పార్లమెంట్ ఉభయసభల్లో మరో అంశం చర్చకు రావడం లేదు. రాహుల్‌గాంధీ దేశాన్ని అవమానపరిచారంటూ బీజేపీ దుమ్మెత్తిపోస్తోంది. ఆయనపై చర్యలకు బీజేపీ పట్టుబడుతోంది. అదానీ వ్యవహారం పక్కకు వెళ్లిపోయింది. దేశంలో ఇతర సమస్యలేవీ లేనట్లు జాతీయ రాజకీయమంతా రాహుల్ వ్యాఖ్యల చుట్టే తిరుగుతోంది. రాహుల్ తన ఉద్దేశం అదికాదని వివరణ ఇస్తేనో క్షమాపణ చెబితేనో దీన్ని వదిలేసే ఆలోచనలో లేదు బీజేపీ. ఈమధ్య భారత్ జోడో యాత్రతో దేశమంతా తిరిగిన రాహుల్‌గాంధీపై అసహనంతో ఉన్న బీజేపీ ఈ అంశాన్ని అస్సలు వదలదల్చుకోలేదు. విదేశీ పర్యటనలో భాగంగా ప్రఖ్యాత కేంబ్రిడ్జి యూనివర్సిటీలో రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగంపై రగడ జరుగుతోంది. విద్యార్థులతో భేటీ సందర్భంగా మోడీ సర్కారుపై రాహుల్ ఘాటు విమర్శలు చేశారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని ఆరోపించారు. లోక్‌సభలో తనను మాట్లాడనివ్వకుండా మోడీ సర్కారు గొంతు నొక్కుతోందని ఆగ్రహించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న మాటతో దేశాన్ని రాహుల్ అవమానపరిచారన్నది బీజేపీ నేతల అభియోగం. ఆ విషయం ఎన్నో అంతర్జాతీయ సంస్థలు చెప్పినప్పుడు నోరు పెగలని నేతలు కూడా రాహుల్‌ని దేశద్రోహిగా చిత్రీకరించేందుకు పోటీ పడుతున్నారు.
రాహుల్‌గాంధీపై దేశద్రోహి ముద్రవేసి ఆయన్ని సభనుంచి బయటికి పంపాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. 1976లో దేశంలో ఎమర్జన్సీ విధించినప్పుడు అప్పట్లో సుబ్రమణ్యస్వామి విదేశీ వేదికలపై భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేస్తారంటూ విదేశీల్లో స్వామి చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పార్లమెంటరీ దర్యాప్తు కమిటీని వేసి అప్పట్లో ఎంపీగా ఉన్న సుబ్రమణ్య స్వామిని సభ నుంచి బహిష్కరించింది. ఆ తరహాలోనే రాహుల్‌పై వేటు వేయాలన్నది బీజేపీలోని కొందరి ఆలోచన. అయితే ఎన్నికలకు ముందు అలాంటి చర్యలతో కాంగ్రెస్‌కి సానుభూతి వస్తుందన్న చర్చ కూడా ఆ పార్టీలో జరుగుతోంది.
మొన్నటిదాకా పప్పు అంటూ రాహుల్‌గాంధీని ఎద్దేవా చేశారు బీజేపీ నేతలు. ఆయన విదేశీ పర్యటనలను తప్పుపట్టారు. భారత్ జోడో యాత్రతో రాహుల్‌గాంధీ ఇమేజ్ మారిపోయింది. రాజకీయంగా ఆయనలో పరిణితి పెరిగింది. వేల కిలోమీటర్ల యాత్రతో గాంధీల వారసుడు రాటుదేలాడు. ఇలాంటి సమయంలో విదేశీ యూనివర్సిటీలో ఆయన ప్రసంగాన్ని తప్పు పట్టి వేటువేస్తే అది అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న మాత్రాన దేశాన్ని అవమానపరిచినట్లు కాదు. గుజరాత్ మారణహోమంలో మోడీ పాత్రపై బీబీసీ డాక్యుమెంటరీలతో మన పరువుపోయింది. ఇప్పుడు ఓ మాటేదో అన్నాడని రాహుల్‌పై ఒంటికాలిపై లేచినంత మాత్రాన ప్రజాస్వామ్య పునాదులేమీ బలపడవు. అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు బీబీసీ మీద కోపాన్ని రాహుల్‌మీద తీర్చుకోవాలనుకుంటున్నారేమో!