వాక్ స్వాతంత్య్రం అంటే భావప్రకటన స్వేచ్ఛ. ఇదే మాట్లాడాలి ఇలాగే మాట్లాడాలని ఎవరూ కట్టడిచేయకూడదు. కొన్ని పరిమితులకు లోబడి ఎవరు ఏదన్నా మాట్లాడొచ్చు. ఆ హక్కు భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానమేనని సుప్రీం స్పష్టంచేసింది. ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులకు కూడా సామాన్య ప్రజలతో సమానంగా వాక్ స్వాతంత్ర హక్కు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
సామూహిక అత్యాచార బాధితులపై యూపీ సమాజ్‌వాదీ పార్టీ నేత అజం ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలన్న పిటిషన్ నేపథ్యంలో సుప్రీం ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చట్టసభల సభ్యుల కోసం ప్రవర్తన నియమావళి అవసరమన్న డిఫెన్స్ న్యాయవాది వాదనతో సుప్రీం ఏకీభవించలేదు. ప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్య్రంపై ఆంక్షలు రాజ్యాంగానికి అతీతంగా ఉండకూడదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆంక్షలు అందరికీ సమానంగా వర్తిస్తాయని స్పష్టంచేసింది. ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు తమపై స్వీయ ఆంక్షలు విధించుకోవాలని రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వాక్ స్వాతంత్య్ర హక్కుపై అదనపు ఆంక్షలను తీసుకురావలసిన బాధ్యత పార్లమెంటుదేనని తనతీర్పులో జస్టిస్ బీవీ నాగరత్న తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్నవారికి స్వీయ ప్రవర్తనా నియమావళి ఉండాలని అభిప్రాయపడ్డారు. వాక్ స్వాతంత్య్రంపై రాజ్యాంగంలో పేర్కొన్న ఆంక్షలు మినహా అదనంగా ఇతర ఆంక్షలను విధించలేమని జస్టిస్ రామసుబ్రహ్మణ్యం తన తీర్పులో స్పష్టంచేశారు. ధర్మాసనం ఎన్ని సూచనలు చేసినా స్వీయ నియంత్రణ పాటించేంత క్రమశిక్షణతో రాజకీయపార్టీలు ఎక్కడున్నాయని అబద్దాలను కూడా నిజాల్లా భ్రమింపజేసే గోబెల్స్ ప్రచారం జరుగుతున్న రోజుల్లో నేతల వాక్‌స్వాతంత్య్రంతో సమాజానికి అనర్ధాలే తప్ప మేలుజరిగే పరిస్థితి లేదన్నది వాస్తవం.