కామ్రేడ్ల వైభవం తెరమరుగు అయిపోయిందా

By KTV Telugu On 10 February, 2023
image

దేశంలో కమ్యూనిస్టు పార్టీల పని అయిపోయినట్లేనా ఎర్రజెండాకు దశాబ్ధాల పాటు కంచుకోటగా వెలిగిని పశ్చిమ బెంగాల్ లో కామ్రేడ్ల అడ్రస్ గల్లంతయ్యింది. త్రిపురలో హఠాత్తుగా అధికారాన్ని కమలనాథుల చేతుల్లో పెట్టేసి మాయమయ్యారు. ఒక్క కేరళ మినహా దేశంలో ఏ రాష్ట్రంలోనూ చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు లేకుండా చతికిల పడిపోయాయి. కామ్రేడ్ల పతనానికి కారణాలేంటి. స్వతంత్రం వచ్చిన కొత్తలో దేశంలో కమ్యూనిస్టులు చెప్పుకోదగ్గ స్థాయిలోనే బలంగా ఉన్నారు. అధికారంలోకి రాలేకపోయినా రాజకీయాలు శాసించే స్థాయిలోనే ఉండేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడంలోనూ ఉద్యమాలు నిర్మించి ప్రభుత్వాల మెడలు వంచడంలోనూ కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారు. ఎర్రజెండా నీడలో కామ్రేడ్లు చేసిన పోరాటాలకు ఘన చరిత్రే ఉంది.

1964లో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలింది. సిపిఐ- సిపిఎం లుగా విడిపోయింది. ఇక ఆ తర్వాత ఎన్నో చీలికలు పేలికలు అయ్యింది. 1967లో పశ్చిమ బెంగాల్ లోని నక్సల్ బరీ గ్రామంలో రైతుల అణచివేతకు నిరసనగా కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేశారు. అదే మొట్టమొదటి హింసాయుత ఉద్యమం. చారు మజుందార్ నాయకత్వంలో ఆ ఉద్యమం నడిచింది. అదే నక్సల్ బరీ ఉద్యమం అయ్యింది. అక్కడ రాజుకున్న అగ్గిరవ్వ ఆంధ్ర ప్రదేశ్ లోని సిక్కోలు పై పడింది. అలా నక్సలైట్ ఉద్యమం ఉత్తరాంధ్రలో ఎంట్రీ ఇచ్చింది. ఉత్తరాంధ్ర నుండి తెలంగాణాకు విస్తరించిన ఈ ఉద్యమం మావోయిస్టు పార్టీ ఆవిష్కారానికి దారి తీసింది. సాయుధ పోరాటంలోనూ భిన్న పార్టీలు అవతరించాయి.

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల రాజకీయాల్లో ఉండాలని భావించిన సిపిఐ సిపిఎంలు రాజకీయ పార్టీలుగా కొనసాగాయి. సాయుధ పోరాటమే అజెండాగా చేసుఉన్న మావోయిస్టు పార్టీ అజ్ఞాతంలో ఉంటూ పోరాటాలు చేస్తోంది.
1977 లో పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ ప్రభుత్వాల శకానికి తెరపడింది. మొదటిసారి సిపిఎం నాయకత్వంలోని వామపక్ష పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుండి 2011 వరకు ఏకధాటిగా 34 సంవత్సరాల పాటు కామ్రేడ్లే బెంగాల్ ను ఏలారు. అయితే సుదీర్ఘ పాలనా క్రమంలో తాము చెప్పే బూర్జువా పార్టీల అవలక్షణాలన్నింటినీ అందిపుచ్చుకున్నారు కమ్యూనిస్టులు. ఆర్ధిక సంస్కరణలను గట్టిగా వ్యతిరేకించే కమ్యూనిస్టులు బెంగాల్ లో దానికి విరుద్ధంగా కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ రైతుల ఉసురు పోసుకున్నారు. ఎప్పుడూ బాధిత రైతుల పక్షాన పోరాటాలు చేసే కామ్రేడ్లే ఈ సారి రైతులను వేధించారు. దాంతో ఏం చేయాలో పాలుపోక రైతులు బిక్క చచ్చిపోయారు.

అప్పుడే కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ రైతుల తరపున పోరాడి కామ్రేడ్లకు చుక్కలు చూపించింది. తన పోరాటానికి కాంగ్రెస్ నాయకత్వం అండగా లేకపోవడంతో పార్టీ వీడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించింది. పట్టుదలగా పోరాటాలు చేసి కమ్యూనిస్టుల పాలనకు చరమగీతం పాడి 2011లో ముఖ్య మంత్రి అయ్యారు. ఈ ఎన్నికల్లో పరాజయం పాలైన కామ్రేడ్లు తర్వాతి అయిదేళ్లలో ఏమీ మారలేదు. దాంతో ప్రజలు కూడా మారకుండా 2016 ఎన్నికల్లోనూ మమతా బెనర్జీకే పట్టం కట్టారు. కమ్యూనిస్టుల మనుగడ ప్రమాదంలో పడిపోయింది. మరో అయిదేళ్ల తర్వాత 2021 ఎన్నికల్లో కామ్రేడ్ల పతనం పరిపూర్ణం అయ్యింది. బెంగాల్ తో పాటు త్రిపురలోనూ కమ్యూనిస్టు పార్టీకి పట్టు ఉండేది. అయితే అక్కడా కామ్రేడ్లను తరిమేసి కమలనాథులు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇక మిగిలింది కేరళ. ఇక్కడ ఓ సారి యూడీఎఫ్ మరో సారి ఎల్ డి ఎఫ్ కూటములకు అధికారం అప్పగిస్తున్నారు ప్రజలు. గత ఎన్నికల్లో మాత్రం కామ్రేడ్లనే రెండో సారి గెలిపించారు కేరళ ఓటర్లు.

ఇక 1952 ప్రాంతంలో తెలుగు నేలపై బలంగానే ఉన్నారు కమ్యూనిస్టులు. అయితే రాను రాను బలహీన పడుతు వచ్చారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం కామ్రేడ్లకు ఉండింది. అయితే దాన్ని కమ్యూనిస్టులు సద్వినియోగం చేసుకోలేకపోయారు. అందుకే ఆ తర్వాత 1983లో తెలుగుదేశం పార్టీ అవతరించడంతోనే కాంగ్రెస్ ను అధికారం నుండి తన్నేసి అధికారంలోకి వచ్చింది. కమ్యూనిస్టులు టిడిపితో కొన్ని సీట్లకోసం పొత్తులకు పరిమితం అయ్యారు. ఇక అప్పటినుండీ సీట్లు ఓట్లకోసం తాము తిట్టిపోసిన పార్టీలతోనే పొత్తులు పెట్టుకుంటూ వచ్చారు కమ్యూనిస్టులు. దాంతో ప్రజల్లో వారి ప్రాబల్యం బాగా తగ్గింది.
ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత కమ్యూనిస్టు పార్టీలు పూర్తిగా పాపర్ అయిపోయాయి.

ఏపీలో అయితే విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు డిపాజిట్లు కోల్పోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తుడిచిపెట్టుకుపోయారు. ఏదో ఒక పార్టీకి తోక పార్టీలుగా కొనసాగుతూ వచ్చి ఎవ్వరికీ అక్కర్లేని పార్టీలుగా మిగిలారు. చివరకు ఇలా మిగిలాం అని చలసాని ప్రసాద్ రాసిన పుస్తకం కమ్యూనిస్టుల స్థితికి అద్దం పడుతోంది.
దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కమ్యూనిస్టులు నెమ్మది నెమ్మదిగా బలహీన పడుతూ వచ్చారు. ఇపుడు ఏ రాష్ట్రంలోనూ చెప్పుకోదగ్గ బలం లేదు. అభిమానులు లేరు. విజయాలు లేవు. కత్తీ కొడవలి సుత్తీ కొడవలి తప్ప వెన్నంటి జనం లేరు. వామపక్ష భావాలను అభిమానించే మేథావులు ఈ పరిస్థితిని తలచుకుని ఆందోళన చెందుతున్నారు. ఈ దుస్థితికి లెఫ్ట్ పార్టీల అగ్రనాయకత్వాల స్వయంకృతాపరాధమే కారణమని చెప్పక తప్పదంటున్నారు రాజకీయ పండితులు.
ఇక దరిదాపుల్లో మళ్లీ బెంగాల్, త్రిపుర లో కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం మాట కార్ల్ మార్క్స్ ఎరుగు గౌరవ ప్రదమైన స్థానాలైన గెలుస్తారన్న గ్యారంటీ లేదంటున్నారు రాజకీయ పండితులు.