కొద్ది రోజులుగా కరోనా మళ్లీ కదులుతోంది. కదిలేది మామూలుగా కదలడం లేదు చాలా వేగంగా కదులుతోంది. కొద్ది నెలల క్రితం ఇక కరోనా కధ కంచికి వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు. కరోనా మాటను ఇక వినాల్సిన అవసరం కూడా ఉండదనుకున్నారు. కేసుల సంఖ్య కూడా పూర్తిగా తగ్గుముఖం పట్టేయడంతో అందరూ కరోనా భయం నుండి బయటపడిపోయి ఒకప్పటిలా హ్యాపీగా జీవిస్తున్నారు. కరోనా జాగ్రత్తలను అటకెక్కించేశారు. ఎక్కడా కరోనా ప్రోటోకాల్స్ ను ఎవరూ పాటించడం లేదు. ఎవ్వరూ కూడా కరోనా గురించి మాట్లాడుకోవడమూ లేదు. అంతా కరోనాను మర్చిపోయి దైనందిన జీవితాలను గడుపుతోన్న సమయంలో ఉన్నట్లుండి కరోనా కదలికలు వేగం అందుకున్నాయి.
దేశంలో కరోనా యక్టివ్ కేసుల సంఖ్య యాభై వేలు దాటిపోయింది. చూస్తూ ఉండగానే కేసుల సంఖ్య వేగంగా పెరగడానికి కారణం దేశంలో వ్యాప్తిలో ఉన్న కొత్త వేరియంటే అంటున్నారు నిపుణులు. కాకపోతే ఈ వేరియంట్ మనుషుల శ్వాస కోశ వ్యవస్థలపై తీవ్ర మైన ప్రభావం చూపే అవకాశాలు ఉండవు కాబట్టి భయపడాల్సింది లేదని భరోసా ఇస్తున్నారు. మామూలు జలుబుగానే ఇది వచ్చి పోతుందంటున్నారు వారు. ప్రతీ ఒక్కరూ రద్దీ ప్రాంతాల్లో మాస్క్ విధిగా ధరించడంతో పాటు ఇతర కరోనా జాగ్రత్తలోను కొనసాగించడం మేలని సూచిస్తున్నారు. చూస్తూ ఉండగానే రోజు వారీ కేసులు పెరగడం మొదలైంది. మొదట్లో పదుల సంఖ్యలో కేసులు కనిపించాయి దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. నెమ్మదిగా వందల సంఖ్యలో కేసులు నమోదు కావడం మొదలైంది. అయినా ఫర్వాలేదులే అని ధీమాగా ఉండిపోయారు. అంతే అప్పుడు మొదలైంది. ఈ సారి వేల సంఖ్యలో కేసులు నమోదు కావడం మొదలైంది. అందరి గుండెల్లోనూ ఒక్కసారి కరోనా పీడకల మెదిలింది. మళ్లీ కరోనా ప్రమాద ఘంటికలు మోగించేస్తోందా ఏంటి అని కంగారు పడుతున్నారిపుడు. తాజాగా రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల ఇరవై అయిదు మందికి పరీక్షలు నిర్వహించగా 11,709 మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యిందని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అంతకు ముందు రోజు తో పోలిస్తే 9 శాతం కేసులు పెరిగినట్లు వివరించారు. కరోనా మన దేవంలో అడుగు పెట్టినప్పటి నుండి మొదటి రెండు వేవ్ లలోనూ కూడా కరోనా విజృంభణ తీవ్రంగా ఉన్న ఢిల్లీ మహారాష్ట్ర రాష్ట్రాల్లోనే కేసులు అధికంగా నమోదు కావడం గమనార్హం. మళ్లీ ఈరాష్ట్రాల్లో కరోనా పేట్రేగిపోవడం ఖాయమా అని ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. తాజాగా ఢిల్లీలో 1524 కేసులు మహారాష్ట్రలో 1086 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులతో కలిసి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 49622 కి చేరింది. అంటే యాభై వేల మార్క్ చేరుకున్నట్లే చెప్పచ్చు. తాజాగా 11 మంది మృతి చెందారు. ఇది ఇక్కడితో ఆగుతుందా లేక వేల కేసులు కాస్తా లక్షల కేసుల స్థాయికి పెరుగుతాయా అన్న భయం నిద్రపోనివ్వడం లేదు. ప్రస్తుతం దేశంలో హల్ చల్ చేస్తోన్నది XBB1.16 వేరియంటే అని వైద్యులు చెబుతున్నారు. ఇది ఒమిక్రాన్ కి సంబంధించిన సబ్ వేరియంట్. ఒమిక్రాన్ వేరియంట్ కు ఉన్న అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే రాకెట్ వేగంతో వ్యాపించడం. చూస్తూ ఉండగానే కేసులు అమాంతం పెరిగిపోడానికి దీని వేగమే కారణం. మరి ఈ వేరియంట్ ఇలాగే దూసుకుపోతే యాక్టివ్ కేసులు లక్షదాటేసే అవకాశాలు ఉన్నాయి.
ఇపుడు కేసులు సోకిన వారు ఇంత వరకు వ్యాక్సీన్లు వేయించుకోలేదా లేక వ్యాక్సీన్లు వేయించుకున్న వారికి కూడా ఈ వేరియంట్ సోకుతోందా అన్నది అధ్యయనం చేస్తున్నారు. గతంలో కరోనా వచ్చి తగ్గిన వారిలోనూ మళ్లీ ఈ వేరియంట్ సోకుతోందని కూడా చెబుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నాయి అనగానే అందరి మదిలోనూ కరోనా సెకండ్ వేవ్ మెదిలింది. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఎందుకంటే కరోనా రెండో వేవ్ లో డెల్టా వేరియంట్ ఎంతటి వినాశనాన్నీ విషాదాన్నీ విధ్వంసాన్నీ సృష్టించిందో ఎవరూ మర్చిపోలేరు. దేశ వ్యప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ రెండో వేవ్ మరణ మృదంగం వాయించింది. వైరస్ తీవ్రత ప్రమాదకరంగా ఉండింది. ఊపిరి తిత్తుల్లోకి శ్వాసకోశ వ్యవస్థలోకి చొచ్చుకుపోయిన వైరస్ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడింది. అప్పుడు కరోనా వైరస్ తీవ్రత కారణంగా ప్రతీ ఇంటికీ ఒకరు చొప్పున పాడె కట్టారు. ఇంటింటా విషాదం అలుముకుంది. స్మశానాలు అంత్యక్రియలతో నిండిపోయాయి. ఆసుపత్రుల్లో పడకలు దొరకలేదు. ఆసుపత్రిలో బెడ్ దొరక్క అంబులెన్స్ లోనే గంటల తరబడి నిరీక్షించిన వారున్నారు. ఆసుపత్రిలో చేరాక ఆక్సిజన్ కొరతతో తలలు వాల్చేసిన వారున్నారు. స్టిరాయిడ్స్ ఆధారిత ఔషధాలు రెమ్ డెసివర్ వంటి ఇంజక్షన్లు బ్లాకులో కొనుక్కుని ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రుల్లో ఐసీయూలో బెడ్ కోసం లక్షలకు లక్షలు చెల్లించాల్సి వచ్చింది. మనుషులు ఆర్ధికంగానూ మానసికంగాను శారీరకంగానూ దివాళా తీశారు. రెండో వేవ్ ను చూసిన వారు పగవాడిక్కూడా ఈ కష్టం రాకూడదని దేవుడికి మొక్కుకున్నారు. ఒక్క భారత్ లోనే కాదుప్రపంచ వ్యాప్తంగా రెండో వేవ్ లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది.
ఆ భయాన్ని ఆ విషాదాన్ని ఇప్పటికీ జనం మర్చిపోలేకపోతున్నారు. అంతగా వెంటాడుతూ వచ్చింది ఆభయం. అందుకే కరోనా కేసులు పెరుగుతున్నాయనగానే మళ్లీ మృత్యు వార్తలు వినాల్సి వస్తుందా అని బెంబేలెత్తి పోతున్నారు. అయితే రెండో వేవ్ తరహా విషాదాలు ఇక ఉండనే ఉండవని వైద్యులు శుభవార్త చెబుతున్నారు. ఎవ్వరూ కూడా ఇపుడు పెరుగుతోన్న కేసుల సంఖ్యను చూసి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని వారు భరోసా ఇస్తున్నారు. ఇపుడు వ్యాప్తిలో ఉన్న వేరియంట్ అత్యంత బలహీనమైన వేరియంటేనని వారంటున్నారు. సవాలక్ష తేలికపాటి జలుబు కలిగించే వైరస్ లలో ఇది కూడా ఒకటని వారు వివరిస్తున్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ వైరస్ తీవ్రత మాత్రం చాలా తక్కువ అంటున్నారు డాక్టర్లు. ఒమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టిన వెంటనే జరిపిన అధ్యయనాలను బట్టి కరోనా అంతానికి ఒమిక్రానే నాంది పలికిందని నిపుణులు తేల్చి చెప్పారని వైద్యులు అంటున్నారు. సంఖ్య పెరగడంతోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. వ్యాక్సినేషన్ ఒక్కసారి కూడా తీసుకోని వారికి వ్యాక్సీన్లు వేయించాలని ఆదేశించారు. సీరం ఇన్ స్టిట్యూట్ వ్యాక్సీన్ డోసులను అందుబాటులోకి తెచ్చేందుకు ఉత్పత్తిపై దృష్టి సారించింది.