పదవి తీసేసిన యడ్యూరప్పే దిక్కు- కర్ణాటక బీజేపీ గేమ్ ఛేంజర్

By KTV Telugu On 11 April, 2023
image

కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందు కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వయసు అయిపోయిందని పనితీరు బాగో లేదని యడ్యూరప్పను తప్పించి ఎస్ఆర్ బొమ్మైను సీఎంను చేశారు. కానీ ఇప్పుడు ఎన్నికల సంద్రం ఈదడానికి యడ్యూరప్పనే దిక్కవుతున్నారు. సీఎం పదవి నుంచి తప్పించిన తర్వాత అసంతృప్తికి గురైన యడ్యూరప్పను కేంద్ర బీజేపీ పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇటీవలి కాలంలో పార్టీ పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చి మళ్లీ యడ్యూరప్పను బుజ్జగించి రంగంలోకి తీసుకు వచ్చారు. కర్నాటక మాజీ ముఖ్య మంత్రి బీఎస్‌ యెడియూరప్ప రాజకీయ రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోయిందన్న అంచనాలు ఎక్కువగా వచ్చాయి. అందుకే హైకమాండ్ జాగ్రత్త పడింది.

కర్ణాటకలో యడ్యూరప్ప బీజేపీని వేరువేరుగా చూడలేం. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ లో సాధారణ కార్యకర్తగా జీవితం ప్రారంభించిన ఆయన అత్యున్నత పీఠానికి ఎదిగారు. మధ్యలో అవినీతి ఆరోపణలతో ఓ సారి పదవి నుంచి తప్పించారు. ఆ తర్వాత సొంత పార్టీపెట్టుకున్నారు. ఆ పార్టీ దెబ్బకు బీజేపీ సగానికి ఓటు బ్యాంక్ కోల్పోయింది. తర్వతా మళ్లీ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఇప్పుడు వయసు ఏడున్నర పదులు దాటడంతో ఇక రిటైరవుతానని ప్రకటించారు. ఇందుకు వేరే కారణాలు ఏవీ కనిపించడం లేదు. ముఖ్యమంత్రి పదవి నుంచి తనను తప్పించడం వల్ల ఆయన అధిష్టానంపై అలిగి ఉన్నారన్న ప్రచారం జరిగింది. ఆయన పార్టీకి ఎంత చేశారో పార్టీ కూడా ఆయనకు అంతగా అవకాశాలు కల్పించింది. బీజేపీ కాలూనడానికి ఆయనే కారణం.

కర్నాటకలో పార్టీని అందలం ఎక్కించడానికి యడ్యూరప్ప ఎంతో కష్టపడ్డారు. ఆయన కష్టానికి గుర్తింపుగానే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అధిష్టాన వర్గం నాలుగుసార్లు కల్పించింది. పార్టీ పునాదులుగా ఆయన సంఘ్‌ శాఖలను ఉపయోగించుకున్నారు. లింగాయత్‌ సామాజిక వర్గం గురువుగారైన శివగంగ మఠం అధిపతి ఆశీస్సులతో ఆయన రాజకీయంగానూ సామాజికంగానూ ఎదిగారు. మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి సోదరుల ప్రమేయం ఉన్న మైనింగ్‌ కుంభకోణం తన కుమారుడు రాఘవేంద్రకు ప్రమేయం ఉన్న కుంభకోణాలు ఆయన రాజకీయ జీవితంలో చెరగని మచ్చ వేశాయి యడ్యూరప్ప వివాద రహితుడు. పార్టీకి దక్షిణాదిన పెట్టని కోటగా ఉండేవారు. బీజేపీలో అగ్రనాయకుల నుంచి దిగువ స్థాయి కార్యకర్తల వరకూ అందరితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.

అదే సందర్భంలో కాంగ్రెస్‌ జేడీఎస్‌ వంటి ప్రతిపక్షాల నాయకులతోనూ ఆయన మంచిగానే ఉంటూ ముఖ్యమంత్రిగా కొనసాగినంత కాలం ఎటువంటి గొడవలు లేకుండా అందరివాడిగా మెలుగుతూ వచ్చారు. యడ్యూరప్ప రిటైర్మెంట్‌ తో బీజేపీ కర్ణాటక శాఖలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎంతో మంది ఉన్నప్పటికీ ఆయన మాదిరిగా కలుపుగోలుగా వ్యవహరించేవారు తక్కువ. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మయ్‌ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ పార్టీపైనా కార్యకర్తల పైనా ఆయన తన ముద్ర వేయలేకపోయారు. ముఖ్యమంత్రిగా ఆయన గద్దె నెక్కి ఏడాది మాత్రమే . అయితే ఏడాది వ్యవధిలో ఆయన ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. ముస్లిం మహిళలు ధరించే హిజాబ్‌ని తప్పనిసరి చేస్తూ ఆయన తెచ్చిన జీవో రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లను సృష్టించింది. అలాగే రాష్ట్రంలో పలు చోట్ల గాడ్సే విగ్రహాల ఏర్పాటు విషయంలో కూడా ఆయన విమర్శలను ఎదుర్కొన్నారు పార్టీకి యడ్యూరప్ప వల్ల వచ్చిన మంచి పేరు బసవరాజ్‌ బొమ్మ య్‌ హయాంలో కరిగి పోయింది. యడియూరప్ప శిష్యుణ్ణని చెప్పుకుంటూనే ఆయనకు వ్యతిరేకంగా బొమ్మయ్‌ చాలా నిర్ణయాలు తీసుకు న్నారు. అలాగే మతపరమైన శక్తులను బొమ్మయ్‌ ప్రోత్సహిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి.

ఇన్ని రాజకీయాల మధ్య యడ్యూరప్ప సైలెంట్ గా ఉండటం లేదు. ఆయనే ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. ఏ వయసు కారణగా చూపి పదవి నుంచి తప్పించో అంతకు మించి ఎక్కువగా కష్టపడుతున్నారు. అయితే ఈ సారి బీజేపీ గెలిచినా మళ్లీ ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వరు. కానీ ఆయన కుమారులకు మంచి రాజకీయ భవిష్యత్ కల్పిస్తామని బీజేపీ హైకమాండ్ చెప్పిందని అంటున్నారు. అందుకే యడ్యూరప్ప గేమ్ చేంజర్ అనే అంటున్నారు.