ప్రధాని పదవి అందినట్లే అంది ఎడంకాలితో తన్నేసింది

By KTV Telugu On 13 March, 2023
image

అర్హతలు అవకాశాలు ఉంటే సరిపోదు వాటికి తోడు అదృష్టం అనేది ఒకటి ఉండి తీరాలి. అది కానీ మిస్ అయ్యిందా ఇక అంతే సంగతులు. కేవలం అదృష్టం మొహం చాటేయడం వల్లనే దేశంలోని అత్యున్నత పదవిని చివరి సెకనులో కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. కొందరికైతే దురదృష్టం రెండు సార్లుకూడా వెక్కిరించిపోయింది. ఆ నేతలు ఒక్కసారి తమ రాజకీయ జీవితాలను రివైండ్ చేసుకుంటే తీవ్ర మనస్తాపంతో తల్లడిల్లిపోతూ ఉంటారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి.

ఉత్తర ప్రదేశ్ రాజకీయ దిగ్గజం ములాయం సింగ్ యాదవ్ ది మామూలు జాతకం కాదు. గ్రహాలన్నీ కలిసి ఆయనపై కక్షగట్టేయడంతో అదృష్టం చేజారిపోయింది కానీ లేకపోతే ఆయన ప్రధానీ పీఠంపై కూర్చుని దర్జా ఒలకబోసేవారే.
1996 ఎన్నికల్లో బిజెపి కూటమికి 161 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ కు 141 స్థానాలు మాత్రమే వచ్చాయి. అతి పెద్ద పార్టీగా బిజెపికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. వాజ్ పేయ్ ప్రధాని అయ్యారు. కాకపోతే 13రోజులకే ఆయన బలం నిరూపించుకోలేక రాజీనామా చేయక తప్పలేదు. అపుడు 141 స్థానాలున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకు ఆసక్తి చూపలేదు. మాజీ ప్రధాని వి.పి.సింగ్ కు అవకాశం తలుపు తట్టింది. అయితే ఆయన అబ్బే నావల్ల కాదని చేతులెత్తేశారు. కాకపోతే ఓ సలహా ఇచ్చారు. సిపిఎం దిగ్గజం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసును ప్రధాని చేస్తే బాగుంటుందని వి.పి.సింగ్ సూచించారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన సీపీఎం పొలిట్ బ్యూరో జ్యోతి బసును ప్రధాని చేయడానికి నిరాకరించడంతో బంగారంలాంటి అవకాశం జ్యోతి బసు బెడ్ రూమ్ దాకా వచ్చి వెనక్కి వెళ్లిపోయింది.

ఆ సమయంలో సిపిఎం కు ఉన్నది 32 మంది ఎంపీలే. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలం 272. అటువంటి నేపథ్యంలో జ్యోతి బసు ప్రధాని అయినా ఆ ప్రభుత్వం బలహీనంగానే ఉంటుందన్న ఆలోచనతో ప్రధాని పదవి వద్దంటూ సిపిఎం బల్లగుద్దింది. కాకపోతే ఆ తర్వాత కొన్నేళ్లకు ఆ పార్టీ అగ్రనేతలు నాలికలు కరుచుకున్నారు. జ్యోతి బసును ప్రధానిని చేసి ఉండాల్సిందని అలా చేయకపోవడం ద్వారా చారిత్రక తప్పిదానికి పాల్పడ్డామని సీపీఎం ఒప్పుకుంది. ఏమైతేనేం పాపం జ్యోతి బసుకు ప్రధాని పదవి మిస్ అయిపోయింది. సరే జ్యోతి బసు మిస్ అయ్యారు కదా మరయితే ఎవరిని ప్రధాని చేయాలన్న ప్రశ్న మళ్లీ కంటిన్యూ అయ్యింది. అపుడు ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. ఒకటి బిహార్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ మరొకరు ఉత్తర ప్రదేశ్ నేతాజీ ములాయం సింగ్ యాదవ్. అయితే అప్పుడే లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణంలో ఇరుక్కుని ఉన్నారు. దాంతో ఆయన పేరు వెనక్కి పోయింది. నెక్స్ట్ ఛాయిస్ ములాయం సింగ్ యాదవ్. ములాయంను ప్రధాని చేసేయడానికి రంగం సిద్ధం అయిపోయింది అయితే చివరి నిముషంలో ములాయం ప్రధాని కాకుండా ఇద్దరు మోకాలడ్డారు. వాళ్లెవరో కారు లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్. శత్రువులు ఎక్కడో ఉండరు మనోళ్లలోనే ఉంటారని అప్పుడే ములాయంకు అర్ధమైంది.

1999 ఎన్నికల అనంతరం మళ్లీ మరో సారి ములాయంకు అవకాశం వచ్చింది. ములాయంను ప్రధాని చేద్దామని అందరూ అనుకున్నారు. అయితే లాలూ యాదవ్ శరద్ యాదవ్ లు మాత్రం ములాయం అవ్వడానికి వీల్లేదంటే వీల్లేదని పంతంపట్టారు. దాంతో రెండో సారి ప్రధాని పదవి దగ్గరదాకా వచ్చి వెనక్కి పోయింది. అదృష్టం వచ్చినట్లే వచ్చింది కానీ చివరి సెకనులో దురదృష్టం దాన్ని ఓవర్ టేక్ చేసేసింది. ఆ మాటకొస్తే సోనియా గాంధీకి కూడా ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. మొదటి సారి విదేశీయత కారణంగా సొంత పార్టీలోనే నిరసన గళాలు వినపడ్డంతో అది వెనక్కి పోయింది. రెండో సారి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీయే కి పూర్తి మెజారిటీ వచ్చింది. ఆమెనే ప్రధాని కావాలని కాంగ్రెస్ శ్రేణులు ఆశించాయి. కానీ ఆమె మాత్రం ప్రధాని పీఠంపై కూర్చోడానికి ఇష్టపడలేదు. ఆమె అనాసక్తతను చూసిన వెంటనే ఇక మనమే ప్రధాని అనుకున్నారు పార్టీలో కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ. అయితే ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలందరికీ షాకిస్తూ సోనియా గాంధీ గతంలో పి.వి.కేబినెట్ లో ఆర్ధిక మంత్రిగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ కు పట్టం కట్టారు. దాంతో ప్రణబ్ ముఖర్జీ చాలా నిరాశ చెందారు.

నిజానికి కాంగ్రెస్ పార్టీలో ప్రధాని అయ్యే అర్హతలు ఎవరికైనా ఉన్నాయంటే అది ఒక్క ప్రణబ్ ముఖర్జీకే ఉన్నాయి. ఇందిరా గాంధీ హయాం నుండి నంబర్ టూగా ఉంటూ వచ్చిన ప్రణబ్ ను పక్కన పెట్టడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి ఇందిరా గాంధీ మరణానంతరం ప్రణబ్ ముఖర్జీనే గద్దె నెక్కించాలి. కానీ రాజకీయాలంటే ఏ మాత్రం ఆసక్తి లేని రాజీవ్ గాంధీ తెరపైకి వచ్చారు. రాజీవ్ గాంధీ మరణానంతరం మళ్లీ ప్రణబ్ ముఖర్జీ పేరు వినిపించింది. అయితే అనూహ్యంగా సీనియారిటీ లిస్టులో పి.వి.నరసింహారావుకు అవకాశం వచ్చింది. ప్రధాని పదవి ఇక తన జీవితంలో తనకు రాదని తేల్చుకున్న తర్వాత ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవికి కన్నుగొట్టారు. ఆయనకు అర్హతలు ఉండడంతో పాటు విపక్షాలకు కూడా ఆమోదయోగ్యుడు కావడంతో ఆయన రాష్ట్రపతి అయ్యారు. ఇక ప్రధాని పదవి సొంతం చేసుకోడానికి అహోరాత్రులూ శ్రమించి తన పార్టీని కింది స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన మరో దిగ్గజం అద్వానీ. పార్లమెంటులో కేవలం రెండు స్థానాలు మాత్రమే ఉన్న భారతీయ జనతా పార్టీని జనంలోకి తీసుకెళ్లింది లాల్ కృష్ణ అద్వానీయే.

రామజన్మభూమి నినాదాన్ని అందుకుని దాన్ని దేశ వ్యాప్తంగా వ్యాప్తి చేశారు అద్వానీ. ప్రజల్లో వేడి పెంచేందుకు రథయాత్ర కూడా చేశారు. ఆ రథ యాత్ర బిజెపిని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. రెండు స్థానాల బిజెపిని 80 పైచిలుకు స్థానాల స్థాయికి పెంచేసింది. ఆ తర్వాత పార్టీకి మరింత ఊపు తెచ్చారు అద్వానీ. దాంతో 1996 ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించింది బిజెపి. అయితే బలం నిరూపించుకోలేక 13 రోజులకే కూలిపోయింది ప్రభుత్వం.1998లో జరిగిన ఎన్నికల్లో బిజెపి రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఈ సారి 13 నెలల తర్వాత అవిశ్వాస తీర్మానంలో బలం నిరూపించుకోలేక ప్రభుత్వం కూలిపోయింది.1999 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. బిజెపి అధికారంలోకి రాగానే ప్రధాని ఎవరన్న చర్చ లేదు. ఎందుకంటే అద్వానీయే ప్రధాని అనుకున్నారు. కానీ బిజెపికి మద్దతు ఇచ్చే పార్టీలు మాత్రం అద్వానీ ఆమోద యోగ్యుడు కారనడంతో మితవాది అయిన వాజ్ పేయ్ వైపు మొగ్గు చూపారు. లేదంటే అపుడే అద్వానీ ప్రధాని అయ్యేవారు.

2004 ఎన్నికల్లో ఇండియా ఈజ్ షైనింగ్ నినాదంతో ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే ఓటమి చెందింది. 2009 ఎన్నికల్లో అద్వానీ ప్రధాని అభ్యర్ధిగా ప్రొజెక్ట్ అయ్యారు. కాకపోతే ఆ ఎన్నికల్లోనూ బిజెపి గెలవలేకపోయింది. 2014 ఎన్నికలు వచ్చే సరికి అద్వానీని పక్కన పెట్టి నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించేసింది బిజెపి. అలా ప్రధాని పదవి దగ్గరదాకా వచ్చినట్లే వచ్చి మిస్ అయ్యింది అద్వానీకి. నిజానికి బిజెపి ఈ రోజు ఇంత బలంగా ఉందంటే దానికి కారణం అద్వానీయే అని సంఘ్ పరివార్ లో ప్రతీ ఒక్కరూ ఒప్పుకుంటారు. ఈ నేతలంతా కూడా ప్రధాని పదవికి అర్హతలు ఉండి రాజకీయ అనుభవం ఉండి అవకాశాలు కోల్పోయారు. ఇంకొందరు నేతలు ఏ ప్రయత్నం చేయకపోయినా ప్రధాని పదవి వారిని వచ్చి వరించేసింది. అంటే అదృష్ట రేఖ అరచేతిలో జెర్రిగొడ్డు లా ఒళ్లు చేసి ఉందన్నమాట. అలా ప్రధానులు అయిపోయిన వారిలో చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్, దేవెగౌడలను చెప్పుకోవచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత సాగర సంగమం సినిమాలో కమల్ హాసన్ చెప్పినట్లు తలరాత ఉండాలండీ అనుకోవడం తప్ప ఏమీ చేయలేం.