భారత్, ఇండియా, హిందూస్థాన్ – అసలు మన దేశం పేరేంటి ?

By KTV Telugu On 20 July, 2023
image

KTV Telugu.-ప్రపంచంలో ఏ దేశానికైనా ఒకే పేరు ఉంటుంది. కానీ మన దేశం పేరుపై మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంతర్జాతీయగా ఇండియా అనే పేరు స్థిరపడింది. కానీ మనం మాత్రం భారతదేశం పిలుస్తాం. కొంత మంది హిందూస్థాన్ అంటారు. అయితే మన దేశానికి అంతకు మించిన పేర్ల చరిత్ర ఉన్నది. దీనికి రాజకీయ భావాలు తోడు కావడంతో ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది. బీజేపీ వాళ్లు మొదటి నుంచి ఇండియా అన్న పేరును భారత్ అని ప్రొజెక్టు చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇండియా అనే పేరును వెనక్కు తీసుకువెళ్లడానికి వాళ్లకి ఇప్పుడు మరో కారణం దొరికింది. ఇదే కాంగ్రెస్ నేతృత్వంలోనీ ఇండియా కూటమి. అసలు మన దేశం పేరేంటి ? ఎందుకిలా మార్పులు చోటు చేసుకున్నాయి ?

కాంగ్రెస్ కూటమికి ఇండియా అనే పేరు పెట్టుకునే ముందు కొంత కాలం కిందట బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తున్న సందర్భంలో మన దేశ పేరు వివాదం అక్కడ చర్చకు వచ్చింది. బీహార్ ఎన్నికల్లో గెలిచిన మజ్లిస్ ఎమ్మెల్యే ప్రమాణం చేసే సమయంలో.. ప్రమాణపత్రంలో ” హిందుస్థాన్” పదానికి బదులుగా రాజ్యంగంలో ఉన్న “భారత్” అని ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. హిందుస్థాన్ అనే పదం వాడడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, రాజ్యంగ ప్రవేశికలో అన్ని భాషల్లోనూ “భారత్” అని ఉందని, రాజ్యాంగానికి కట్టుబడి భారత్ అనే పదాన్ని ఉపయోగించాలని తాను భావించినట్లుగా ఎమ్మెల్యే చెప్పారు. అంటే ఎమ్మెల్యేల ప్రమాణపత్రంలో హిందూస్థాన్ అని.. రాజ్యాంగంలో భారత్ అని ఉంది. మరి ఇండియా ఎక్కడ నుంచి వచ్చింది ?

ఇండియా అనేది ఇంగ్లిష్ అని దాని తెలుగు అర్థం భారత దేశం అని విద్యార్థులకు టీచర్లు చెబుతూంటారు. విద్యార్థులూ అదే అనుకుంటూ ఉంటారు. కానీ అసలు పేరుపై వివాదం ఇప్పటిది కాదు. హిందుస్థాన్ అనే పదాన్ని చాలా చోట్ల వాడుతూనే ఉంటారు. ఉత్తర భారతంలో ఎక్కువగా వాడుకలో ఉన్న పదమే. భారత్ అని కూడా అంటారు. తెలుగువాళ్లు ఎక్కువగా భారతదేశం అనే పదం వాడతారు. దేశ వ్యాప్తంగానూ, ప్రపంచ వ్యాప్తంగానూ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండే పదం ” ఇండియా”. ప్రభుత్వ పరంగా భారత్, ఇండియా అనే పదాలు గుర్తింపు పొంది ఉన్నాయి. హిందూస్థాన్ అనేది హిందూదేశానికి రూపాంతరమే. “ఇండియా” అనే వాడుకలో ఉన్న పదానికి బదులుగా భారత్ లేదా హిందుస్థాన్ అనే పేరును అధికారికంగా నామకరణం చెయ్యాలనే ఆలోచనలో బిజెపి ప్రభుత్వం ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. దేశం పేరును మార్చే విషయంలో, బిజెపి ప్రభుత్వం అధికారికంగా ఇంతవరకూ ఎటువంటి ప్రకటనా చెయ్యలేదు. భవిష్యత్తులో చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు చెప్పలేం. కానీ, నామకరణం అంశం కొట్టిపారెయ్యలేం. ఇప్పుడు ఇండియా వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మార్చేందుకు కాంగ్రెస్ మిత్రపక్షాలు ప్రయత్నిస్తూండటంతో బీజేపీ అలాంటి ఆలోచనకు పదును పెట్టినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.

నాగరిక భారతదేశంలో ఇండియా, భారతదేశం, హిందూస్థాన్ అనే పేర్లు మాత్రమే మనకు తెలుసు. కానీ మన దేశానికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఈ భూభాగం మొత్తాన్ని జంబూ ద్వీపం అనేవారు. ఇదే మన ప్రాచీన నామం. తర్వాత భరత శబ్దం వచ్చిచేరి, భరతవర్షం, భారతదేశం అనే పేర్లు రూపొందాయి. హిందూదేశం, ఇండియా అనే పదాలు కూడా వచ్చాయి. జంబూ ద్వీపం అనేది వేదాలలో, పురాణాలలో ఉంది. మేరో అంటే మేరు పర్వతానికి ఏ దిక్కులో ఉంటే, ఆ ప్రాంతీయులు ఆ భాగాన్ని చెప్పుకుంటూ ఉంటారు. అదే సమయంలో నదుల గురించి కూడా ప్రస్తావిస్తారు. భరతుడు పరిపాలించాడు కాబట్టి, ఆ పేరుతో భరతవర్షం, భరతఖండం, భారతదేశం అనే పేర్లు వచ్చాయి. నాగరికత పరిణామంలో భాగంగా, ముఖ్యంగా నదుల ఒడ్డునే నాగరికత పుట్టింది, పేరుమోసింది. హిందూ అనే శబ్దం అలా వచ్చిందే. సింధు నది ఒడ్డున, పరీవాహక ప్రాంతాలలో వెలసిన నాగరికత సింధూ నాగరికత. సింధూ దేశమే హిందూ దేశంగా పిలవబడుతోంది. పర్షియన్లు సింధూను హిందూగా పిలవడం ప్రారంభించారు. ఇండియా అనే పదం కూడా సింధూ నుండి వచ్చిందే. సింధూ నదిని గ్రీకువాళ్లు ఇండస్ నదిగా పిలిచేవాళ్ళు. ఆ ఇండస్ నుండి ఇండియా ఏర్పడింది. గ్రీక్ నుండి జరిగిన అనువాదంలో ” ఇండికా” అనీ, లాటిన్ అనువాదంలో ఇండియా అనే పదాలు వచ్చాయి. సింధు అనేది సంస్కృత పదం. లాటిన్, స్పానిష్, పోర్చుగీస్ భాషా ప్రభావాలతో “ఇండియా” అనే పదం రూపాంతరం చెందింది. వీళ్ళెవ్వరికీ భారతదేశ భౌగోళిక పరిస్థితులు, చరిత్ర, సంస్కృతిపై సమగ్రమైన అవగాహన లేదు.

మన దేశానికి పేరు తిప్పలు రావడానికి కారణం కూడా బ్రిటిష్ వాళ్లే. వారు వచ్చిన తర్వాతనే ఇండియా అనే పదం బలపడింది. ప్రపంచవ్యాప్తంగా అదే కామన్ అయింది. మన భారతదేశం మాత్రం దేశంలో వారికి మాత్రమే పరిమితం అయింది.

బ్రిటీష్ వాళ్లు భారత్ ను దురాక్రమించిన తర్వాత ఇండియా అనే పదం మరింత బలపడింది. దేశ నామకరణంలోని వివిధ నిర్వచనాలు గమనిస్తే, ఇలా ఉన్నాయి. ఇండియా, హోదు, ఇండికా, జంబూద్వీప, భరతవర్ష, భారతం, ఇండోయ్, ఇండో, హింద్, ఇండోస్థాన్, హిందూస్థాన్ ఇలా అనేకం ఉన్నాయి. హింద్ స్థాన్ హిందూస్థాన్ అయ్యింది. ఇది పర్షియన్ ప్రభావంతో జరిగింది. ఈ దేశంలో జీవించేవారంతా హిందుస్థానీయులే. “హిందూ శబ్దం” పరిణామ క్రమంలో నాగరికత నుండి మతం ముద్రలోకి వచ్చేసింది. దీనివల్ల వివాదాలు తలెత్తుతున్నాయి. స్వాతంత్ర్య అనంతరం భారత భౌగోళిక రూపమే మారిపోయింది. ఒకప్పటి భారతదేశం వేరు. ఇప్పటి దేశం వేరు. మొన్నటి వరకూ బంగ్లాదేశ్, పాకిస్తాన్ భారత్ భూభాగాలే. విభజన దశ నుండి వివాదాలు పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో నేడు కొన్ని పదాలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి.

రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత కూడా దేశం పేరుపై వివాదం చాలాసార్లు వచ్చింది. 2005లో సుందరం అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ‘ఇండియా’ అనే పేరును తొలగించి, బదులుగా ‘భారత్’ని ఉపయోగించాలని డిమాండ్ చేశారు. భారత్ అనే పదానికి మతతత్వ భావాలు లేవు కాబట్టి అది దేశం ఏకైక అధికారిక పేరుగా ఉండాలని ఆ తర్వాత కొంత మంది మేధావులు ప్రకటనలు చేశారు. 2012లో కాంగ్రెస్‌కు చెందిన శాంతారామ్ నాయక్ ఇదే సూచనతో రాజ్యసభలో బిల్లును ప్రతిపాదించారు . “”భారతదేశం” అనేది ప్రాదేశిక భావనను సూచిస్తుంది, అయితే “భారత్” అనేది భారతదేశంలోని కేవలం భూభాగాల కంటే చాలా ఎక్కువ సూచిస్తుందన్నారు. మనం మన దేశాన్ని పొగిడినప్పుడు, “భారత్ మాతా కీ జై” అంటాము, “ఇండియా కీ జై” అని కాదు” అని ఆయన వాదించారు. కాని ఆ బిల్లు కనీస చర్చకు కూడా రాలేదు. తర్వాత పేరు మార్పుపై కోర్టుల్లోనూ పిటిషన్లు పడ్డాయి. ఇలా దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది,

ఏకత్వం నుండి అనేకత్వం ఏర్పడుతున్న క్రమంలో, సామరస్యం లేకపోతే, ఏ వ్యక్తి అయినా, దేశమైనా రేపు ఏకాకిగా మిగిలిపోయే పరిస్థితులు వస్తాయి. భిన్న భాషల, సంస్కృతుల సమాగమమైన భారతదేశం తెచ్చుకున్న ప్రతిష్ఠ “ఏకత్వం” నుండి వచ్చిందే. హిందూస్థాన్ అని పిలిచినా, భారత్ అని పిలిచినా దేశం ఒక్కటే. అందరూ భారతీయులే.పేరు పేరుతో.. రాజకీయంగా విడిపోవడం .. దేశాన్ని మరింతగా వివాదంలోకి నెట్టుకున్నట్లవుతుంది.

 

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి