హిండెన్‌బర్గ్ తరహా నివేదిక ఏ ప్రతిపక్ష నేత కంపెనీపైనో వచ్చుంటే ఇలాగే మౌనంగా ఉండేవారా. అంబానీకి పోటీగా అదానీ ఎదిగేందుకు అండగా నిలిచిన పెద్దలు ఎందుకు నోరు విప్పటంలేదు. అదానీని నమ్ముకుని వేలకోట్లు దివాలాతీసిన ఇన్వెస్టర్లకు ఈ ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వలేదా అంటే అస్మదీయులకు ఓ రకంగా, తస్మదీయుల విషయంలో మరోరకంగా స్పందిస్తారా. అదానీపై జేపీసీ వేయాలని ప్రతిపక్షాలు ఉభయసభలను హోరెత్తిస్తున్నాయ్. ఓ పక్క అదానీనేమో ఇది తనపైకాదు భారత సార్వభౌమత్వంపై దాడిగా చెప్పుకుంటున్నారు. అయినా ఈ విషయంలో కేంద్రం ఇప్పటిదాకా సీరియస్‌గా దృష్టి పెట్టనేలేదు.
అదానీ విషయంలో కేంద్రం ఉదారత ప్రదర్శిస్తోందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇప్పుడు బీజేపీలోనూ అదానీ విషయంలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి అదానీపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం సృష్టిస్తున్నాయి. అదానీ కంపెనీల ఆస్తులను కేంద్రం జాతీయం చేయాలన్న డిమాండ్‌ని తెరపైకి తెచ్చారు సుబ్రమణ్యస్వామి. అదానీ ఆస్తులను వేలం వేసి వచ్చిన సొమ్మును నష్టపోయిన వారికి సాయంగా అందించాలన్నది ఆయన డిమాండ్. కొందరు కాంగ్రెస్ నేతలకు అదానీతో ఒప్పందాలున్నాయని ఆరోపిస్తూనే ఈ విషయంలో బీజేపీ తన పవిత్రతను నిరూపించుకోవాలంటున్నారు సుబ్రమణ్యస్వామి. ప్రధాని ఏదో దాచిపెడుతున్నారన్న అనుమానం ప్రజల్లో ఉందంటూ ఆయన బాంబుపేల్చారు. సుబ్రమణ్యస్వామి బాటలోనే బీజేపీ జాతీయనేత సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో అదానీ గ్రూప్‌కి వైసీపీ పెద్దపీట వేయడాన్ని సత్యకుమార్ తప్పుపట్టారు. అనంతపురం జిల్లాలోని తాడిమర్రి మండలం పెద్దకోట్ల, దాడితోట గ్రామాల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 500 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుకు 406.46 ఎకరాలు, కడప జిల్లాలో 470 ఎకరాలు, మన్యం పార్వతీపురం జిల్లాలో 362 ఎకరాలు మరో చోట 318 ఎకరాలను అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విశాఖలో అదానీ డేటా సెంటర్ కోసం మరో 60.29 ఎకరాలు కేటాయించింది. భూములు ఇవ్వడాన్ని సత్యకుమార్ తప్పుపట్టారంటే అదానీ వైపు వేలెత్తి చూపిస్తున్నట్లే. కానీ కేంద్రం మాత్రం అదానీపై ఎలాంటి చర్యలకూ సిద్ధంగా లేనట్లే కనిపిస్తోంది. మరోవైపు అదానీపై విచారణకు ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీం ఫిబ్రవరి 10న విచారణ జరుపుతామని తెలిపింది. ఒకవేళ న్యాయస్థానం సత్వరం విచారణ జరపాలనో నష్టపోయినవారికి న్యాయం చేయాలనో ఆదేశిస్తే కేంద్రం నైతికత బోనులో నిలబడుతుంది. ఒకవేళ అదానీపై ఆ నివేదిక కుట్రపూరితమేనని అనుకుంటే ఆ విషయాన్నయినా కేంద్రం కుండబద్దలు కొడితే బావుంటుంది.