ఇండో చైనా కాదు.. మన మధ్యలోనే బార్డర్‌ ఫైటింగ్స్‌!

By KTV Telugu On 27 December, 2022
image

చైనాతో సరిహద్దు సమస్య ఆరనిమంటలా రగులుతూనే ఉంది. తరచూ డ్రాగన్‌ కంట్రీ వాస్తవాధీన రేఖ దాటుతోంది. మన దేశంలోని భూభాగం తనదేనంటోంది. దశాబ్ధాలుగా దేశ సరిహద్దు పరిష్కారం లేని సమస్యగానే ఉంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ విషయంలోనూ తరచూ మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఇరుగుపొరుగు దేశాలతో కీచులాటలు ఉంటే సహజమనుకోవచ్చు. కానీ మనకు మనమే కొట్టుకుంటుంటే పరిష్కారం ఎందుకు దొరకడం లేదు. రాష్ట్రాల మధ్య దశాబ్ధాల సరిహద్దుల గొడవలపై కేంద్రం ఎందుకు దృష్టిపెట్టటం లేదు. ప్రజల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నా ఎందుకు చోద్యం చూస్తున్నట్లు?

ఈశాన్య రాష్ట్రాల్లో సమస్యలున్నాయి. ఆంధ్రా-ఒడిశా మధ్య కూడా ఇలాంటి గొడవే ఉంది. ఇక మహారాష్ట్ర-కర్నాటక మధ్య తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానవుతోంది. కర్నాటక, మహారాష్ట్రలో బెళగావి విషయంలో భావోద్వేగాలు పెరుగుతున్నాయి. అంగుళం భూభాగాన్ని వదులుకునేందుకు కూడా రెండు రాష్ట్రాలు సిద్ధంగా లేవు. మరాఠీ మాట్లాడే జనాభా ఎక్కువగా ఉన్న బెళగావి తమకే చెందాలనేది మహారాష్ట్ర వాదన. కర్నాటకలోని ఐదు జిల్లాల్లోని 865 గ్రామాలు తమకు చెందాలంటోంది మహారాష్ట్ర. ప్రాంతీయవాదం ఎక్కువగా ఉండే మహారాష్ట్ర అన్ని పార్టీలు ఇదేమాటమీదున్నాయి.

మహారాష్ట్ర-కర్నాటక వివాదం దశాబ్ధాలపాటు న్యాయస్థానాల్లో నడిచింది. కమిటీలు నివేదికలెన్నో వచ్చినా సమస్య మాత్రం రావణకాష్టంలాగే ఉంది. తాజాగా కర్నాటక రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల సరిహద్దులు నిర్ణయించే అధికారం సుప్రీంకోర్టుకు లేదని వాదిస్తోంది. మరో వైపు సెంటిమెంట్‌ని అనుకూలంగా మార్చుకునేందుకు బెల్గాం పేరును బెళగావిగా మార్చి రెండో రాజధానిగా కర్నాటక ప్రకటించింది. 2006 నుంచి బెళగావిలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహిస్తోంది. బెంగళూరు విధానసౌధ తరహాలో బెళగావిలో భారీ భవనాలు నిర్మిస్తోంది.
అనుకూలంగా ఉంటే కమిషన్‌ సిఫార్సులను సమర్ధిస్తారు. తమ అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉంటే విభేదిస్తారు. మహాజన్‌ కమిషన్‌ సిఫార్సులను మహారాష్ట్ర తిరస్కరించింది. కర్నాటకలోని మరాఠీ మాట్లాడే గ్రామాలను తమకు కేటాయించాలని కోరుతూ 2004లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాదాపు 18 ఏళ్లుగా ఈ పిటిషన్‌ విచారణకు స్వీకరించవచ్చా లేదా అనేదానిపైనే వాదనలు సాగుతున్నాయి. ఎన్నికల సమయంలో ప్రాంతీయ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దు వివాదాన్ని అస్త్రంగా వాడుకుంటున్నాయనేది వాస్తవం.