గవర్నర్లతో పరిపాలిస్తే ఇక ప్రభుత్వాలెందుకు? ప్రజాస్వామ్యం ఎందుకు?

By KTV Telugu On 12 January, 2023
image

కేబినెట్ ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని కాకుండా సొంత ప్రసంగం చేయడానికి గవర్నర్‌కు రాజ్యాంగం అధికారం ఇచ్చిందా. గవర్నర్ అధికార పరిమితుల గురించి ఏ కొద్దిగ తెలిసిన వారైనా లేదు అనే ఇస్తారు. మరి తమిళనాడు గవర్నర్ ఏం చేశారు. చేయకూడదనిది చేశారు. కేబినెట్ ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని ఎడిట్ చేసుకున్నారు. ఇష్టారీతిన ప్రసంగించారు. వద్దని తీర్మానం చేసినందుకు అసంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. దానికి తోడు వివాదాస్పద వ్యాఖ్యలు. అసలు ఓ గవర్నర్ ఇంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమిటి? ఇప్పుడు తమిళనాడు మాత్రమే కాదు తెలంగాణ కేరళ, బెంగాల్ వంటి రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉంది. ఇక ఢిల్లీలో అయితే ప్రభుత్వాన్ని లెఫ్టినెంట్ గవర్నరే నడుపుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది . కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఆ పార్టీ స్నేహితులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు గవర్నర్లుగానే వ్యవహరిస్తున్నారు. కానీ ఇతర చోట్ల మాత్రమే ప్రభుత్వాలుగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేసే ప్రయత్నం చేయడం కాదా? నాడు కాంగ్రెస్ చేసిందే నేడు బీజేపీ చేస్తున్నట్లుగా కాదా ? ఇప్పుడు బీజేపీ అప్పటి కాంగ్రెస్‌కు తేడా ఏంటి ?

శాసనసభలో చదవాల్సిన ప్రసంగపాఠాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే గవర్నర్‌కు పంపుతుంది. దానిని పరిశీలించి ఆమోదించిన తరువాతే తుది పాఠాన్ని ఖరారు చేస్తారు. ఒక వేళ అభ్యంతరాలుంటే తెలియచేస్తే ప్రభుత్వం సవరించే అవకాశం ఉంటుంది. ఒకవేళ సవరించకుండా అదే ప్రసంగాన్ని మళ్ళీ పంపితే గవర్నర్‌ దానిని ఆమోదించాల్సిందే. అలా ఆమోదించిన ప్రసంగాన్నే సభలో చదవాలి. ఇది రాజ్యాంగ సంప్రదాయం! అత్యున్నత న్యాయస్థానం కూడా అనేక సందర్భాల్లో దీనినే ధృవీకరించింది. రాష్ట్రపతి, గవర్నర్లకు విధి నిర్వహణలో సొంత అభిప్రాయాలకు తావు లేదంటూ రాజ్యాంగ నిర్దేశ సారాంశం కూడా ఇదే! రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రసంగ పాఠాన్ని ఆమోదించి చదవాల్సిన సమయంలో దానిని పక్కన పెట్టి సొంత అభిప్రాయాలనో తనను నడిపించే వారి అభిప్రాయాలనో ఏకరువు పెట్టడం ద్వారా రాజ్యాంగ విలువలను రవి తుంగలో తొక్కారు. గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కూడా ఆయన భావించవచ్చు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నరే ముఖం. ఆయన పేరుతోనే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నీ సాగుతాయి. సమాఖ్య వ్యవస్థ బలపడాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంధానకర్తలుగా గవర్నర్లు వ్యవహరించాలి. సమన్వయానికి చొరవ చూపాలి. అంతే కానీ ప్రజలు ఇచ్చిన ప్రభుత్వాన్ని కాదని తానే ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధం.

ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ‌ధన్‌కర్‌ గతంలో పశ్చిమ బెంగాల్‌ ‌గవర్నర్‌ గా ఉన్నారు. ఆ సమయంలో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఒక దశలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్‌ ‌ధన్‌కర్‌ ‌ట్విట్టర్‌ను స్తంభింపచేసేదాకా వెళ్లింది. కేసీఆర్‌ ప్రభుత్వం కూడా గవర్నర్ తీరు కారణంగా ఇబ్బంది పడుతోంది. అయితే కేసీఆర్ అసలు గవర్నర్ ఉనికిని గుర్తించడానికి సిద్ధంగా లేరు. చివరికి అసంబ్లీలో ప్రసంగం చదివించడానికి కూడా ఆయన సిద్ధపడలేదు. తమిళనాడులో గవర్నర్ సీటీ రవి చేసింది చూస్తే కేసీఆర్ నిర్ణయం కరెక్టేనని ఎక్కువ మంది అనుకుంటారు. కానీ ఇక్కడ జరిగింది రెండు వైపులా తప్పే.

గవర్నర్లను రాజకీయ ఆయుధంగా వాడుకోవడం ఇప్పటిది కాదు. కాంగ్రెస్ నుంచే ప్రారంభమైంది. ఇక ఇందిరాగాంధీ హయాంలో రాజ్యాంగంలోని 356వ అధికరణాన్ని ఒక అస్త్రంగా ఉపయోగించడం పరాకాష్టకు చేరింది. నంబూద్రి, ఎన్టీఆర్‌ ‌వంటివారి కేసులలో గవర్నర్‌ ‌పాత్ర కంటే కేంద్రం పాత్ర ఎక్కువ . ఈ అధికరణాన్ని ఉపయోగించే 1980లో పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌ ‌నేత ప్రకాశ్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ ‌నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే డిస్మిస్‌ ‌చేసింది. ఎన్టీఆర్ ప్రభుత్వమూ అంతే. అప్పట్లో గవర్నర్లను అలా ఉపయోగించుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వాలను డిస్మిస్ చేయడం మినహా అన్నీ చేస్తున్నారు. నిజంగా గవర్నర్‌కు రోజువారీ పాలనా వ్యవహారాలలో తల దూర్చే అధికారం లేదు. అలాగే శాసనసభ ఆమోదించిన బిల్లులకు తన ఆమోద ముద్ర నిలిపివేసే అధికారమూ లేదు. కానీ అవే చేస్తున్నారు. ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలలో జరిగే తంతు గవర్నర్లు రాజ్యాంగాన్ని బేఖాతరు చేయడమే.

అయితే అందరు గవర్నర్లు ఒకేలా ఉండటం లేదు. నిజానికి గవర్నర్ వ్యవస్థ అందరికీ ఒకటే. అందరికీ అధికారాలు ఒకటే ఉంటాయి. కానీ వారు వ్యవహరించే విధానం మాత్రం బీజేపీ, మిత్రపక్షాల రాష్ట్రాలు బీజేపీయేతర రాష్ట్రాల‌లో వేర్వేరుగా ఉంటుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క గవర్నర్ కూడా ఇలా వివాదాస్పదంగా వ్యవహరించడం చూడలేదు. బీజేపీ మిత్రులు ఉన్న రాష్ట్రాల్లోనూ గవర్నర్లు కిమ్మనరు. విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకంగా బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎంత రచ్చ జరిగిందో కళ్లముందు ఉంది. అదే ఏపీ ఏపీ గవర్నర్ మాత్రం వీసీల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు పట్టించుకోరు. తీవ్రమైన ఆరోపణలు ఉన్నా పూర్తి స్థాయి రాజకీయ కుల వివాదాలు ఉన్న వీసీలను సైతం నియమించేశారు. విశాఖలో ఏయూ ప్రసాదరెడ్డి అనే వీసీ వైసీపీ కార్యకర్తలా క్యాంప్‌ను పార్టీ ఆఫీస్‌గా మార్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. నాగార్జున యూనివర్శిటీ వైస్ చాన్సలర్ అయితే విద్యార్థులతో జగనన్న పాటలు పెట్టి డాన్సులేపిస్తూ ఉంటారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రుజువైనా ఈ ప్రభుత్వం మరో కమిటీని నియమించి మరీ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. దాదాపు అన్ని యూనివర్శీటీలదీ అదే పరిస్ధితి. 70శాతం యూనివర్శిటీలకు వీసీలుగా ఒకే సామాజికవర్గం వారిని పెట్టినా పట్టించుకోలేదు. కానీ కేరళలో మాత్రం కారణం లేకుండానే రాజీనామాకు ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం చేసిన చట్టాలు చాలా వరకూ కోర్టుల్లో కొట్టివేతకు గురవుతున్నాయి. వీటికి గవర్నర్ సంతకాలు పెట్టేసి రాజముద్ర వేస్తున్నారు. న్యాయస్థానాల్లో కొట్టి వేసినా రాజ్ భవన్ కూడా తప్పు చేసినట్లుగా భావించడం లేదు.

ఇక్కడ రాజ్యాంగంలో లోపం లేదు ఆ రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థలను రాజకీయం ఎలా ఆడుకుంటుందో అర్థం చేసుకుంటే అసలు లోపం ఎక్కడ ఉందో అర్థమవుతుంది. అలా కాకుండా వ్యవస్థ పకడ్బందీగా అమలు అయినప్పుడే ప్రజాస్వామ్యం బాగుంటుంది. లేకపోతే బలహీనపడుతుంది. కానీ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వ్యవస్థల్ని నాశనం చేస్తూనే ఉన్నాయి.