శివసేన విషయంలో భారత ఎన్నికల సంఘం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో పార్టీ గుర్తుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పార్టీ గుర్తు అంత ముఖ్యమా కేవలం పార్టీ గుర్తు ఉంటేనే ఎన్నికల్లో గెలిచిపోతారా. ఎన్నికల్లో గెలవడానికి పార్టీ గుర్తు అవసరమా లేక జనంలో ఆదరణ ముఖ్యమా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. రాజకీయ పండితులు మాత్రం నేతలు జనంలో ఉంటే నేతలది ఏ గుర్తు అయినా జనం ఆశీర్వదించి పదవి ఇస్తారని అంటున్నారు.
శివసేన పార్టీ పంచాయతీ విషయంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పార్టీపై సర్వాధికారాలతో పాటు పార్టీ గుర్తు అయిన విల్లు బాణాలను కూడా పార్టీలో తిరుగుబాటు లేవదీసి బిజెపి సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్ నాథ్ షిండే కే కేటాయించింది ఈసీ. దీంతో శివసేన పార్టీ తమదేనని వాదిస్తోన్న ఉద్ధవ్ థాకరే వర్గం మండి పడింది. పార్టీ గుర్తు సొంతం చేసుకోవడం కోసం షిండే రెండు వేల కోట్లు ఖర్చుచేశారని ఉద్ధవ్ థాకరే వర్గం తీవ్రమైన ఆరోపణలు చేసింది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానంలోనూ పిటిషన్ దాఖలు చేశారు ఉద్ధవ్ థాకరే.
పార్టీ గుర్తు తమకే కేటాయించాలని ఆయన పట్టుబడుతున్నారు. పార్టీ గుర్తు షిండే చేతికి వెళ్లిపోతే వచ్చే ఎన్నికల్లో అది షిండేకి అడ్వాంటేజ్ అవుతుందన్నది ఉద్ధవ్ థాకరే ఆందోళన. అయితే రాజకీయ పండితులు మాత్రం ఉద్ధవ్ థాకరే మరో కొత్త పార్టీని పెట్టి జనంలోకి వెళ్లడమే మంచిదని సూచిస్తున్నారు.
షిండే తిరుగుబాటు జెండా ఎగరేయడానికి ముందు వరకు మరాఠా గడ్డపై అధికారంలో ఉన్న అఘాడీ కూటమిలో పార్టనర్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సైతం ఉద్ధవ్ థాకరే ఆందోళన చెందకుండా సొంతపార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు. ప్రజలకు అలవాటైన గుర్తు లేకపోతే ఎన్నికల్లో గెలవగలమా అన్నది ఉద్ధవ్ ధాకరే అనుమానం ఆందోళన కూడా. పార్టీ గుర్తు కీలకమే కావచ్చు కానీ ఒక వేళ అది ఏ పరిస్థితుల్లోనైనా చేజారినా కంగారు పడిపోనవసరం లేదని కొత్త గుర్తుతో జనంలోకి వెళ్లి జనంతో మమేకం అయితే ఆ గుర్తును కూడా జనం గుండెల్లో పెట్టుకుంటారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దానికి చరిత్రలో కొన్ని దాఖలాలు కూడా ఉన్నాయని వారంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు వచ్చినపుడు ఇందిరాగాంధీ అంతటి మహానాయకురాలికే అప్పట్లో కాంగ్రెస్ గుర్తు అయిన ఆవు దూడ గుర్తు దక్కలేదు. ఆమెకు హస్తం గుర్తు కేటాయించింది ఎన్నికల సంఘం. ఆ గుర్తుతోనే జనంలోకి వెళ్లిన ఇందిరాగాంధీ తనకున్న జనాకర్షక శక్తితో కోట్లాది మంది మనసులు కొల్లగొట్టారు. చివరకు జనం కూడా ఆవు దూడ గుర్తును పక్కన పెట్టి హస్తం గుర్తుకు పట్టంకట్టారు. ఇక అప్పట్నుంచీ కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తంగానే కొనసాగుతోంది.
పార్టీ కంటే ఎవరూ పెద్దవాళ్లు కాకపోవచ్చు. కానీ జనం గుండెల్లో చోటు సంపాదించుకుంటే మాత్రం పార్టీలకన్నా కూడా నేతలకే జనం జేజేలు కొడతారనడానికి ఇందిరాగాంధీయే తిరుగులేని నిదర్శనం అంటున్నారు రాజకీయ పండితులు.
అంతెందుకు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘం కాలం కొనసాగిన బెంగాల్ నాయకురాలు మమతా బెనర్జీ బెంగాల్ లో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె నెక్కించాలని పట్టుదలగా ఉండేవారు. అందుకోసం ప్రజల్లోకి వెళ్లి ఎన్నో ఉద్యమాలు చేశారు. జనంతో మమేకం అయ్యారు. అయితే కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం బెంగాల్ పై ఆశలు వదిలేసుకోవడమే కాకుండా అక్కడి కమ్యూనిస్టులతో అవగాహనతో ఉండేది. ఈ వైఖరి నచ్చని మమతా బెనర్జీ ఏకంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి సొంతంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు. అంత వరకు హస్తం గుర్తుపై గెలుస్తూ వచ్చిన మమతా బెనర్జీ మొదటి సారి కొత్త జెండాతో కొత్త గుర్తుతో జనంలోకి వెళ్లాల్సి వచ్చింది.
అలా వెళ్లడం తనకు నష్టం చేకూరుస్తుందని ఆమె అనుకోలేదు. అసలు ఆ విధమైన ఆలోచనలే చేయలేదు మమతా బెనర్జీ. తాను చేసిన ఉద్యమాలతో జనంతో ముడిపడిపోయిన రాజకీయ జీవితాన్ని మరింత నిజాయితీగా ముందుకు నడిపారు. అంతే తన సొంత జెండాతోనే ఆమె అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. కామ్రేడ్లకు కంచుకోటగా ఉన్న బెంగాల్ లో కమ్యూనిస్టుల రాజ్యాన్ని గద్దె దింపేశారు మమతా బెనర్జీ. దాని స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. జనం మెచ్చాలే కానీ ఏ పార్టీ అయినా ఏ గుర్తు అయినా ఓట్లు దానంతట అవే వచ్చి పడతాయని అర్ధమైంది మమతా బెనర్జీకి. ఒక్క సారి కాదు వరుసగా మూడు ఎన్నికల్లోనూ గెలిచి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు. పైగా ప్రతీ ఎన్నికలోనూ తమ పార్టీ మెజారిటీని పెంచుకుంటూ వచ్చారు. ఇక ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి అకాల మరణంతో గుండెలు ఆగి మరణించిన వారిని పరామర్శించేందుకు ఓదార్పుయాత్రకు సిద్ధమైతే రెండు విడతల యాత్ర వరకు యాత్రను అనుమతించిన పార్టీ అధిష్ఠానం వాటికి ప్రజల నుండి అనూహ్య స్పందన రావడంతో యాత్రను నిలిపివేయాలంటూ ఆదేశించింది.
ఓదార్పు యాత్ర అనేది ప్రజలకు ఇచ్చిన మాట కాబట్టి దాన్ని మధ్యలో ఆపడం సరికాదని జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీకి వివరణ ఇచ్చారు. అయినా ఆమె ససేమిరా అనడంతో ఏపీ వచ్చేసిన జగన్ మోహన్ రెడ్డి తన అనుచరులు శ్రేయోభిలాషులతో సమాలోచనలు చేశారు. అందరూ కూడా పార్టీ నాయకత్వానికి ఎదురు తిరగడం మంచిది కాదేమో అన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ప్రజల కిచ్చిన మాట తప్పడం మంచిది కాదని దానికోసం ఎందాకైనా వెళ్లచ్చని వెళ్తానని నిర్ణయించారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీతో పాటు పార్టీ గుర్తుపై గెలిచిన ఎంపీ పదవిని కూడా వదులుకున్నారు. ఆ తర్వాత కొత్త పార్టీ పెట్టారు. కొత్త జెండా ఆవిష్కరించారు. తన మనసులోని అజెండాను పార్టీకి అందించారు. పార్టీకి ఫ్యాన్ గుర్తు కేటాయించింది ఈసీ. వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తండ్రి కాలం నుండి కూడా ఆ కుటుంబం కాంగ్రెస్ లోనే ఉండింది. అంచేత వారికి హస్తం గుర్తే అలవాటయిన పార్టీ చిహ్నం. కాంగ్రెస్ కు రాజీనామా చేశాక ఆ గుర్తు పోయింది.
అయితే దాని గురించి జగన్ మోహన్ రెడ్డి ఆందోళన చెందలేదు. ముందుగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే ఓదార్పు యాత్ర పూర్తి చేశారు. ఆ వెంటనే కాంగ్రెస్ నుండి రాజీనామా చేసి తనకు సంఘీభావం తెలిపిన నేతలను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున ఉపఎన్నికల బరిలో నిలబెట్టి గెలిపించుకున్నారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఇంచుమించు అధికారంలోకి వచ్చినంత పని చేశారు. గెలిచిన టిడిపి-బిజెపి కూటమికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి మధ్య ఓట్ల శాతం తేడా ఒకటిన్నర శాతం మాత్రమే. మరో అయిదేళ్ల పాటు జనంలోనే ఉన్న జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ప్రభంజనమే సృష్టించారు. ఆ ప్రభంజనంలో టిడిపి గల్లంతు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హస్తంగుర్తు అవసరం లేనిదైంది. వాళ్లు ఫ్యాన్ గుర్తుకు అలవాటు పడిపోయారు. ఈ ముగ్గురి బాటలోనే నిజాయితీగా జనంతో మమేకం అయితే ఉద్ధవ్ థాకరే కూడా కొత్త జెండాతో కొత్త గుర్తుతో సంచలనం సృష్టించవచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఢిల్లీలో కొత్తగా పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ దేశ వ్యాప్తంగా సుపరిచితమైన కమలం, హస్తం గుర్తులను లాగితన్ని ఏకపక్ష విజయం సాధించిన వైనాన్ని కూడా గుర్తు చేస్తున్నారు రాజకీయ పండితులు. అంచేత గుర్తు ఏమిటన్నది ముఖ్యంకాదని జనం మనతో ఉన్నారా లేదా అన్నదే పాయింటని వారంటున్నారు.