ఆకలి లేనపుడు అరిగే పరిస్థితి లేనపుడు ఉపవాసం చేశామని చెప్పుకోవడం ఒక విధమైన గడుసుతనం. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప కూడా అదే పని చేస్తున్నారు. తాను క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నానని ఎనభై ఏళ్ల ఎడ్యూరప్ప చాలా సీరియస్ గా ఎనర్జెటిక్ గా ప్రకటించి రాజకీయ వర్గాలకు కావల్సినంత కామెడీ పంచారు.
ఫిబ్రవరి 27 న కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిజెపి వృద్ధ నాయకుడు ఎడ్యూరప్పకు ఎనభై ఏళ్లు నిండి ఎనభై ఒకటి వస్తుంది. అంత చిన్న వయసులో ఉండీ కూడా ఎడ్యూరప్ప ఇక యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండకూడదని చాలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని తాజాగా ప్రకటించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దాంతో పాటు అనుమానాలూ పెరుగుతున్నాయి. అసలు ఆయన ఇంకా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారా అని రాజకీయ పండితులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే 2021లోనే బసవరాజ్ బొమ్మైని పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి సీటుపై కూర్చోబెట్టినపుడే ఎడ్యూరప్ప క్రియాశీలక రాజకీయ శకం ముగిసిపోయింది. అపుడు బొమ్మైని ఎందుకు సిఎంని చేసినట్లు. బిజెపి అధినాయకత్వం కొన్నేళ్ల క్రితం పెట్టుకున్న ఓ కీలక నిబంధన ప్రకారమే ఎడ్యూరప్ప ను పక్కన పెట్టాల్సి వచ్చింది. 75 ఏళ్లు నిండిన యంగ్ టర్కులకు ఎలాంటి పదవులూ ఉండకూడదన్ని పార్టీ తనకు తాను విధించుకున్న నిబంధన.
ఈ నిబంధనను పెట్టడానికి కారణాలు లేకపోలేదు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక తనకంటే సీనియర్లు అయిన అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి దిగ్గజాలను పక్కన పెట్టడానికి ఏం చేయాలా అని ఆలోచించిన మోదీ వారి వయసు 75 ఏళ్లు దాటేసిందని గ్రహించి ఆ నిబంధన తీసుకు వచ్చారు. దాని ప్రకారమే అద్వానీ, జోషీ వంటి వారికి పదవులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. దాంతో మోదీ కాస్త ప్రశాంతంగా తన ఉద్యోగం చేసుకుంటున్నారు. ఈ నిబంధనకు అనుగుణంగానే ఎడ్యూరప్పనూ 2021లో తప్పించారు. నిజానికి అప్పటికే ఆయనకు 78 ఏళ్ల వయసుంది.
2019లో కాంగ్రెస్ జేడీఎస్ ల కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపిన బిజెపి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో అధికారంలోకి వచ్చింది. అపుడు ఎడ్యూరప్పను ముఖ్యమంత్రిని చేశారు. పార్టీ నిబంధన మేరకు అప్పుడే ఆయనకు ఆ పదవి ఇచ్చి ఉండకూడదు.
కాకపోతే అంతకు ముందటి ఎన్నికలను ఆయనే దగ్గరుండి గెలిపించి ఆరు రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కుమార స్వామి అమాంతం ముఖ్యమంత్రి అయిపోయారు. కుమార స్వామి నుండి తిరిగి ప్రభుత్వాన్ని గుంజుకున్నాక ఎడ్యూరప్పకు పదవి ఇవ్వకపోతే బాగుండదని ఇచ్చేసినట్లున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. బొమ్మైని సిఎంని చేసిన మరుక్షణమే ఎడ్యూరప్ప క్రియాశీలక రాజకీయానికి తెరపడింది. ఇటీవల పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన కేంద్రం ఎడ్యూరప్పకు కూడా గవర్నర్ పదవిని ఇచ్చి ఆంధ్రప్రదేశ్ పంపుతారని ప్రచారం జరిగింది కూడా. కాకపోతే ఎందుకో కానీ అలా జరగలేదు. పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఎడ్యూరప్పకు రాజకీయ పదవులు ఇక వచ్చే ఛాన్స్ లేనపుడు ఆయన క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పడంలో అర్ధం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. 96 ఏళ్లు పైబడిన అద్వానీ రేపు నేను క్రియాశీలక రాజకీయాలనుండి తప్పుకుంటున్నానంటే అర్ధం ఉంటుందా అని వారు ప్రశ్నిస్తున్నారు.