ఆహా..బాబు రాజకీయం

By KTV Telugu On 22 October, 2022
image

వెన్నుపోటు ఎపిసోడ్ పై బాబు హాట్ కామెంట్స్
తన తప్పు లేదని చెప్పుకునే ప్రయత్నం
నాడు అల్లుడిని ఔరంగజేబుతో పోల్చిన ఎన్టీఆర్
పార్టీని లాక్కొని ఘోరంగా అవమానించావ్ ?
చరిత్ర చెరిగిపోతుందా..మచ్చ తొలిగిపోతుందా?
బాబుపై ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం
ఇప్పుడు ఏపీలో బలహీనపడిన టీడీపీ సంగతేంటి?
జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించాలనే డిమాండ్

టీడీపీ అధినేత చంద్రబాబు….. తన వియ్యంకుడైన హీరో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించే అన్ స్టాపబుల్ షోను తన రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలనుకున్నారా? ఆహా ప్లాట్ ఫారం మీద ఎన్టీయార్ వెన్నుపోటు ఎపిసోడ్ ని ముందు పెట్టి తమ తప్పు లేదని చెప్పుకోవడానికి ప్రయత్నించారా? 2024 ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా టీడీపీకి ఉన్నాయి. ఏపీలో గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన తెలుగుదేశం పార్టీకి…ఆ తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికలోనూ చేధు ఫలితాలే ఎదురయ్యాయి. నారా లోకేశ్ మంగళగరిలో తొలి ప్రయత్నంలోనే ఓటమి పాలయ్యారు. చంద్రబాబు సొంత ఇలాక కుప్పంలో టీడీపీ మున్సిపాలిటీని కోల్పోయింది. రానున్న ఎన్నికల్లో ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లోంచి పార్టీని గట్టెక్కించి, తిరిగి అధికారం చేజిక్కించుకునేందుకు చంద్రబాబు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ అన్ స్టాపబుల్ టాక్ షో కూడా దాంట్లో భాగమేనని తెలుస్తోంది.

చంద్రబాబు.. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచాడనే విషయం గత రెండున్నర దశాబ్దాలుగా వినిపిస్తుంది. ఇది రాజకీయంగా చంద్రబాబును అనేకసార్లు ఇరుకునపెడుతోంది. సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రత్యర్థులు తరచుగా ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొస్తూ తనను టార్గెట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో బాబు తనపై ఉన్న మచ్చను చెరిపివేసుకోవాలనుకున్నారో ఏమో? తెలియదు గానీ… బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ పేరుతో నిర్వహిస్తున్న టాక్‌ షోలో పాల్గొని.. ఆనాటి అధికార మార్పిడి పరిణామాలపై స్పందించారు. తనను ఎన్నాళ్లుగానో ఇరుకునపెడుతున్న వెన్నుపోటు అనే సంచలన విషయంపై నోరు విప్పారు. బాలయ్య చంద్రబాబును తమ జీవితంలో బిగ్ డెసిషన్ ఏంటి అని ప్రశ్నించగా… 1995లో జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని బతిమిలాడిన వినలేదు. తప్పని పరిస్థితుల్లోనే పార్టీని లాక్కోవాల్సి వచ్చిందని చంద్రబాబు చెప్పారు. ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా? అంటూ చంద్రబాబు ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణను ఇన్ వాల్వ్ చేశారు. బాలయ్యను వెన్నుపోటు ఎపిసోడ్ లో ఇరికించి బాబు తన తప్పును కడిగేసుకునే ప్రయత్నం చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అటు బాలయ్య కూడా చంద్రబాబును సమర్థిస్తూ తీవ్ర విమర్శల పాలయ్యారు.

ఎన్టీఆర్ కు పార్టీ నడపడం చేతగాకపోతే, చంద్రబాబు ఆయన దగ్గర్నుంచి వెళ్లిపోవాలే గానీ…పార్టీ లాక్కోవడమేంటని కొడాలి నాటి లాంటి నేతలు బాబుపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బాగా వీక్ అయిపోయింది. ఇలాంటి సమయంలో పార్టీని గట్టెక్కించేందుకు జూనియర్ ఎన్టీఆర్ లాంటి నేతలకు పగ్గాలు ఎందుకు అప్పజెప్పడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. పదవీ కాంక్షతో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడమే గాకుండా…చనిపోయిన వ్యక్తిపై 25ఏళ్లుగా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ చంద్రబాబుపై ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు భ్రష్టుపట్టించారని ఫైర్ అవుతున్నారు. పార్టీని జూనియర్ ఎన్టీఆర్ కు అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

చరిత్ర అన్నది చెరిగిపోయేది కాదు. చంద్రబాబు తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోలేరని…ఆనాటి ఘటన చూసిన వారు అంటున్నారు. ఎందుకంటే, బాబు వెన్నుపోటు గురించి నాడు ఎన్టీఆరే స్వయంగా చెప్పారు. చంద్రబాబు తన పార్టీలో ఆషాడభూతిగా చేరి తనను మోసం చేశారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అంతే కాదు ఎన్నికల ముందే ఆయన టీడీపీని చీల్చాలని చూశారని కూడా ఆరోపణ చేశారు. 1994 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో తన పార్టీకి ఇంత పెద్ద ఎత్తున సీట్లు వస్తాయని బాబు అసలు ఊహించలేదని, దాంతో ఆయన ఎనిమిది నెలల పాటు సర్దుకుపోయినట్లుగా ఉండి చివరికి తన వారితోనే తన మీద తిరుగుబాటు చేయించి పదవి తీసుకున్నారని ఎన్టీఆర్ అప్పట్లో ఆరోపించారు. చంద్రబాబును ఔరంగజేబుతో కూడా పోల్చారు. ఎన్టీఆర్ ఆరాధ్య దైవం అయితే ఆయనపై చెప్పులు ఎందుకు వేయించారు. పదవి లాక్కున్న తర్వాత ఆయన ఫోటోలను పార్టీ ఆఫీసులో కనిపించకుండా ఎందుకు చేశారని బాబును పలువురు ప్రశ్నిస్తున్నారు.