5జి వచ్చేస్తోంది. వినియోగదారుల్లో ఆనంందంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇండియా ఆలస్యం చేస్తోందన్న అసహనం పెరిగిపోతోంది. నెట్ వర్క్ స్పీడ్ కోసం సగటు భారతీయుడు ఎదురు చూస్తున్నాడు. ఇక చైనా అయితే ఇప్పటికే 6జిపై పరిశోధనలు మొదలు పెట్టింది…
స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు వేగం పెరగబోతున్నాయి. హై స్పీడ్ నెట్ వర్క్ రంగ ప్రవేశం చేయబోతోంది. ఇప్పటి వరకు ఉన్న 4జి స్పీడ్ ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదని, గంటల తరబడి పని చేయాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది, ప్రపంచమంతా 5 జి నెట్ వర్క్ కు అలవాటు పడుతున్న వేళ.. ఇండియా కూడా ఆ దిశగా అడుగులు వేసింది. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 5జి నెట్ వర్క్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 20 సంవత్సరాల వరకు అమలులో ఉండే స్పెక్ట్రం వేలానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర ఐటీ, టెలికం శాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్…. వెల్లడించారు. ఇటీవలే మద్రాసు ఐఐటీలో సమర్థంగా ప్రయోగించి చూశారు. ఆత్మనిర్భర్ 5జి . ఐఐటీ మద్రాస్‌లో 5జి కాల్‌ను విజయవంతంగా పరీక్షించారు. ఈ నెట్వర్క్ పూర్తిగా భారత్‌లోనే అభివృద్ధి చేశారు
బెంగళూరు మెట్రో రైలు కూడా 5జిని ప్రయోగాత్మకంగా వాడి చూసింది. 4జి కంటే పది రెట్లు స్పీడ్ ఉందని మద్రాసు ఐఐటీ చెబుతుండగా.. యాభై రెట్లు స్పీడ్ కనిపించిందని బెంగళూరు మెట్రో రైలు వెల్లడించింది…
దేశంలో 5జి సేవల విస్తరణ ప్రక్రియ సెప్టెంబరు నాటికి ప్రారంభం కావచ్చు. తొలి దశలో హైదరాబాద్ సహా 13 నగరాల్లో 5జి సేవలు అందిస్తామని మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుత ఏడాది ముగింపు నాటికి దేశంలో 25 నగరాల్లో 5జి సేవలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ ముగింపు నాటికి 5 శాతం 5జి కనెక్టివిటీ విస్తరణకు అవకాశం ఉందని అంచనా. వచ్చే ఐదేళ్లలో దేశంలో 5జి ఖాతాదారుల సంఖ్య 50 కోట్లకు చేరొచ్చని ఎరిక్సన్ నివేదిక వెల్లడించింది. 2027 నాటికి మొబైల్ ఖాతాదారుల్లో 40 శాతం మంది 5జి ఎంచుకోవచ్చని తెలిపింది. ఇదే సమయంలో దేశంలో డాటా వినియోగం భారీగా పెరుగుతుంది..
ప్రపంచంలో 5 జీ సేవలను మొదట దక్షిణ కొరియా, చైనా, యునైటెడ్ స్టేట్స్ లో ప్రవేశపెట్టారు. ఈ రకమైన సేవలు ఇప్పటికే 68 దేశాల్లో ప్రారంభమయ్యాయి. ఇందులో శ్రీలంక, ఒమన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ వంటి అనేక చిన్న దేశాలు కూడా ఉన్నాయి. 5జి నెట్ వర్క్ వినియోగిస్తున్న చాలా దేశాల్లో 40 శాతం మంది మాత్రమే వాడుతున్నరు. ఇండియాలో 5జి ప్రవేశపెట్టిన తర్వాత ఏడాదికి 16 శాతం చొప్పున విస్తరిస్తుందని చెబుతున్నారు. అయితే దేశంలో జనాభా ఎక్కువగా ఉండటం, సెల్ ఫోన్లు ఎక్కువగా ఉండటంతో వినియోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. డేటా వినియోగంలో చైనా అందరికంటే ముందున్నది. చాలా దేశాలు 5జి నెట్ వర్క్ కు అలవాటు పడేందుకు ప్రయత్నిస్తుండగా. . చైనా అప్పుడే 6జిపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది జనవరిలోనే 206 గిగా బైట్స్ స్పీడ్ సాధించినట్లు చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు ఆరో తరం వైర్ లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో 20 రెట్లు స్పీడ్ పెరుగుతుందని డ్రాగన్ కంట్రీ చెబుతోంది… అయితే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎలాంటి రోడ్ మ్యాప్ ప్రకటించలేదు…
5జి వల్ల ప్రతీ ఒక్కరి ఆరోగ్యం దెబ్బతింటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాని వల్ల వెలువడే రేడియో ధార్మికతతో మనుషులతో పాటు పశువులకు కూడా హాని కలుగుతుందని భావిస్తున్నారు. 5జీలోని రేడియో ఫ్రీక్వెన్సీ చాలా చాలా ఎక్కువ. సుదూర ప్రాంతాలకు సైతం అది సరిగా అందాలంటే సెల్ టవర్లు ముమ్మరంగా వినియోగించాలి. కనుక జనాభాలో అత్యధికులు దీని ప్రభావానికి లోనుగాక తప్పదన్న అభిప్రాయం కలుగుతోంది. అధికశక్తిమంతమైన విద్యుత్ అయస్కాంత తరంగాలు వినియోగించడం వల్ల రేడియేషన్ పెరిగి కేన్సర్ లాంటి వ్యాధులు కూడా రావచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. 5జి నెట్ వర్క్ ను వ్యతిరేకిస్తూ బాలీవుడ్ నటి జుహ్లీ చావ్లా కేసు వేశారు. పిటిషన్ లో లోపాలున్నాయంటూ ఢిల్లీ హైకోర్టు దాన్ని కొట్టేసింది. ఆమెతో పాటు మరో ఇద్దరికి 20 లక్షల రూపాయలు జరిమానా కూడా విధించింది. 5జీ రేడియేషన్ తో అనారోగ్యం పాలవుతారన్న వాదనను సెల్యులార్ ఆపరేటర్లు తోసిపుచ్చుతున్నారు. మైక్రోవేవ్ ఒవెన్‌లతో పోల్చితే సెల్ ఫోన్లు విడుదల చేసే రేడియేషన్ చాలా తక్కువని వాళ్లు వాదిస్తున్నారు. ఫోన్ కొంచెం దూరం పెట్టి మాట్లాడటం లాంటి చర్యల ద్వారా ఇబ్బందుల నుంచి బయట పడవచ్చని చెబుతున్నారు. అదే సమయంలో 5జి నెట్ వర్క్ ద్వారా కనీసం లక్షన్నర కొత్త ఉద్యోగాలు సష్టించే వీలుందని, అది కాకుండా వ్యాపారాలు కూడా వృద్ధి చెందుతాయని వెల్లడించారు…
ఎట్టి పరిస్థితుల్లో 5జిని వీలైనంత త్వరగా రోలవుట్ చేయడానికి కేంద్రం ప్రభుత్వం సిద్ధమవుతోంది. వేలం రుసుమును వాయిదాల పద్ధతిలో వసూలు చేసేందుకు కూడా రెడీ అంటోంది. ప్రజలకు అతి వేగ నెట్ వర్క్ అందించడమొక్కటే తమ ధ్యేయమని ప్రభుత్వం చెబుతోంది. దీని కోసం రిలయన్స్ లాంటి సంస్థలు ఇప్పటికే తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి…