అని స్పష్టం చేశారు. అంటే పవార్ వైపు తాను ఉండబోనని చెప్పారు.
ఆదానీ అక్రమాల నిగ్గు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పవార్ వ్యాఖ్యల నేపథ్యంలో జేపీసీ అడగడంలో అర్ధం లేదని బిజెపి నేతలు విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదానీ వ్యవహారంపై జేపీసీ విచారణ డిమాండ్‌తో మలిదశ బడ్జెట్ సమావేశాలను స్థంభింపజేశాయి విపక్షాలు. పార్లమెంట్ లోపల వెలుపల నిరసన గళం వినిపించాయి. అయితే అదానీ అంబానీలపై విమర్శలు తగదంటూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు విపక్ష కూటమికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. పవార్ స్వరం మార్పు వెనుక అసలు కారణం ఏంటనే చర్చ మొదలైంది. అంతేకాదు త్వరలో విపక్షాల సమావేశం ఏర్పాటుచేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఇప్పుడు పునఆలోచనలో పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో 2024లో మోదీ వర్సెస్ ఎవరు అనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది.