మార్చిలోనే మండిపోయింది ఏప్రిల్‌లో పై ప్రాణం పైనేపోతోంది. ఇక మేలో ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమన్నట్లే ఉంది. ఎండలు అదిరిపోతున్నాయి. నీడపట్టున సెంట్రల్ ఏసీల్లో కూర్చునేవారికి ఇబ్బందిలేదుగానీ రోడ్డెక్కితేగానీ పూటగడవనివారి పరిస్థితి దారుణంగా ఉంది. సాధారణంగా ఎప్పుడో ఏప్రిల్ చివర్లో మేలో రావాల్సిన నిప్పుల ఉప్పెన ఇప్పుడే విరుచుకుపడింది. అగ్నివర్షాన్ని తలపిస్తున్న భానుడి ప్రతాపంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అప్పుడే కొన్నిచోట్ల 42 డిగ్రీలుదాటాయి ఉష్ణోగ్రతలు. వచ్చే నాలుగైదురోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలదాకా పెరుగుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతం పశ్చిమ హిమాలయ ప్రాంతం మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయంటోంది ఐఎండీ. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో ఎండలు మలమలా మాడ్చేయబోతున్నాయని హెచ్చరించింది.
తెలంగాణ రాష్ట్రంలోని 15 జిల్లాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతున్నాయి. గరిష్టంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్‌లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది నమోదవుతున్నాయి. ఈక్రమంలోనే మరో మూడు రోజుల పాటు ఎండలు మండనున్నాయి. 23 జిల్లాలకు వాతావరణశాఖ అరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేశారు. అన్ని జిల్లాల్లో సగటున 38-44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనావేస్తోంది. ఆదిలాబాద్ జిల్లా చాప్రాల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుల్లో అత్యధికంగా 43.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అప్పుడే వడదెబ్బ మరణాలు మొదలయ్యాయి. ఎండ వేడితో తెలంగాణలో చాలాచోట్ల కూలీలు దొరక్క వరి కోతలు నిలిచిపోయాయి. ఏపీలోనూ ఎండలు అదరగొట్టేస్తున్నాయి. మరోవైపు ఈ ఏడాది వర్షాకాలం రైతుకు అంతగా ఆనందం ఇవ్వకపోవచ్చని స్కైమెట్ వాతావరణసంస్థ చెబుతోంది. ఈ సంస్థ అంచనాల ప్రకారం వచ్చే వానాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు దేశంలో కొన్ని ప్రాంతాల్లో కరవు తాండవించే పరిస్థితులు కూడా ఉండొచ్చంటున్నారు. 20శాతం కరవు తప్పకపోవచ్చని స్కైమెట్ అంచనా వేస్తోంది.