రాహుల్‌గాంధీకి పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు వెంటనే ఆయన ఎంపీ పదవిపై అనర్హత వ్యవహారంతో విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఎన్నికలకు ముందు దీన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకుంటోంది కాంగ్రెస్. కానీ అదే సమయంలో రాహుల్ వ్యాఖ్యలు మహారాష్ట్రలో రాజకీయ దుమారానికి దారితీశాయి. రాహుల్ అనర్హత వేటు ఎపిసోడ్‌తో జాతీయస్థాయిలో అందరినీ దగ్గర చేసుకుంటున్న కాంగ్రెస్ మరాఠీ గడ్డపై మాత్రం మిత్రుడిని శత్రువుగా మార్చుకుంటోంది.
అనర్హత వేటు తర్వాత రాహుల్ గాంధీ అన్న ఒక్కమాటతో కలిసొచ్చేపార్టీలు కూడా మహారాష్ట్రలో దూరం జరుగుతున్నాయి. సావర్కర్‌లా సారీ చెప్పను అన్న రాహుల్ డైలాగ్ మరాఠీ సెంటిమెంట్‌ని రాజేశాయి. సావర్కర్ సెంటిమెంట్‌ని పొలిటికల్‌గా సొమ్ము చేసుకునే ప్రయత్నాల్లో ఉంది శివసేన ఉథ్థవ్‌థాక్రే వర్గం. వీర్‌సావర్కర్‌ని అవమానించిన రాహుల్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఉథ్థవ్ థాక్రే డిమాండ్ చేశారు. శివసేన అధికార పత్రిక సామ్నా ఎడిటోరియల్ కూడా రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఈ పరిణామాలతో శివసేన కాంగ్రెస్ మధ్య దూరం పెరిగింది. మొన్నటిదాకా శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి మహారాష్ట్ర వికాస్ అఘాడీ పేరుతో మహా కూటమి అధికారంలో ఉన్నాయి. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది.
రాహుల్ వ్యాఖ్యలను శివసేన ఉథ్ధవ్ థాక్రే వర్గం అందుకోవటంతో తాము కూడా మహారాష్ట్ర వ్యాప్తంగా సావర్కర్ గౌరవ్ యాత్ర చేపడతామంటున్నారు సీఎం ఏక్‌నాథ్ షిండే. మరాఠీ యోధుడిని అవమానించిన కాంగ్రెస్‌తోనే ఉంటారా ధైర్యంగా బయటికొచ్చేస్తారా అని ఉథ్థవ్ థాక్రేకి ఏక్‌నాథ్ షిండే సవాలు విసిరారు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీలో 45 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ బలం ఉథ్థవ్‌కి చాలా కీలకం. కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుంటే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మహాకూటమి మనుగడ కష్టం. దీంతో రాహుల్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూనే ఏం చేయాలన్నదానిపై ఉథ్థవ్ వర్గం మల్లగుల్లాలు పడుతోంది.