కర్నాటకలో కొత్త రాజకీయానికి తెరలేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ సమీరణాలు మారుతున్నాయి. అవినీతి ఆరోపణలు పెరగడం మళ్లీ అధికారం అనుమానమే అన్నట్లు ఉండటంతో బీజేపీ గెలుపు గుర్రాల వేటలో పడింది. ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించి వేరే పార్టీల్లోని నేతలను ఆహ్వానిస్తోంది. రెబల్ స్టార్ అంబరీష్ భార్య, మాండ్య ఎంపీ సుమలత బీజేపీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో సుమలత అంబరీష్ మాండ్య నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి భారీ మెజార్టీతో గెలిచారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతోనూ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంతోనూ ఆమె సన్నిహితంగా ఉంటున్నారు. సుమలతకు కాంగ్రెస్ నుంచి కూడా ఆహ్వానం ఉన్నా ఆమె బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నారని సమాచారం. ప్రధాని పర్యటన సన్నాహాలకోసం బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో సుమలత పాల్గొనడం ఊహాగానాలను బలపరుస్తోంది.
సుమలతకు కాషాయ కండువాతో స్వాగతం పలికారు బీజేపీ నేతలు. కమలం పెద్దలతో కూడా సుమలత అంబరీష్ టచ్‌లో ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి ఓ ప్రముఖ బీజేపీ నేతను కలిశారు. గతంలో అంబరీష్ కేంద్ర మంత్రిగా మాండ్య ఎమ్మెల్యేగా కర్ణాటక మంత్రిగా పని చేశారు. ప్రతి ఎన్నికల్లో అంబరీష్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఆయన మరణం తర్వాత సుమలత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గత ఎన్నికల్లో నిఖిల్ కుమారస్వామికి చుక్కలు చూపించిన సుమలత అంబరీష్ పరోక్షంగా కాంగ్రెస్ ప్రత్యక్షంగా బీజేపీ నాయకుల మద్దతు తీసుకుని ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఏ హామీతో సుమలత బీజేపీలో చేరుతున్నారన్న చర్చ జరుగుతోంది. సుమలత నటిగా తెలుగువారందరికీ సుపరిచితురాలు. చెన్నైలో పుట్టిన సుమలత ఆంధ్రప్రదేశ్ ముంబైలో పెరిగారు. ఆంధ్రప్రదేశ్ అందాల పోటీలో గెలిచిన తరువాత 15 ఏళ్ళ వయసులోనే నటించడం ప్రారంభించారు. తెలుగు, మళయాళం, కన్నడ, తమిళ్, హిందీ భాషలలో 220 కి పైగా చిత్రాలలో నటించారు. 1991లో కన్నడహీరో అంబరీష్‌ని ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన సుమలత కొంత కాలానికే పాలిటిక్స్‌ని బాగా ఒంటబట్టించుకున్నట్లున్నారు.