రాజకీయాలకు సోనియాగాంధీ గుడ్ బై?

By KTV Telugu On 25 February, 2023
image

కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా. చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్‌లోని జరుగుతోన్న పార్టీ 85వ ప్లీనరీలో ప్రసంగించిన సోనియా ఇక తాను పాలిటిక్స్‌ నుంచి వైదొలుగనున్నట్లు పరోక్షంగా ప్రస్తావించారు. భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ పూర్తికానుండటం సంతోషంగా ఉందని ఆమె వ్యాఖ్యానించడంపై జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అనారోగ్య సమస్యలున్నా పార్టీని నడిపించే సరైన నాయకుడు లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఆమె పార్టీకి పెద్దగా దిక్కుగా ఉండి గాడిన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకే కాదు రాహుల్‌కు మైలేజ్ తీసుకొచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తోన్నాయి. సోనియాగాంధీ కూడా రాహుల్ రాజకీయంగా మరింతగా రాటుదేలినట్లుగానే భావిస్తున్నారు. ఇప్పటికే ఖర్గేకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. ఇక ఇప్పుడు రాహుల్ కూడా లైన్‌లోకి రావడంతో క్రీయాశీల రాజకీయాల నుంచి సోనియా తప్పుకోవాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు.

ఎంతో ఘన చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని రెండు దశాబ్దాలపాటు ముందుండి నడిపించారు సోనియాగాంధీ. సోనియాగాంధీ సారథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ యూపీఏ కూటమిని ఏర్పాటు చేసింది. 2004, 2009లో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో సోనియాగాంధీ తనదైన శైలిలో వ్యవహరించారు. ప్రధానిగా మన్మోహన్‌ను ముందుపెట్టి రెండుసార్లు యూపీఏ ప్రభుత్వాన్ని వెనకుండి నడిపించారు. ఇతర పార్టీలను కలుపుకొని యూపీఏ సర్కారును సమర్థవంతంగా పదేళ్లపాటు పాలించేలా వ్యూహ రచన చేసిన ఘనత కూడా సోనియాకు దక్కుతుంది. కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో తరుచుగా ముఖ్యమంత్రులను మార్చే పద్ధతికి స్వస్తి పలికి వారికి స్వేచ్ఛగా పాలన చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఖర్గే సారథ్యంలో పార్టీని ముందుకు తీసుకెళ్లే పనిలో ఉన్నారు. జోడోయాత్ర పార్టీకి టర్నింగ్ పాయింట్‌గా మారిందన్న సోనియా గాంధీ ఖర్గే నాయకత్వంలో పార్టీ వచ్చే ఎన్నికలను ఎదుర్కోబోతోందని శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

రాబోయే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చావోరేవోగా మారాయి. ఈ పరిస్థితుల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. రాహుల్ జోడోయాత్ర సమయంలోనే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయి. గుజరాత్‌లో ఘోర పరాభవం ఎదురైనా హిమాచల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అవసరమైన చోట సొంతంగా పోటీ చేస్తూనే పలు చోట్ల పొత్తులతో వెళ్తోంది. ప్రస్తుతం త్రిపురలో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీని గద్దె దించడానికి కామ్రేడ్స్‌తో చేతులు కలిపింది. ఈ ఏడాదిలోనే మరో 8 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇవి కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమనే చెప్పాలి. ఈ క్రమంలోనే పార్టీ యావద్దేశానికి కూడా ఇది సవాలు వంటి సమయమని సోనియాగాంధీ తన శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి వ్యవస్థనూ బీజేపీ-ఆర్ఎస్ఎస్ తమ అధీనంలోకి తీసుకుని చిన్నాభిన్నం చేస్తోందని ఆరోపించారు. కొద్దిమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం దేశ ఆర్థిక పతనానికి కారణమవుతోందని అన్నారామె. కాంగ్రెస్ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని అన్ని మతాలు కులాలు జెండర్ ప్రజల వాణిని ప్రతిబింబిస్తుందని అందరి కలలను సాకారం చేస్తుందని అన్నారు.