ఐటీ పరిమితి పెంపు..రూ.7లక్షల వరకు నో ట్యాక్స్‌

By KTV Telugu On 2 February, 2023
image

కేంద్రం 2023-24 బడ్జెట్‌లో సామాన్యులకు వరాలు ప్రకటించింది. వేతనజీవులకు ఊరట కల్పించే ప్రకటన చేశారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం సహా పన్ను శ్లాబుల్లో మార్పులు చేసింది. ఉద్యోగులు, మధ్యతరగతి వర్గానికి కూడా ఇది పెద్ద ఉపశమనం ఇచ్చిందనే చెప్పొచ్చు. గతంలో పాత కొత్త పన్ను విధానాల్లో ఏదైనా ఆదాయపు పన్ను మినహాయింపు పరిధి రూ.5 లక్షలుగా ఉండేది. ఇప్పుడు కొత్త పన్ను విధానానికి సంబంధించి ఈ పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. రూ.7 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన వారు పన్ను కట్టాల్సిన పని లేదు.

పాత టాక్స్ విధానం కింద సగటు భారతీయుడు ఆదాయపుపన్ను శ్లాబ్ రేట్ల గురించి ఎదురుచూశాడు. అందుకు తగ్గట్లే పన్ను శ్లాబుల్లో మార్పులు చేశారు. గతంలో 6 ఉండగా ఇప్పుడు ఐదుకు తగ్గింది. దీని ప్రకారం.. రూ.3 లక్షల లోపు ఆదాయం ఉంటే ఎలాంటి పన్నులు ఉండవు. రూ. 3 నుంచి రూ. 6 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ. 6 నుంచి 9 లక్షల వార్షికాదాయం ఉంటే 10 శాతం, రూ. 9 లక్షల నుంచి రూ.12 లక్షల వార్షికాదాయం ఉంటే 15 శాతం, రూ. 12 -.15 లక్షల వార్షికాదాయం ఉన్న వారు 20 శాతం పన్ను, రూ.15 లక్షలు అంతకంటే ఎక్కువ వార్షికాదాయం ఉంటే 30 శాతం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం రిబేట్ ఇస్తుంటుంది. ఇదివరకు రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రిబేట్ ఉండగా ఇప్పుడు అదే ఆదాయపు పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచింది.

కొత్త ట్యాక్స్ విధానం కింద రూ.9 లక్షల వేతనం పొందేవారు గతంలో రూ.60 వేలు పన్ను రూపంలో కట్టేవారు. కానీ ఇప్పుడు పన్ను శ్లాబుల్లో మార్పులతో వారికి ఉపశమనం కలగనుంది. ఇప్పుడు రూ.45 వేలు చెల్లిస్తే సరిపోతుంది. కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ గురించి ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. ఈ లెక్కన రూ.15.5 లక్షలు ఆపైన వేతనం ఉన్న ఉద్యోగులు రూ.52,500 మేర పన్ను ప్రయోజనం పొందనున్నారు. భారత్‌లో ఏటా రూ.5 కోట్లు అంతకంటే ఎక్కువ సంపాదించే వారు ప్రస్తుతం 42.74 శాతం పన్ను కడుతున్నారు. ప్రపంచదేశాల్లో ఇదే అత్యధికం అని నిర్మలమ్మ ప్రస్తావించారు కూడా. అయితే దీనిపై సర్‌ఛార్జీని కొత్త పన్ను విధానం ప్రకారం 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. దీంతో అత్యధిక ట్యాక్స్ రేటు ఇప్పుడు 39 శాతానికి చేరింది. కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గా ఉంటుందని చెప్పిన ఆర్థిక మంత్రి పాత పన్ను విధానం కావాలనుకున్నవారు అందుకు మారొచ్చని చెప్పారు. ఆదాయపు పన్ను విషయంలో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకునేందుకు వీలుగా తీసుకొచ్చిన వివాద్‌ సే విశ్వాస్‌-2 పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.

పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానం లేదా పాత పన్ను విధానంలో ఏదో ఒకదానిని ఎంచుకునే వీలుంది. గతంలో ఏదో ఒకదానిని మనమే ఎంచుకోవాల్సి వచ్చేది. పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు వెబ్‌సైట్‌లో కొత్త పన్ను విధానమే డిఫాల్ట్‌గా ఉంటుంది. పాత పన్ను విధానం కావాలనుకుంటే దీన్ని మార్చుకోవాలి. ఒక ఆర్థిక సంవత్సరం పాత పన్ను విధానం మరో ఆర్థిక సంవత్సరం కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. కానీ వృత్తి, వ్యాపారం ద్వారా లాభాలను ఆర్జించే వారు ఒకసారి కొత్త పన్ను విధానంలోకి మారిన తర్వాత మళ్లీ పాత పద్ధతిలో రిటర్నులు దాఖలు చేయడం సాధ్యం కాదు. ఉద్యోగులు లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ చేసుకున్నప్పుడు రూ.3లక్షల వరకే పన్ను మినహాయింపు ఉండేది. పెరిగిన వేతనాలను దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తాన్ని రూ.25లక్షలకు పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు.