ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు – అనేక సందేహాలు

By KTV Telugu On 14 September, 2023
image

KTV TELUGU :-

దేశంలో ఇప్పుడు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలపై వాడీవేడీ చర్చ జరుగుతోంది. కేంద్రం పలానా ప్రయత్నం చేయబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్రం అజెండా ఇంకా ప్రకటించలేదు. ప్రకటించినా… అవే అంశాలు ఉంటాయని.. ఉండాలనే రూలేం లేదు. పెట్టాలనుకున్న బిల్లుల్ని చివరి క్షణంలో పెట్టవచ్చు. అయితే అసలు కేంద్రం ఏం చేయబోతోందన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది.. జమిలీ ఎన్నికలు ఉండనే ఉండవని ఓ కేంద్ర మంత్రి ప్రకటిస్తారు. కానీ కమిటీల పనులు జరుగుతున్నాయి. భారత్ అనే పేరు ఇప్పటికే రాజ్యాంగంలో ఉందంటారు. కానీ పేరు మార్పు బిల్లు పెడతారనే ప్రచారం ఊపందుకుంటోంది. మహిళా రిజర్వేషన్లు వంటి బిల్లులు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇంతకూ అసలు కేంద్రం ఉద్దేశం ఏమిటి ?

దేశంలో పార్లమెంట్‌ అత్యవసర ప్రత్యేక సమావేశాలు ఈనెల 18 నుండి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు నిర్వహించ బోతున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రకటించారు. ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో! మాత్రం తెలుపలేదు. ఈ ప్రత్యేక సమావేశాల అజెండా ఏది ప్రకటించలేదు. ఈ ప్రకటనతో మీడియా, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా, రాజకీయ పార్టీలు ఎవరికి తోచిన విధంగా వారి ఊహాగానాలు, కథనాలు ప్రచారం చేసేస్తున్నారు. కేంద్రం కూడా ఇదే కోరుకుంటుందన్నట్లుగా ఉంది. అందుకే లీకులిస్తోంది కానీ.. ఎజెండా మాత్రం సెట్ చేయడం లేదు.

పార్లమెంట్‌ ప్రత్యేక సమా వేశాల్లో కేంద్ర ప్రభుత్వం మన దేశానికి ఇండియాకు బదులుగా భారత్‌గా పేరును మారుస్తూ తీర్మానం చేయబోతుందని కొత్తగా హైలెట్ చేశారు. జీ-20 సమావేశాల్లో “భారత్‌” అనే పేరే ఎక్కువగా వినిపించింది. దీనితో ఈ వాదనకు బలం చేకూరుతుంది. వాస్తవంగా రాజ్యాంగంలో.. సాధారణ ప్రజల భాషలో భారతదేశాన్ని భారత్‌, ఇండియాగా పిలుచుకుంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1లో ”ఇండియా, దట్‌ ఈజ్‌ భారత్‌, షెల్‌ బీ ఏ యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌” అని ఉంది. ఆర్టికల్‌ 52లో రాష్ట్రపతిని ”ద ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా” అని పేర్కొన్నారు. కానీ పైన చెప్పినట్లు ఇప్పుడు ”ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌”గా వాడడంతో ఇండియా స్థానంలో భారత్‌ పేరును మార్చ డానికి సిద్ధమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది.

రాజ్యాంగంలోనే రెండు పేర్లు ఉండగా ఎందుకింత హడావిడి చేస్తున్నారు. ప్రజానీకానికి అర్థమవుతోందో లేదో గానీ ఈ మధ్య జరిగిన ప్రతిపక్ష పార్టీలన్నీ సమావేశమై వారు ”ఇండియా” పేరుతో కూటమిగా ఏర్పడ్డారు. ఇలా తమ వ్యతిరేక కూటమిని ఇండియా అని పిలవడం బీజేపీకి నచ్చలేదని అర్థం చేసుకోవచ్చు. కేంద్రంలో గాని, రాష్ట్రాల్లో గాని అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసమో, అధినాయకుల ప్రతిష్టల కోసమో ప్రభుత్వ పథకాల పేర్లు, ప్రభుత్వ సంస్థల పేర్లు, నగరాల పేర్లు, పట్టణాల పేర్లు, కూడళ్ల పేర్లు మార్చాలనుకుంటున్నారు. ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల దృష్ట్యా ఈ పేరు మార్పిడి హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. ఈ మార్పు వలన దేశానికి ఏమైనా లాభమా అనేది పెద్దగా చర్చకు రావడంలేదు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం చాన్నాళ్లుగా… ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో దేశంలో నిర్వహించ తలపెట్టిన జమిలి ఎన్నికల పైన చర్చించేందుకు ఈ పార్లమెంటు సమావేశాలను జరపతలపెట్టినట్లు ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు అనుమానిస్తున్నాయి. మరికొందరేమో ఉమ్మడి పౌరస్మృతి పై చర్చించడానికి అంటున్నారు. కాదు.., కాదు? చట్టసభలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ”మహిళా బిల్లుకు” ఇన్నాళ్ల నిర్లక్ష్యం వీడి చట్టం చేయడానికని ఊహిస్తున్నారు. ”జమిలి ఎన్నికలు” ఒకే దేశం ఒకే ఎన్నికల నిర్వహణ సాధ్యా సాధ్యాలపై పరిశీలనకు కమిటీ చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో పాటు సభ్యులుగా ఎనిమిది మందిని ఎంపిక చేశారు. ఈ కమిటీ ముందు ఏడు విధి విధానాలను ఉంచారు. నివేదిక సమర్పణకు గడువు లేదు. ఈ కమిటీ నివేదిక వస్తేనే పార్లమెంట్ లో చట్టం చేయగలరు.
అసలు పార్లమెంట్ సమావేశాల ఎజెండాను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటి ? ప్రజలకు తెలుసుకునే హక్కు లేదా ?

జమిలీ ఎన్నికల కోసం వేసిన కమిటీలో దక్షిణాదికి ప్రాతినిధ్యం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో జమిలి ఎన్నికలకు ఏకాభిప్రాయం సాధ్యం కాదనే వాదన వినబడుతుంది. జమిలిపై ఇంత హడావిడి చేయడం.. సమావేశాలకు ఎజెండా లేకుండా సస్పెన్స్‌లో పెట్టి దేశ ప్రజలలో, రాజకీయ పార్టీలలో చర్చకు తెరతీయడం వ్యూహాత్మకంగానే భావిస్తున్నారు. ఇటీవల పార్లమెంట్ వర్షా కాల సమావేశాల్లో మణిపూర్‌ మంటలతో వృధా అయ్యాయి.

సమావేశపరిచే ఉద్దేశాన్ని రహస్యంగా ఉంచుతూ, మరోవైపు బయటకు లీకులు చేయడం భావ్యమా! ప్రభుత్వ ఉద్దేశం ఏదైనప్పటికీ పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు ఉన్న నిబంధనలకు నీళ్లు చల్లుతున్నారు. ఈ ప్రక్రియను రాష్ట్రపతి చేయాల్సి ఉంది. కానీ దానికి భిన్నంగా ప్రభుత్వమే ప్రకటన చేసింది.
గతంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణలు చేశారు. దేశంలో అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న 19 నెలల కాలంలో ఎక్కువగా జరిగాయి. ఇప్పుడు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను ఎందుకు నిర్వహిస్తున్నదో ప్రభుత్వం ప్రకటించి ఉంటే, సభ్యులు ఆయా అంశాలపై ముందుగానే అవగాహనకు వచ్చే అవకాశం ఉండేది. తద్వారా సభలో అర్థవంతమైన చర్చకు వీలు కలిగేది. కానీ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేనట్లు, దాటవేసే ధోరణి కనిపిస్తుందని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.

దేశ ప్రజస్వామ్యంలో ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. డబ్బుతో ఓట్లు కొనే సంస్కృతి, పార్టీ ఫిరాయింపులు, క్రిమినల్స్ అధికారాలు చేపట్టడం వంటివి సవాళ్లుగా మారాయి. ఎన్నికల రోజున ఏరులై పారే నల్లధనాన్ని అరికట్టేందుకు ముందుకురావాలి. ఇవేవీ సరిచేయకుండా జమిలి ఎన్నికలను ఎత్తుకోవడం అంటే? దేశంలోని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేసినట్లే అవుతుందని ఎక్కువ మంది వాదన. ప్రభుత్వం ఏం చేసినా ప్రజల్లో చర్చ పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే ప్రజాగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది.

ప్రజాస్వామ్యం అనేది పార్లమెంట్ మీద ఆధారపడి ఉంది. పార్లమెంటరీ వ్యవస్థపై ప్రజలకు ఎంత విశ్వాసం ఉంటే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది. అలా నమ్మకం కలిగించాల్సింది ఆ వ్యవస్థలోని రాజకీయ పార్టీలే.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి