తెలంగాణకు అమరరాజా.. ఏపీమీద వైరాగ్యమా?

By KTV Telugu On 2 December, 2022
image

జాకీ వెళ్లిపోయింది.. ఈసారి అమరాజా వంతా?

పెనుగొండలో పరిశ్రమ పెట్టాల్సిన జాకీ కంపెనీ తట్టాబుట్టా సర్దేసుకుంది. ఎమ్మెల్యేకి ముడుపులు ఇవ్వడం ఇష్టంలేకే జాకీ దుకాణం కట్టేసిందని విపక్షం విమర్శిస్తోంది. టీడీపీ హయాంలోనే ఆ పరిశ్రమ ఎందుకు పెట్టలేదని వైసీపీ కౌంటర్‌ ఇస్తోంది. ఎవరు తప్పు ఎవరు ఒప్పు అన్నది పక్కనపెడితే పదిమందికీ ఉపాధి కల్పించే ఓ పరిశ్రమ ఏపీనుంచి జారిపోయింది. పాలసీలు ఎంత బాగున్నా స్వార్థ రాజకీయం కొన్ని పరిశ్రమలకు సెగ పెడుతోంది. అమరరాజా గ్రూప్‌ తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయు కూడా కుదుర్చుకుంది. తెలంగాణలో చాలా పరిశ్రమలు వస్తున్నా అమరరాజా రావడం ఓ విశేషమేనని చెప్పాలి. ఎందుకంటే అది టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కి చెందిన కంపెనీ. తెలంగాణలో తన కంపెనీ విస్తరణకు అమరరాజా సుమారు రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టడాన్ని మంత్రి కేటీఆర్‌ స్వాగతించారు. ఈవీ వెహికల్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కంపెనీని అమరరాజా తెలంగాణలో స్థాపించబోతోంది.

మూడున్నర దశాబ్దాలుగా ఏపీ కేంద్రంగానే అమరరాజా కంపెనీ కార్యకలాపాలు సాగుతున్నాయి. గల్లా జయదేవ్‌ తల్లి అరుణకుమారి మాజీ మంత్రిగా కూడా పనిచేశారు. జయదేవ్‌ వరసగా రెండుసార్లు గుంటూరు ఎంపీగా గెలిచారు. చిత్తూరుజిల్లాలో ఉన్న అమరరాజా కంపెనీ పోయినేడాది ప్రభుత్వపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కుంది. పొల్యూషన్ నిబంధనలు పాటించందుకు అమరరాజా బ్యాటరీ కంపెనీలు మూసేయ్యాలని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కంపెనీ యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది.
పరిశ్రమలు అన్నాక అన్నీ నూటికి నూరుశాతం పర్‌ఫెక్ట్‌గా ఉండవన్నది ఓపెన్‌ సీక్రెట్‌. నెల్లూరుజిల్లాలో ఆపాచీపరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఎన్నోసార్లు ఆందోళనలకు దిగారు. నిబంధనల ఉల్లంఘన ఉంటే నోటీసులివ్వడం, మరోసారి జరగకుండా చూడటం సాధారణమే. కానీ ప్రభుత్వం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోందన్న భావన అమరరాజా యాజమాన్యంలో ఉంది. వాస్తవానికి సొంత రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉంటే పరిశ్రమ విస్తరణ కూడా అక్కడే జరిగి ఉండేది. కానీ తెలంగాణవైపు చూశారంటే అదే సురక్షితమని భావించబట్టే. ప్రతీదీ రాజకీయకోణంలో చూస్తే అంతిమంగా నష్టం రాష్ట్ర ప్రగతికే.